Share News

Farm Loan Waiver: రుణం మాఫీ.. రైతు ఖుషీ..!

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:29 AM

రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్‌ శ్రేణులు, రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Farm Loan Waiver: రుణం మాఫీ.. రైతు ఖుషీ..!

  • రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబరాలు.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ శ్రేణుల వేడుకలు

  • సీఎం రేవంత్‌, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం

హైదరాబాద్‌/సిటీ/కరీంనగర్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్‌ శ్రేణులు, రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పలుచోట్ల బాణసంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ వేడుకలు చేసుకున్నారు. గ్రామగ్రామాన పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నాయి. కార్యకర్తలు, నాయకులు డప్పు చప్పుళ్ల మధ్య నృత్యం చేస్తూ బాణసంచా కాల్చుతూ సందడి చేశారు. స్వీట్లు పంపిణీ చేసి, పరస్పరం అభిందనలు చెప్పుకొన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.


రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీతో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ కేక్‌ కోశారు. రుణమాఫీతో రైతులందరూ పండగ చేసుకుంటున్నారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అన్నారు. సుమారు 70 లక్షల మంది రైతులకు మేలు చేకూర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.31 వేల కోట్లు నిధులు వెచ్చించి రుణమాఫీ ప్రకటించి, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా రాహుల్‌ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. రైతులను సన్మానించి, స్వీట్లు పంచారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ జనసమితి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఓయూలోనూ విద్యార్థి నేతలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.


ఉద్యోగులకు ‘క్యాబేజీలు, సొరకాయలు’

రుణమాఫీపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు, రైతు చింపుల సత్యనారాయణరెడ్డి వినూత్న రీతిలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు క్యాబేజీ, సొరకాయలు ఉచితంగా అందించారు. రుణమాఫీ తనకు కూడా వర్తించిందని, ఆ పథకం అమలులో సచివాలయ ఉద్యోగులు కీలక భూమిక పోషించడంతో వారికి తన పొలంలో పండిన కూరగాయలను ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, అందుకే 2 వేల సొరకాయలు, 2 వేల క్యాబేజీలను అందించానని చెప్పారు.


గ్రామాల్లో రుణమాఫీ సంబరాలు

కరీంనగర్‌ సిటీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు, రైతులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. రామడుగులో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్‌లో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంబరాల్లో పాల్గొన్నారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతువేదికల్లో రైతులు చూసేందుకు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jul 19 , 2024 | 03:29 AM