Share News

Hyderabad: విదేశీయులకు అక్రమ పౌరసత్వం కేసు.. నిందితులపై త్వరలో చార్జ్‌షీట్‌

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:29 AM

నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి, శ్రీలంక, ఇతర దేశాలకు చెందిన వారికి పాస్‌పోర్టులు ఇప్పించిన అక్రమ పౌరసత్వం కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే 26 మంది అరెస్టయ్యారు. వీరిలో ఇద్దరు శ్రీలంక జాతీయులున్నారు.

Hyderabad: విదేశీయులకు అక్రమ పౌరసత్వం కేసు.. నిందితులపై త్వరలో చార్జ్‌షీట్‌

  • రూ. కోట్లలో లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు

  • దర్యాప్తు జరుగుతుండగానే.. పలువురు విదేశాలకు

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి, శ్రీలంక, ఇతర దేశాలకు చెందిన వారికి పాస్‌పోర్టులు ఇప్పించిన అక్రమ పౌరసత్వం కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే 26 మంది అరెస్టయ్యారు. వీరిలో ఇద్దరు శ్రీలంక జాతీయులున్నారు. చార్జ్‌షీట్‌ దాఖలుకు కావాల్సిన సాంకేతిక, ఇతర ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. కాగా.. అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డ విదేశీయులకు గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలిప్పించేందుకు ఈ ముఠా వేర్వేరు ప్యాకేజీల్లో రూ.కోట్లలో వసూలు చేసినట్లు సీఐడీ నిర్ధారించింది. భారత్‌లో స్థిరపడడానికి వచ్చిన వారికి కేవలం నకిలీ ధ్రువపత్రాలు ఇవ్వడానికి ఒక రేటు.. ఆ పత్రాల ఆధారంగా భారత పాస్‌పోర్టులు ఇప్పించడానికి ఇంకో రేటు.. జాబ్‌ కన్సల్టెన్సీల ద్వారా గల్ఫ్‌ దేశాలకు విజిటింగ్‌ వీసాలపై పంపి.. అక్కడ ఉద్యోగాలిప్పించడానికి మరో రేటును నిర్ణయించి, ఈ కుంభకోణానికి పాల్పడ్డట్లు గుర్తించింది.


ఇలా ఇప్పటి వరకు 125 మందికి భారత పాస్‌పోర్టులు ఇప్పించినట్లు ఆధారాలు సేకరించింది. విదేశాలకు పంపేవారికి ‘ఇమిగ్రేషన్‌ చెక్‌ నాట్‌ రిక్వైర్డ్‌’ కేటగిరీలో పాస్‌పోర్టులు ఇప్పించినట్లు గుర్తించింది. ఓవైపు కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుండగానే.. నిందితులు పలువురు విదేశీయులను భారత పాస్‌పోర్టుపై గల్ఫ్‌కు పంపినట్లు తేల్చింది. కాగా ఈ కుంభకోణంతో సంబంధమున్న ఆరుగురు స్పెషల్‌ బ్రాంచ్‌(ఎ్‌సబీ) పోలీసులు కూడా అరెస్టయిన విషయం తెలిసిందే..!

Updated Date - Jun 06 , 2024 | 05:29 AM