CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:16 AM
గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్నంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్‌ను శిక్షించాలంటే దేశ చట్టాలన్నీ చదవాలి
ధరణితో వేలాది ఎకరాలు బదిలీ చేశారు
రైతుల భూముల సమాచారాన్ని విదేశీయుల
చేతుల్లో పెట్టారు.. నేరగాళ్లకు అమ్ముకున్నారు
కిషన్‌రెడ్డి ఊర్లో భూదాన్ భూములకూ పట్టా
ధరణి అంతా కేటీఆర్ మిత్రుడు శ్రీధర్‌రాజుకే
లొసుగులు తెలిశాయనే సభ నుంచి పరారీ
ఫార్ములా-ఈ స్కాం 600 కోట్లు.. త్వరలో చెప్తా
సభలో అరవకుంటే హరీశ్‌కు ఇంట్లో దెబ్బలు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్నంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు. ఒడిసా ప్రభుత్వంలో క్రిమినల్ కేసులు నమోదై, జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరగాళ్లకు ధరణి బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. దీంతో ఎవరి భూమినైనా ఎవరి పేరుపైనైనా బదలాయించే అధికారం వారికి లభించిందని అన్నారు. ఇందులో కేటీఆర్ మిత్రుడు గాదె శ్రీధర్‌రాజుదే కీలకపాత్ర అని చెప్పారు. తండ్రీకొడుకులు నేరగాళ్లని, వారు చేసిన నేరాలకు శిక్షించాలంటే.. దేశంలో ఉన్న చట్టాలన్నీ అధ్యయనం చేయాలని అన్నారు. శుక్రవారం శాసనసభలో భూ భారతి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ధరణి గురించి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ల పాత్ర గురించి వివరించారు. ‘‘తన మేధస్సునంతా రంగరించి ఎంతో శ్రమించి ధరణిని ప్రవేశపెట్టానని 80 వేల పుస్తకాలు చదివిన మేధావి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అనేవారు. ఆయన మాటలు, ఆత్మవిశ్వాసం చూసి ఎంపీగా ఉన్నప్పుడు నాక్కూడా నిజమేనేమో అనిపించింది.
భూ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త విధానం ఉపకరిస్తుందేమో అనిపించింది. అధికారంలోకి వచ్చాక ధరణిని అధ్యయనం చేస్తుంటే అసలు లోగుట్టంతా బయటపడింది’’ అని రేవంత్ అన్నారు. ధరణి పోర్టల్ కేసీఆర్ సొంతంగా కనిపెట్టింది కాదని, 2010లోనే ఒడిసాలో ఈ-ధరణి పేరుతో ‘ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్’ కంపెనీకి అప్పగించారని సీఎం రేవంత్ తెలిపారు. అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు ఒడిసా ప్రభుత్వం ఈ-ధరణి పోర్టల్‌ను ఇవ్వడాన్ని 2014లో కాగ్ తప్పుబట్టిందని పేర్కొన్నారు. అక్కడ దీనిని ప్రవేశపెట్టిన తర్వాత భూ సమస్యలు మరింతగా పెరిగాయని కాగ్ చెప్పినట్లు వెల్లడించారు. ‘‘2018లో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎ్‌సతోపాటు కేటీఆర్ మిత్రుడు గాదె శ్రీధర్‌కు చెందిన ఈ-సెంట్రిక్, విసెన్ ఇన్ఫోటెక్ సంయుక్తంగా ధరణి కాంట్రాక్టు సాధించుకున్నాయి. భూ రిజిస్ర్టేషన్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలు ఆ కంపెనీకి అప్పగించారు. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కంపెనీపై గతంలోనే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కంపెనీ యజమానులు రమేశ్, హరి, రాంచంద్ రూ.వేల కోట్ల కుంభకోణంలో జైలుకు వెళ్లివచ్చారు. అలాంటి నేర నేపథ్యం ఉన్న కంపెనీలను టెండర్లలోనే అనుమతించకూడదు. అయినా కేసీఆర్ వారికే కట్టబెట్టారు. ధరణి కాంట్రాక్టును దక్కించుకున్నాక ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కంపెనీ టెరాసిస్ టెక్నాలజీ్‌సగా పేరు మార్చుకుంది. ఇందులో 99 శాతం షేర్లు ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ ఎస్‌జీ అనే సంస్థ 2021లో రెండు దఫాలుగా కొనుగోలు చేసింది. మిగిలిన ఒక్క శాతం వాటా మాత్రం కేటీఆర్ మిత్రుడు గాదె శ్రీధర్‌రాజు కొనుగోలు చేశారు. ఆ ఒక్క శాతం షేర్‌తో శ్రీధర్‌రాజు టెరాసి్‌సకు సీఈవోగా అవతారం ఎత్తారు’’ అని సీఎం వివరించారు.
