Hyderabad: రూపు మారనున్న మాతా శిశు సంరక్షణ పథకం ..
ABN, Publish Date - Jun 01 , 2024 | 03:57 AM
మాతాశిశు సంరక్షణకు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కేసీఆర్ కిట్ పేరును ఇప్పటికే రేవంత్ సర్కారు తొలగించింది. దాని స్థానంలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్(ఎంసీహెచ్) కిట్ పేరుతో అమలు చేస్తోంది. అంతేకాక ఈ పథకం రూపురేఖల్ని పూర్తిగా మార్చేయబోతోంది.
కేసీఆర్ కిట్ ఔట్.. ఎంసీహెచ్ కిట్ ఇన్
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): మాతాశిశు సంరక్షణకు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కేసీఆర్ కిట్ పేరును ఇప్పటికే రేవంత్ సర్కారు తొలగించింది. దాని స్థానంలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్(ఎంసీహెచ్) కిట్ పేరుతో అమలు చేస్తోంది. అంతేకాక ఈ పథకం రూపురేఖల్ని పూర్తిగా మార్చేయబోతోంది. ప్రధానంగా దీన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై కసరత్తు ప్రారంభించింది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పథకాన్ని నడపాలా? లేక కేంద్రం ఇచ్చే ప్రధాన మంత్రి మాతృవందన యోజన(పీఎంఎంవీవై)తో కలిపి కొనసాగించాలా అన్నదానిపై చర్చిస్తున్నారు. ఈ పథకంపై ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కోడ్ కారణంగా దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కోడ్ ముగియగానే కేంద్రం భాగస్వామ్యంతోనా... లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్వహిస్తారా అన్న దానిపై స్పష్టత రానుంది.
రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గే ఛాన్స్
ప్రస్తుతం పీఎంఎంవీవై కింద కేంద్రం గర్భిణులకు రూ.6 వేల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది. కేంద్రం ఇచ్చే నిధులను తీసుకొని.. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత జమ చేస్తే... పాత పద్ధతిలోనే ఎంసీహెచ్ కిట్ కింద రూ. 13 వేలు ఇవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకంతో కలిపి అమలుచేయడం వల్ల రేవంత్ సర్కారుపై ఆర్థిక భారం కూడా సగానికిపైగా తగ్గుతుంది. ఇదే విషయాన్ని అధికారులు మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. కాకపోతే కేంద్రం నిధులను ఈ పథకం కింద వినియోగిస్తే... కచ్చితంగా పేరు, బ్రాండింగ్‌లో వారి నియమ నిబంధనలను పాటించాల్సివుంటుందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, జూన్ 4 తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని అధికారులకు మంత్రి సూచించినట్టు చెప్తున్నారు.
Updated Date - Jun 01 , 2024 | 03:57 AM