ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ఇది రింగ్ కాక మరేమిటి..?

ABN, Publish Date - May 26 , 2024 | 01:34 PM

రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రైతన్నల నుంచి సేకరించిన ధాన్యంపై కన్ను వేసి అవినీతి దందాకు ఈ సర్కార్ తెర తీసిందని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్, మే 26: రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రైతన్నల నుంచి సేకరించిన ధాన్యంపై కన్ను వేసి అవినీతి దందాకు ఈ సర్కార్ తెర తీసిందని ఆయన ఆరోపించారు. సన్న బియ్యం కొనుగోలులో రూ. వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందని స్పష్టం చేశారు.


బీఆర్ఎస్ అంటే స్కీమ్‌లు.. కాంగ్రెస్ అంటే స్కామ్‌లని ఆయన అభివర్ణించారు. ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. గల్లీమే లూటో ఢిల్లీలో భాటో అన్నదే కాంగ్రెస్ పార్టీ నీతి అని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కుంభమేళ అని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే బి ట్యాక్స్, యూ ట్యాక్స్‌తోపాటు ఆర్ఆర్ ట్యాక్స్ రాజ్యమేలుతుందని గుర్తు చేశారు. అయితే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తమ జేబు నింపుకోనే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేటీఆర్ మండిపడ్డారు.


35 లక్షల ధాన్యం విక్రయం కోసం గ్లోబల్ టెండర్ల పేరుతో మొదటిగా స్కాంకు.. అలాగే 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు ప్రక్రియ ద్వారా రెండో స్కామ్‌కు ఈ ప్రభుత్వం తెర తీసిందన్నారు. మొత్తం రూ. వెయ్యి కోట్ల స్కాం జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. 2100 క్వింటాలు చొప్పున ధాన్యం కొంటామని మిల్లర్లు అంటున్నా వారికి ఇవ్వకుండా గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు స్కెచ్ వేశారన్నారు. ఇక ఈ గ్లోబల్ టెండర్లను.. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే సంస్థలు దక్కించుకున్నాయని ఆయన పేర్కొన్నారు.


ఈ సంస్థల్లో కేంద్రీయ బండార్‌ను గతంలో తమ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పట్టిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అదీకాక సదరు సంస్థకు నిబంధనల్లో మినహాయింపు ఇచ్చి మరీ బ్లాక్ లిస్టు కంపెనీని టెండర్లలో పాల్గొనేలా చేసిందని విమర్శించారు. ఈ నాలుగు సంస్థలు కేవలం ధాన్యం మాత్రమే సేకరించుకుని వెళ్లాలి.. కానీ మిల్లర్ల వద్ద డబ్బులు తీసుకొని మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఇక గత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థకు ఎందుకు అనుమతి ఇచ్చిందో.. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు. అందులో రూ. వందల కోట్లు మీకు ముట్టిన విషయంపై కూడా రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం సేకరించాల్సిన 2.20 లక్షల సన్న బియ్యం కొనుగోలులో రూ.300 కోట్లు అవినీతికి తెర లేపిందన్నారు.


రాష్ట్రంలో రూ.35 రూపాయలకు కొత్త సన్నబియ్యం అందుబాటులో ఉంటే ఈ ప్రభుత్వం రూ.57 రూపాయలకు కిలో చొప్పున కొంటుందని చెప్పారు. ఇక సన్న బియ్యం కొనుగోలుకు కూడా గ్లోబల్ టెండర్ అనే కుట్రకు లేపిందన్నారు. ధాన్యం సేకరణలో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన అవే నాలుగు కంపెనీలకు బియ్యం కొనుగోలును సైతం అవే సంస్థలకు కట్టబెట్టిందని పేర్కొన్నారు. నాలుగు సంస్థలు దాదాపు ఒకే ధరకు టెండర్ వేశాయంటే... ఇది రింగు కాక మరేమిటని రేవంత్ సర్కార్‌ను కేటీఆర్ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ఈ రెండింటిలో మొత్తం రూ.1,100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలు అనుమతి లేకుండా ఏమీ జరగదనే విషయం అందరికీ తెలుసునని కేటీఆర్ పేర్కొన్నారు.


ఈ మొత్తం స్కామ్‌లో బిజెపి పాత్ర కూడా ఉందని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధర అమలు, బియ్యం సేకరణ తదితర అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో జరుగుతాయన్నారు. అయితే ఈ అంశంలో అవినీతి జరిగిందంటూ బిజెపి శాసనసభా పక్ష నేత స్వయంగా చెబుతున్నారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా స్పందించ లేదన్నారు. దీనిని ఏమనుకోవాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఈ రెండు టెండర్ల వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కేటీఆర్ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.


ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలన్నారు. ఇక వ్యవహారంలో కేంద్రం, ఎఫ్‌సీఐ, రేవంత్ సర్కార్ స్పందించకుంటే.. ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టమన్నారు. న్యాయపరంగా కేసులు వేసి దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. ఈ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలతో.. వీళ్ళందరిని కోర్టుతోపాటు ప్రజా కోర్టులోనూ ఎండగడతామమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 01:44 PM

Advertising
Advertising