కంపెనీ మూలాలు కేమాన్స్ ఐలాండ్‌లో..
మళ్లీ ఫాల్కన్ ఎస్‌జీ (ఫిలిప్పైన్స్) సంస్థలోని 100 శాతం షేర్లను సింగపూర్‌కు చెందిన ఫాల్కన్ ఇన్వె్‌స్టమెంట్స్ అనే మరో సంస్థ కొనుగోలు చేసిందని రేవంత్ తెలిపారు. ఆ తర్వాత ఈ సింగపూర్‌కు చెందిన కంపెనీలో 100 శాతం వాటాను ఐదు కంపెనీలు కొనుగోలు చేశాయన్నారు. ఇందులో స్పారో ఇన్వె్‌స్టమెంట్స్, జీడబ్ల్యూ స్కై, హిల్ బ్రూక్స్ ఇన్వె్‌స్టమెంట్స్, పారాడిగ్మే ఇన్నొవేషన్స్, క్వాంటెలా ఐఎన్‌సీ, ఫాల్కన్ ఇన్వె్‌స్టమెంట్స్ (సింగపూర్) ఉన్నాయని వివరించారు. మళ్లీ ఇందులో స్పారో ఇన్వె్‌స్టమెంట్స్ అనే సంస్థలో 100 శాతం వాటాలను గేట్‌వే ఫండ్-2 అనేక కంపెనీ చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఆ కంపెనీ మూలాలు.. పన్ను ఎగవేతలకు, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా పేరుగాంచిన కేమాన్స్ ఐలాండ్ అనే దీవిలో ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘ఐదింటిలో మరో కంపెనీ అయిన హిల్ బ్రూక్స్ ఇన్వె్‌స్టమెంట్స్ మూలాలు కూడా పన్ను ఎగవేత, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా భావించే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఉన్నాయి. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న వారిలో ఎవరూ ఈ దేశానికి చెందిన వ్యక్తులు కాదు. అలాంటి వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ రైతుల భూముల వివరాలు పెట్టారు. రెవెన్యూ శాఖ, భూ యజమానికి మధ్య ఉండాల్సిన డేటాను డిజిటల్ పోర్టల్ నెపంతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారు. ఇతర దేశాల్లో ఆర్థిక నేరాల్లో ఇరుక్కుపోయిన సంస్థలకు అప్పగించారు. పౌరుల ఆధార్ సమాచారాన్ని అడగటాన్నే సుప్రీంకోర్టు తీవ్రమైన నేరంగా పరగిణిస్తుంది. అలాంటిది రైతులు, వారి భూములకు సంబంధించిన సమాచారాన్నంతా విదేశీయులకు అప్పగించారు. ఇది చాలా తీవ్రమైన నేరం. ప్రజలకు ద్రోహం చేసి సమస్త సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారంటే.. దీనిపై ఎలాంటి విచారణ చేయాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి’’ ముఖ్యమంత్రి అన్నారు.
