Shivraj Singh Chouhan: కేంద్రం అండగా ఉంటుంది
ABN, Publish Date - Sep 07 , 2024 | 03:52 AM
‘‘వర్షం, వరదల వల్ల ఖమ్మం జిల్లాలోని మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా కళ్లారా చూశాను. నష్టం అపారంగా జరిగింది.
వర్షం నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా.. రైతులు ధైర్యంగా ఉండాలి: కేంద్ర మంత్రి చౌహాన్
మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఏరియల్ సర్వే
ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కూసుమంచి, సెప్టెంబరు6: ‘‘వర్షం, వరదల వల్ల ఖమ్మం జిల్లాలోని మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా కళ్లారా చూశాను. నష్టం అపారంగా జరిగింది. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుంది. రైతులెవరూ కన్నీళ్లు పెట్టుకోవద్దు. మళ్లీ పంటలు వేసుకుని సాగు చేసేందుకు ధైర్యంగా ఉండాలి. జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం. రైతులకు, వరద బాధితులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం’’ అని కేంద్ర వ్యసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. కేంద్రమంత్రులు చౌహాన్, బండి సంజయ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. శుక్రవారం హెలికాప్టర్ ద్వారా వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా తిలకించారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నష్టం జరిగిన తీరును స్వయంగా చూపించారు. అనంతరం పాలేరులోని నవోదయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో జరిగిన పంటల నష్టం, వరదల బీభత్సంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖి కార్యక్రమంలో కేంద్రమంత్రులు పంటల నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని రైతులను ఓదార్చారు. కేంద్ర మంత్రి చౌహాన్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి, మిర్చి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వరద ఉధృతికి పంటలే కాక పశువులు, ఇళ్లు, సామాన్లు కోల్పోవడం బాధాకరమన్నారు. వేలాదిమంది రైతులు పెట్టుబడులతో పాటు పంటలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, రైతుల కోసం వరద నష్టాన్ని చూసేందుకు వచ్చానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వాడుకుంటేనే మళ్లీ కొత్త నిధులు వస్తాయని, వాటిని దారిమళ్లించవద్దన్నారు. గత ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్ నిధులను సక్రమంగా వినియోగించుకోలేదని, ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయని, వాటికి యూసీలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఫసల్‌బీమా అమలు చేయలేదని, కేంద్రం తరఫున అమలు చేస్తామని చెప్పినా గత ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్పారు. ప్రస్తుతం వరదల నష్టపోయిన రైతులకు కావాల్సిన విత్తనాలను అందిస్తామని, జరిగిన నష్టంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పూర్తి నివేదిక అందించాలని సూచించారు. గత వందేళ్లలో ఎన్నడూ రాని వరద ఈ ప్రాంతంలో వచ్చిందని చెబుతున్నారని, వరద నష్టంపై కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా ఆదుకోనున్నట్లు ఆయన చెప్పారు.
అండగా ఉండాలి: తుమ్మల, పొంగులేటి
వరదల వల్ల పెద్ద నష్టమే జరిగిందని, అవసరమైన సహాయం కేంద్రం నుంచి అందించనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులు పెట్టిన పెట్టుబడులు, పంటలు కోల్పోవడంతో తీవ్రంగా నష్టం జరిగిందని, ఈ కష్టకాలంలో తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సుమారు మూడున్నర నుంచి 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్రంగా దెబ్బతిన్నాయని, గ్రామాలు నీట మునిగాయని, చాలా మంది ఇళ్లతో పాటు.. సర్వం కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. అనంతరం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూసుమంచి మండలం నానుతండా వద్ద దెబ్బతిన్న వరిపొలాలను తిలకించారు. అక్కడ వేసిన ఇసుక మేటలను కూడా పరిశీలించారు.
కేంద్ర మంత్రి కాళ్లపై పడిన రైతు
ముఖాముఖిలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వద్ద రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఖమ్మం జిల్లా భూక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు తన గోడును వెళ్లబోసుకున్నారు. ‘నేను వేసిన పత్తి, మిర్చి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నాలుగు ఎకరాల పంట వరదకు నాశనమైంది. పెట్టిన పెట్టుబడి నేలపాలైంది. కోలుకోలేని దెబ్బ తిన్నాం. వ్యవసాయం చేయాలంటే చేతిలో చిల్లిగవ్వలేదు. నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలి’ అని కోరారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్నారు. దీంతో కేంద్రమంత్రి చలించి ఆ రైతును అక్కున చేర్చుకుని ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు.. తొలుత పాలేరు రిజర్వాయర్ పక్కన రైతులతో ముఖాముఖి, ఫొటో ఎగ్జిబిషన్ వేదిక ఏర్పాటు చేశారు. ఆకస్మికంగా భారీవర్షం కురవడంతో టెంట్లు, ఫొటో ఎగ్జిబిషన్ బోర్డులు పడిపోగా.. నవోదయ పాఠశాలలోకి వేదికను మార్పు చేశారు.
Updated Date - Sep 07 , 2024 | 03:52 AM