Share News

CM Revant Reddy: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు..

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:23 AM

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని, పథకం అమలుకు వీలుగా.. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

CM Revant Reddy: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు..

  • దసరా నాటికి పథకం అమలుకు కమిటీలు

  • విధివిధానాలు రూపొందించండి

  • రాజీవ్‌ స్వగృహ ఇళ్లను వేలం వేయండి

  • హౌసింగ్‌ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని, పథకం అమలుకు వీలుగా.. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గ్రామం, వార్డు, మండలం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకూ కమిటీలను ఏర్పాటుచేసేందుకు విధివిధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. బుధవారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై)పథకం నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలను మంజూరు చేయించుకుంటుంటే.. తెలంగాణ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉందన్నారు.


ఈ దఫా పీఎంఏవై నుంచి రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో ఇళ్లను సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారాన్ని వెంటనే ఇవ్వడంతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. పీఎంఏవై నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కూడా రాబట్టాలని సూచించారు. అయితే.. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తే ఇంజినీరింగ్‌ సిబ్బంది సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుందని అధికారులు సీఎంకు తెలిపారు. దీనికి రేవంత్‌.. అవసరమైతే ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు.


నిర్మాణం పూర్తయి, నిరుపయోగంగా ఉన్న రాజీవ్‌ స్వగృహల్లోని బ్లాక్‌లు, ఇళ్లను కూడా వేలం వేయాలని అధికారులకు సూచించారు. ఏళ్ల తరబడి వాటిని వృథాగా ఉంచడం సరికాదని, వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ పథకంలో లబ్ధిదారులు ఎంపిక పూర్తయినా, వాటిని లబ్ధిదారులకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించిన సీఎం.. అర్హులైన వారికి ఆ ఇళ్లను అప్పగి ంచాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ‘డబుల్‌’ ఇళ్ల బ్లాక్‌లకు మౌలిక వసతులు కల్పించి, వాటిని అర్హులె ౖన లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు.

Updated Date - Sep 26 , 2024 | 03:23 AM