Share News

Allu Arjun: తప్పయిపోయింది!

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:14 AM

తగ్గేదే లే’ అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్‌.. నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్తంత వెనక్కి తగ్గారా? తప్పు ఒప్పుకొని కంటతడి కూడా పెట్టారా? అంటే.. పోలీసు వర్గాలు ఇందుకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి.

Allu Arjun: తప్పయిపోయింది!

చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్‌ భావోద్వేగం!.. తొక్కిసలాట దృశ్యాలు చూసి చలించిన బన్నీ

అతడి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ

ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 దాకా..

సినిమాకి నేరుగా వెళ్లక రోడ్‌షో ఎందుకు చేశారు?

అనుమతి లేనిదే రోడ్‌ షో చేయడం తప్పని తెలీదా?

రేవతి చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది?

వెళ్లిపోవాలని ఏసీపీ చెప్పినా.. ఎందుకు వెళ్లలేదు?

దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్‌మీట్‌ ఎలా పెట్టారు?

20 ప్రశ్నలు..! ఒకట్రెండు తప్ప అన్నింటికీ జవాబు

ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టీకరణ

మూడుసార్లు విరామం.. బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు

ఠాణా వద్దకు భారీగా అభిమానులు.. స్వల్పఉద్రిక్తత

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/చిక్కడపల్లి/రాంనగర్‌, కవాడిగూడ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘తగ్గేదే లే’ అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్‌.. నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్తంత వెనక్కి తగ్గారా? తప్పు ఒప్పుకొని కంటతడి కూడా పెట్టారా? అంటే.. పోలీసు వర్గాలు ఇందుకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ఆ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన దుర్ఘటనకు తాను కారణం కాదని ఇన్నిరోజులుగా చెబుతున్న బన్నీ.. తనవల్ల పెద్ద తప్పు జరిగిపోయిందంటూ మంగళవారం పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు! తోపులాటలో కిందపడి అపస్మారకస్థితిలోకి వెళ్లిన రేవతి, శ్రీతేజ్‌ను బతికించడం కోసం పోలీసులు సీపీఆర్‌ చేసిన వీడియోని చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు!! తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు చూపిన 10 నిమిషాల వీడియో చూసి ఆయన భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. ‘పుష్ప-2’ ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు.. భార్య, కుమార్తె గేటుదాకా వచ్చి సాగనంపగా.. తండ్రి అల్లు అరవింద్‌, మామ చంద్రశేఖర్‌ రెడ్డి, బన్నీ వాసుతో కలిసి ఆయన జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. మరోవైపు.. చిక్కడపల్లిపోలీసులు ఠాణా పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అటువైపు ఎలాంటి వాహనాలనూ అనుమతించలేదు.

gh.jpg

పాదచారులను సైతం రానివ్వలేదు. చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నింటినీ మూయించారు. ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. 11.05 గంటలకు అల్లు అర్జున్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోగానే గేట్లు మూసేశారు. అల్లు అరవింద్‌ను, చంద్రశేఖర్‌ రెడ్డిని, బన్నీ వాసును కిందే ఆపేసిన పోలీసులు.. బన్నీని ఠాణా మొదటి అంతస్తులోని ఏసీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌, ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజు నాయక్‌ బృందం.. అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ ప్రారంభించారు. మధ్యాహ్నం 2:45 వరకు.. మూడున్నర గంటలపాటు ఈ విచారణ కొనసాగింది.


ik.jpg

ప్రశ్నల వర్షం..

విచారణలో భాగంగా అల్లు అర్జున్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ‘‘ప్రీమియర్‌ షోకి హీరో హీరోయిన్‌లను రానివ్వొద్దంటూ పోలీసులు థియేటర్‌ యాజమాన్యానికి లిఖిత పూర్వకంగా తెలిపిన విషయం మీ దృష్టికి వచ్చిందా? రాలేదా? ఒకవేళ యాజమాన్యం ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడంలో విఫలమైతే.. మీరు కుటుంబంతో పాటు ప్రీమియర్‌ షోకు వచ్చినప్పుడు నేరుగా థియేటర్‌లోకి వెళ్లకుండా బయట నుంచే ఓపెన్‌ టాప్‌ వాహనంలో నిలబడి చేతులు ఊపుతూ రోడ్‌షో ఎందుకు చేశారు? అలా చేయడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? అనుమతి లేకుండా రోడ్‌షో చేయడం తప్పని మీకు తెలియదా? జరిగిన ఘోరం గురించి మీ దృష్టికి తెచ్చి.. వెంటనే అక్కణ్నుంచీ వెళ్లిపోవాలని సూచించినా ఎందుకు వెళ్లలేదు? అదే విషయాన్ని థియేటర్‌ యాజమాన్యం ద్వారా చెప్పించినా, స్వయంగా ఏసీపీ వచ్చి చెప్పినా మీరు ఎందుకు పట్టించుకోలేదు? మీ వల్ల జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ నిండు ప్రాణాలు కోల్పోవడంతోపాటు ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎలాంటి అనుమతులూ లేకుండా బౌన్సర్‌లను, ప్రైవేట్‌ సెక్యూరిటీని థియేటర్‌ వద్దకు ఎలా తీసుకొస్తారు? మీతో పాటు.. మీ కోసం వచ్చి ప్రైవేట్‌ సెక్యూరిటీ, బౌన్సర్‌ల అత్యుత్సాహం వల్ల, థియేటర్‌లో తొక్కిసలాటకు జరుగుతుంటే మీరు ఎందుకు స్పందించలేదు?’’ అంటూ డీసీపీ ప్రశ్నలు సంధించారు.


