ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sports Policy: త్వరలో తెలంగాణ క్రీడా పాలసీ..

ABN, Publish Date - Aug 03 , 2024 | 03:37 AM

రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతామన్నారు. ఇందుకోసం హరియాణా, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి, తుదిరూపు ఇస్తామని తెలిపారు.

  • హరియాణా, పంజాబ్‌లో అధ్యయనం చేసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు

  • బేగరి కంచలో క్రికెట్‌ స్టేడియం

  • బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, క్రికెటర్‌ సిరాజ్‌కు..

  • చ ట్టాన్ని సవరించి డీఎస్పీ ఉద్యోగాలు

  • పార్టీలన్నీ అంగీకరిస్తే

  • తెలుగు వర్సిటీకి సురవరం పేరు

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మళ్లీ

  • క్రీడా పోటీలు, కళా ప్రదర్శనలు: సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతామన్నారు. ఇందుకోసం హరియాణా, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి, తుదిరూపు ఇస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా రంగాలకు ప్రాధా న్యం ఉండేదని, కామన్వెల్త్‌, ఏషియన్‌ గేమ్స్‌ వంటివి జరిగాయని, ప్రస్తుతం ఆ స్టేడియాల్లో పెళ్లిళ్లు, పేరంటాలు, రాజకీయ సభలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. క్రీడలకు ప్రాధాన్యం పెంచడానికి వీలుగా ఈ ఏడాది బడ్జెట్‌లో అత్యధికంగా రూ.361 కోట్లు కేటాయించామని వెల్లడించారు. శుక్రవారం శాసనసభలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీసుల నియామకం, క్రమబద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపమును క్రమబద్ధం చేయు సవరణ బిల్లు-2024ను ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.


స్పోర్ట్స్‌ కోటాలో నేరుగా నియమించే నిబంధన నుంచి సవరణ కోసం బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, ఇంటర్‌ పాసైన క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వడానికి వీలుగా చట్టాన్ని సవరిస్తున్నట్లు తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందని అన్నారు. క్రీడల పట్ల ప్రభుత్వం అనుకూలంగాఉందనే సంకేతాలు ఇచ్చేందుకే నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌లకు గ్రూప్‌-1 ఉద్యోగాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లు కట్టుకోవడానికి వారిద్దరికీ 600 గజాల స్థలంతోపాటు ఉద్యోగమూ ఇస్తున్నామని తెలిపారు. క్రీడలకు హరియాణా రాష్ట్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఆ రాష్ట్రంతోపాటు పంజాబ్‌లోనూ అధ్యయనం చేసి రాష్ట్రంలో క్రీడా పాలసీకి తుదిరూపు ఇస్తామని వెల్లడించారు.


  • మండల కేంద్రా ల్లోనూ స్టేడియాలు

రాష్ట్రంలో మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తామని, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బేగరి కంచలో దీనిని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. స్టేడియం నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాల్సిందిగా బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ)ను కూడా అక్కడికే తరలిస్తున్నామని పేర్కొన్నారు. మండల కేంద్రాల్లోనూ స్టేడియాలు నిర్మించే ఆలోచన ఉందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడల్లో ఆసక్తిని పెంచుతామని, ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా.. అందులో రాణించే వారిలో విధిగా తెలంగాణవారు ఉండేలా చూడటమే తమ లక్ష్యమని అన్నారు. కాగా, ఈ బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు.


తాను కూడా ఫాస్ట్‌బౌలర్‌నని, రంజీలో ఆడుతున్న సమయంలో తనకంటే మెరుగైన బౌలింగ్‌ వేయడం ద్వారా సిరాజ్‌ ముందుకెళ్లాడని అన్నారు. సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌ లాగే క్రికెటర్లు ప్రజ్ఞాన్‌ ఒజా, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు కూడా గ్రూప్‌-1 ఉద్యోగం, 600 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. బీజే పీ తరఫున ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మద్దతు ప్రకటిస్తూ ప్రతి మండల కేంద్రంలోనూ మినీ స్టేడియం నిర్మించాలని, క్రీడలకు సానుకూల వాతావరణం ఏర్పడేలా చూడాలని కోరారు. కాగా.. సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌తో పాటు జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌లో రాణించిన నవీన్‌కుమార్‌ను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మజ్లిస్‌ ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌ కోరారు. క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.


  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గతంలో మాదిరిగా మళ్లీ క్రీడా పోటీలు నిర్వహిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రతిపాదించారు. క్రీడా పోటీలు, కళా ప్రదర్శనల నిర్వహణ కోసం అ ఖిలపక్ష కమిటీని వేయాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. కాగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలేవీ లేవని సీఎం రేవంత్‌ అన్నారు. తెలుగు వర్సిటీకి ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని కోరుతూ సురవరం సుధాకర్‌రెడ్డి లేఖ రాశారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గుర్తు చేశారు.


దీంతోపాటు తమిళనాడులో హోంగార్డులు, కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో ఉన్న సమయంలో కూర్చోవడానికి వీలు కల్పిస్తూ చట్టం చేశారని, అదే విఽధానం తెలంగాణలో కూడా అమలు చేయాలని సురవరం సీఎంకు రాసిన లేఖను కూనంనేని ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై శాసనసభలో అన్ని పార్టీలు అభిప్రాయం తెలిపితే ప్రభుత్వానికి అభ్యంతరాల్లేవన్నారు. హోంగార్డులకు సంబంధించి తమిళనాడులో అధ్యయనం చేసి, తె లంగాణలోనూ ఆ విధానాన్ని అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టే విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనను తాము సమర్థిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 03:38 AM

Advertising
Advertising
<