U.S. Company: హైదరాబాద్‌లో ‘చార్లెస్ స్క్వాబ్ సెంటర్’
ABN, Publish Date - Aug 09 , 2024 | 02:59 AM
ఆర్థికపరమైన సేవల్లో పేరొందిన అమెరికా బహుళ జాతి సంస్థ చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఆర్థిక సేవల బహుళ జాతి సంస్థ
భారత్‌లో నెలకొల్పే తొలి కేంద్రం
డాలస్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో
కంపెనీ ప్రతినిధుల చర్చలు
స్థానికంగా ఉన్న గాంధీజీ
విగ్రహానికి ముఖ్యమంత్రి నివాళి
మహాత్మాగాంధీ విగ్రహానికి రేవంత్ నివాళులు
కాలిఫోర్నియాలో సీఎంకు ఎన్నారైల ఘనస్వాగతం
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్ర జ్యోతి): ఆర్థికపరమైన సేవల్లో పేరొందిన అమెరికా బహుళ జాతి సంస్థ చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో భాగంగా డాల్‌సలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కంపెనీ భారత్‌లో తన తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు మార్గదర్శనం చేస్తామన్నారు. కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలో హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బుద్ధదేవ్ మృతికి సీఎం సంతాపం
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఐదు దశాబ్దాలు సుదీర్ఘ ప్రజాసేవలో గడిపిన బుద్ధదేవ్ సేవలు మరువలేనివన్నారు. నిజాయతీకి మారుపేరుగా నిలిచిన భట్టాచార్య మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, సీపీఎం కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మహాత్ముడికి సీఎం నివాళులు
సీఎం రేవంత్‌రెడ్డి గురువారం డాల్‌సలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. మంత్రివర్గ సహచరులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఉన్నారు. సీఎం నేతృత్వంలోని బృందం గురువారం రాత్రి కాలిఫోర్నియా చేరుకోగా.. విమానాశ్రయంలో స్థానిక ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరేమీ లేదు: జయేశ్ రంజన్
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు వీడియో సందేశం పంపారు. అమెరికా పర్యటనలో ప్రతి పెట్టుబడి వెనక రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అంశమే లేదన్నారు. పెట్టుబడులు కచ్చితంగా వస్తాయన్న పారిశ్రామికవేత్తలతోనే తాము సమావేశం అవుతున్నామని, ఆషామాషీగా భావించడం లేదని తెలిపారు.
ప్రతి సమావేశాన్ని సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వివరించారు. అమెరికా పర్యటనలో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడిదన్న కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. తమ పర్యటన గురించి జయేశ్ రంజన్ వీడియో సందేశం పంపారు. ఇక ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో జరిగిన సమావేశం విజయవంతమైందని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా వీడియో సందేశం పంపారు.
ఆదివాసీలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్ర జ్యోతి): అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని (ఆగస్టు 9) పురస్కరించుకొని గిరిజనులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మూలవాసులుగా, అమ్మలాంటి అడవికి తోడుండే భూమిపుత్రులుగా ఆదివాసులు నిలుస్తారని, వాళ్లు కల్మషం లేని అనుబంధాలకు ప్రతీకలని అభినందించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ గురువారం విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. 17,056 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రతి గిరిజన గూడానికి రోడ్లు, విద్యుత్, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
Updated Date - Aug 09 , 2024 | 02:59 AM