సీసీఎల్‌ఏలో ఉండాల్సిన కార్యాలయం విదేశాల్లో
ధరణి బాధ్యతలు అప్పగించే సమయంలో ప్రైవేటు సంస్థకు ప్రత్యేక నిబంధన పెట్టారని సీఎం తెలిపారు. భూ సంబంధిత కార్యకలాపాలన్నీ సీసీఎల్‌ఏ లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి నిర్వహించాలని, కానీ.. విదేశీ సంస్థ తన కార్యాలయాలను విజయవాడ, బెంగళూరు, గుర్గావ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టిందని వెల్లడించారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని గత ప్రభుత్వానికి తెలిసినా కిమ్మనలేదని ఆరోపించారు. ‘‘అగ్రిమెంట్ ప్రకారం కంపెనీ పేరు, యజమానిని మార్చాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇవేమీ తీసుకోకుండా అనేక కంపెనీలు చేతులు మారాయి. విదేశీ కంపెనీకి ప్రభుత్వం నగదును ఆర్బీఐ అనుమతి లేకుండా పౌండ్ల రూపంలో చెల్లించింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆర్బీఐ రూ.8 కోట్లు జరిమానా విధించింది. అడుగడుగునా ఉల్లంఘనలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. యువరాజు (కేటీఆర్) వెనక ఉండి అంతా తన మిత్రుడితో నడిపించాడు. ఎంసీహెచ్‌ఆర్డీలో అద్భుతమైన సాంకేతికత ఉంది, జాతీయస్థాయిలో ఎన్‌ఐసీ ఉంది. అత్యంత కీలకమైన ధరణిని రాష్ట్ర, జాతీయ సంస్థలకు అప్పగించకుండా విదేశీ కంపెనీలకు అప్పగించారు. ఈ లోపాలను మేం గుర్తించి ఽధరణి బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)కి అప్పగించాం. అయినా తన గుప్పిట్లో ఉన్న సమాచారాన్ని ఎన్‌ఐసీకి ఇచ్చేందుకు యువరాజు మిత్రుడు ఇప్పటికీ సిద్ధంగా లేడు. రాష్ట్రంలోని రైతులందరి సమాచారాన్ని మార్చే, ధ్వంసం చేసే అధికారం యువరాజు మిత్రుడి వద్ద ఉంది. ధరణిలో ఎన్నో ఎకరాల భూదాన్ భూములు, ప్రైవేటు భూముల యజమానుల పేర్లు మారాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను బదిలీ చేశారు. ధరణిలో పగలు జరగాల్సిన రిజిస్ర్టేషన్‌లు అర్ధరాత్రి కూడా జరిగాయి. కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన స్వగ్రామం తిమ్మాపూర్‌లో 100 ఎకరాల భూదాన్ భూములనూ ధరణిలో మార్చి ప్రైవేటుకు రిజిస్ర్టేషన్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పడంతో విచారణ జరిపించి బాద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాను. కేంద్రమంత్రికే ఇలాంటి పరిస్థితి నేను నమ్మలేకపోయాను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇలా ధరణి పేరుతో గత ప్రభుత్వం చేసిన బండారమంతా బయటపడుతుందనే ఇవాళ చర్చ జరగకుండా ప్రయత్నించి బయటికి వెళ్లిపోయారన్నారు.
కేటీఆర్‌తో చీకటి ఒప్పందం జరిగిందన్నాడు..