gjn.jpg

రేవతి చనిపోయిన విషయం తనకు ఆరోజు తెలియదని, ఇంటికి వెళ్లిన తర్వాత తన ఫోన్‌ బయటపెట్టి, ఉదయం వరకూ లేపవద్దని చెప్పి తాను పడుకున్నానని, బన్నీవా్‌సకు ఆ రాత్రే ఈ విషయం తెలిసిందని, మర్నాడు ఉదయం అతని ద్వారా తమకూ తెలిసిందని అర్జున్‌ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా పోలీసులు ఒక్కొక్క ప్రశ్నా వేస్తూ.. దానికి అల్లు అర్జున్‌ చెప్పిన జవాబు విని, సంబంధిత వీడియోను ఆయనకు చూపించినట్టు సమాచారం. ఉదాహరణకు.. ‘‘పోలీసు అధికారులు థియేటర్‌లో ఉన్న మీ వద్దకు రాలేదని అన్నారుగా?’’ అనే ప్రశ్నకు.. రాలేదని బన్నీ సమాధానమివ్వగా, ‘అయితే ఇదిగో ఈ వీడియో చూడండి’ అంటూ పోలీసు ఉన్నతాధికారులు థియేటర్‌ లోపలికి వస్తున్న వీడియోను ఆయనకు చూపించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. అల్లు అర్జున్‌ థియేటర్‌కు రావడానికి ముందు నుంచీ బౌన్సర్లు వ్యవహరించిన తీరును, ఆయన గేట్లు మూసివేయాలని బౌన్సర్లకు చెప్పిన దృశ్యాలను పోలీసులు చూపించినప్పుడు.. తన వల్ల తప్పు జరిగిందని ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కారు టాప్‌ నుంచి ఆయన అభిమానులకు అభివాదం చేసిన వీడియోలు, ట్రాఫిక్‌ జామ్‌ వీడియోలనూ పోలీసులు చూపించారు. అలాగే.. ఇటీవల పెట్టిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ గురించి ప్రశ్నించినప్పుడు.. తనని తాను డిఫెండ్‌ చే సుకోవడానికి, తన న్యాయవాదుల బృందం ఇచ్చిన సూచనలమేరకే తాను మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తన విషయంలో మీడియాకు అవాస్తవాలు చెప్పారని కూడా ఆయన అన్నట్లు సమాచారం. మొత్తమ్మీద పోలీసులు దాదాపు 20 ప్రశ్నలు సంధించగా.. వాటిలో ఒకటి రెండు మినహా మిగతా అన్ని ప్రశ్నలకూ ఆయన బదులిచ్చారని.. న్యాయవాదుల సూచనల మేరకు మిగతా ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్నీ పోలీసులు వీడియో రికార్డింగ్‌ చేశారు.

మూడుసార్లు విరామం..

మధ్యాహ్నం 2:45 వరకు విచారించిన పోలీసులు మధ్యలో మూడుసార్లు బ్రేక్‌ ఇచ్చినట్లు తెలిసింది. బ్రేక్‌ సమయంలో తాను ఇంటి నుంచి తెచ్చుకున్న బిస్కట్స్‌, డ్రైఫ్రూట్స్‌ను తీసుకున్న అల్లు అర్జున్‌.. పోలీసులు తెప్పించిన టీ, తాగినట్లు తెలిసింది. విచారణ పూర్తయిన అనంతరం అల్లు అర్జున్‌ కిందకు వచ్చి తన వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు.


పీఎస్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత..

విచారణ నిమిత్తం అల్లు అర్జున్‌ వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఠాణా వద్దకు రానివ్వకపోవడంతో.. చుట్టుపక్కల భవనాలపైకి ఎక్కిన అభిమానులు, స్థానిక ప్రాంతాల నివాసులు అల్లు అర్జున్‌ను చూసేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు.

నన్నే రానివ్వరా?

అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్న సమయంలో.. ఒక వ్యక్తి తాను అడ్వొకేట్‌నంటూ పోలీ్‌సస్టేషన్‌లోకి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి.. తాను న్యాయవాదినని, తానే కేసు వేశానని, తనను విచారణ గదిలోకి వెళ్లకుండా ఆపివేశారని పేర్కొంటూ మీడియా ముందు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆయనను పంపించివేశారు.

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ వదంతులు

సంధ్య థియేటర్‌ వద్దకు వందలాది అభిమానులు

అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి ఠాణాలో విచారిస్తున్న సమయంలో.. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తారన్న వదంతులు విస్తృతంగా వ్యాపించాయి. దీంతో కొంతమంది మీడియా ప్రతినిధులు సంధ్య థియేటర్‌ వద్దకు చేరుకున్నారు. బన్నీ అభిమానులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్‌ టీమ్‌ కూడా థియేటర్‌కు చేరుకుని అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

Updated Date - Dec 25 , 2024 | 04:14 AM