ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: నామినేషన్ తర్వాత రూటు మార్చేసిన ఎంపీ అభ్యర్థి.. సీన్ కట్ చేస్తే..!

ABN, Publish Date - Apr 28 , 2024 | 03:49 AM

ఆయన ఓ పార్టీ అగ్ర నేత.. స్వయంగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎండ దంచేస్తున్నప్పటికీ.. నామినేషన్‌ వేసిన ఉత్సాహంలో రోజంతా ప్రచారంలో పాల్గొన్నారు..

ఎండదెబ్బ తగలకుండా ఉండడానికి తలకు, చెవుల చుట్టూ కండువా కట్టుకున్న హరీశ్‌

  • సూరీడి దెబ్బకు నేతల విలవిల..

  • ఎండల తీవ్రతతో ప్రచార వ్యూహాల్లో మార్పు..

  • ఉదయం, రాత్రే సభలు

ఆయన ఓ పార్టీ అగ్ర నేత.. స్వయంగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎండ దంచేస్తున్నప్పటికీ.. నామినేషన్‌ వేసిన ఉత్సాహంలో రోజంతా ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి వేళకు డీలా పడిపోయారు. జర్నలిస్టులతో మాట్లాడే సత్తువ కూడా లేదు. నామినేషన్‌ నాడే ఇలాగైతే ముందుముందు కష్టమేనని అర్ధమై మరుసటి రోజు నుంచి ప్రచార శైలి మార్చుకున్నారు.

జాతీయ పార్టీ అగ్ర నేత ఒకరు తమ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సభ ఏర్పాటు చేశారు. అప్పటికే ఎండ ముదిరింది. సభ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే జనమంతా చెట్ల కిందకు, హోటళ్లలోకి వెళ్లిపోయారు. ప్రజలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో అగ్ర నేత త్వరగా సభను ముగించుకుని వెళ్లారు.

మండు వేసవిలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. ఎండలు ఠారెత్తిస్తుండడంతో.. ‘‘ఎవరి గాలి వీస్తున్నదో తర్వాతి సంగతి.. ముందు వడగాలి బారిన పడకుండా ఉండడం ముఖ్యం’’ అన్నట్లుంది రాజకీయ పార్టీల నాయకుల ఆలోచన. 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తుండడంతో వారు ప్రచార తీరును మార్చుకోవాల్సి వస్తోంది. గెలుపు కోసం ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగేయాలని మనసు ఒత్తిడి చేస్తున్నా సూరీడి దెబ్బకు వెనకడుగు వేస్తున్నారు. తెగించి తిరిగితే మరుసటి రోజుకు నీరసం, నిస్సత్తువ ఆవరిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మరో 2 వారాలు (మే 11 వరకు) ప్రచారం ఎలాగోననే ఆందోళన నెలకొంటోంది. దీంతో పగటి వేళ ప్రచారాన్ని వీలైనంత తగ్గించుకుని, భారీ బహిరంగ సభలు లేకుండా రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లకు పరిమితం అవుతున్నారు. ఎందుకొచ్చిన ఇబ్బంది అనుకుంటూ ప్రచారానికి జనం కూడా మొహం చాటేస్తున్నారు. అభిమానం ఉన్నా, డబ్బులిస్తామన్నా గడప దాటడం లేదు. ఫలితంగా ఈసారి ప్రచార వ్యూహాలే మారిపోతున్నాయి. ఉదయం ఇంటింటి ప్రచారాలు చేసి.. మధ్యాహ్నం పార్టీ కార్యాలయాలకు చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. మళ్లీ సాయంత్రం రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లకు వెళ్తున్నారు.


ముఖ్య నేతలందరిదీ అదే దారి

కాంగ్రెస్‌ అభ్యర్థుల తరపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, సమాచార మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, పలు రాష్ట్రాల సీఎంలు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రచారం చేస్తున్నారు. రేవంత్‌ ఉదయం లేదంటే సాయంత్రం నిర్వహించే సభలు, రోడ్‌ షోల్లో పాల్గొంటున్నారు. కేసీఆర్‌ బస్సు యాత్రను సాయంత్రానికే పరిమితం చేశారు. కార్నర్‌ మీటింగ్‌లు పెడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఉదయం లేదా సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఇదే బాటలో ఉన్నారు. మధ్యాహ్నం ఎండలో తిరగొద్దంటూ విశ్వేశ్వర్‌రెడ్డి కార్యకర్తలు, నాయకులకు సమాచారం చేరవేస్తున్నారు. మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొంటున్నారు.


వికేంద్రీకృత ప్రచారం

ఇదివరకు అభ్యర్థులే ప్రతి వీధి, ప్రతి బస్తీ తిరిగి ప్రచారం చేసేవారు. మూడు దఫాలుగా తిరిగేవారు. ఇప్పుడు రెండు రౌండ్లు వెళ్లడమే అసాధ్యమని భావిస్తున్నారు. కొన్ని ఇళ్లకు స్వయంగా వెళ్తూ, మరికొన్ని ఇళ్లకు వెన్నంటి ఉండే నేతలను పంపుతున్నారు. అప్పటికీ ఉక్కపోత, వడగాలులు తట్టుకోలేక కూర్చున్న చోటే కాస్త కునుకు తీస్తున్నారు. జనాన్ని తరలించి బహిరంగ సభలు పెట్టే బదులు తామే వారి వద్దకు వెళ్లాలన్న ఉద్దేశానికి వచ్చారు. రాత్రి పూట వీధి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలోనూ కొన్నిటికి నేరుగా వెళ్తూ, మరికొన్ని సభలకు పార్టీ నాయకులను పంపిస్తున్నారు. ఇంకా కొందరు నేరుగా ప్రచారం చేయలేక శైలిని మార్చుకుంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం, మండలం స్థాయిగా ప్రచారాన్ని వికేంద్రీకరణ చేసి దిగువ స్థాయి కేడర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు.


కొత్త వారికి కష్టాలు

కొన్ని స్థానాల్లో సిటింగ్‌ ఎంపీలు, మాజీలు పోటీపడుతున్నారు. మరికొన్నిచోట్ల కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారు బరిలో నిలిచారు. వీరంతా గతంలో ఇంతగా ఎండలో తిరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీతో ఎండ దెబ్బను చవిచూడాల్సి వస్తోంది. పోటాపోటీ నెలకొన్న స్థానాల్లో అయితే అభ్యర్థులకు కంటిపై కునుకు లేదు. ప్రత్యర్థుల వ్యూహాలు, ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా, ఎండల ధాటి కొనసాగితే పోలింగ్‌ రోజున ఓటర్లు హక్కును వినియోగించుకునేందుకు రావడం కష్టమే. మరోవైపు ఎండల కారణంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ వేళలను పొడిగించింది.

- ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌


ఎండ తగలకుండా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్లాన్‌. కాషాయ జెండానే కవచంగా చేసుకున్న వైనం. అంతేనా.. ముఖానికి ఎండ తగలకుండా టోపీ, చేతులకు సాక్సులు ఆమె స్పెషల్‌.

పగలు ప్రచారం చేయాలంటే ఎండ దెబ్బ. అందుకే అన్ని పార్టీలూ రాత్రి రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగులకే పెద్దపీట వేస్తున్నాయి. నాగారంలో శుక్రవారం రాత్రి ఈటల రోడ్‌ షో

Updated Date - Apr 28 , 2024 | 10:15 AM

Advertising
Advertising