ఫార్ములా-ఈ రేస్‌కు చెందిన వ్యక్తితో తన ఫొటోలను చూపిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. తాను ఇంటి వద్ద, సచివాలయంలో రోజూ వందల మందిని కలుస్తానని చెప్పారు. అపాయింట్‌మెంట్ అడిగితే తానే ఇచ్చానన్నారు. ‘‘రూ.600 కోట్లకు కేటీఆర్‌తో చీకటి ఒప్పందం కుదిరిందని, మీరు ఊ.. అంటే మిగతా సొమ్ము వచ్చేస్తుందని అతడు చెప్పాడు. ఆయన చెప్పాకే వ్యవహారం ఏంటనేది అధికారులతో తెలుసుకున్నా. ముందు అనుకున్నట్టుగా ఇది రూ.55 కోట్ల కుంభకోణం కాదు.. రూ.600 కోట్ల కుంభకోణం. నేను తెలుసుకున్నాను కాబట్టే దీనిని ఆపగలిగా. లేకుంటే ఈ సొమ్మంతా పోయేది. ఏసీబీ విచారణ నడుస్తున్నందున ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. 2023 డిసెంబరు నుంచి 2024 డిసెంబరు వరకు జరిగిన అన్ని వివరాలను త్వరలో ప్రజలకు అందిస్తా. ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి ఎప్పుడు పిలిచినా ఎక్కడికైనా వెళ్తా.. అసెంబ్లీలో కష్టం అనిపిస్తే బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసుకు వెళ్లి వివరించేందుకూ నేను సిద్ధం. డ్రగ్స్‌తో పట్టుబడితే.. దీపావళికి ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని కేటీఆర్ దబాయిస్తున్నాడు. ఇంట్లో ఫంక్షన్ ఉంటే కొకైన్ కూడా వాడొద్దా? అని ప్రశ్నిస్తున్నారు. దీపావళి ఉంటే చిచ్చుబుడ్లు కాల్చాలి.. కొకైన్ వాడుతామా? ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకున్నా మాట్లాడొద్దంటున్నారు. హెచ్‌ఎండీఏ ఖాతాల నుంచి రూ.కోట్లు బదిలీ చేసినా ఏమీ అనొద్దన్నట్లుగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామన్నట్లుగా బీఆర్‌ఎస్ తీరు ఉంది. దీనిని ప్రభుత్వం ఏ మాత్రం సహించదు’’ అని సీఎం స్పష్టం చేశారు.
రైతు భరోసాపై నేడు అసెంబ్లీలో చర్చ
రైతు భరోసా విధివిధానాలకు సంబంధించిన అంశంపై శాసనసభలో శుక్రవారం చర్చ జరగనుంది. రోజంతా ఈ అంశంపైనే చర్చకు కేటాయించారు. రైతు భరోసాను ఆదాయపు పన్ను చెల్లించే రైతులకు, సాగుకు యోగ్యం కాని గుట్టలు, రాళ్లు రప్పలున్న భూములకు, లే అవుట్లుగా మారిన భూములకు, సాగు చేయకుండా బీడుగా వదిలేసిన భూములకూ ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో అభిప్రాయ సేకరణ పూర్తిచేశారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అన్ని రాజకీయపక్షాల వైఖరిని తెలుసుకోనున్నారు. అనంతరం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించనుంది. గరిష్ఠ సీలింగ్ పెట్టాలన్న అంశంపైనా చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేతలు ఈ చర్చలో పాల్గొనే అవకాశాలున్నాయి. మరోవైపు సంక్రాంతి అనంతరం రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
కొరడా ఝుళిపించాల్సిన సమయం వచ్చింది
అర్హులైన ప్రతి భూ యజమాని హక్కులను కాపాడేందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావాలని భావించామన్నారు. ‘‘ప్రతిపక్ష పార్టీ అహంభావం, అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించింది. సహనం కోల్పోయేలా రెచ్చగొట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా మీరు (స్పీకర్) ఆ అవకాశం వారికి ఇవ్వలేదు. ఓపిక నశించి వాళ్లే వెళ్లిపోయినా చర్చకు అవకాశం కల్పించిన మీకు అభినందనలు. ఇలాంటి వారిపై మీరు సభలో మరింత కఠినంగా వ్యవహరించాలి. కొరడా ఝుళిపించాల్సిన సమయం వచ్చింది అధ్యక్షా! హరీశ్‌రావు పరిస్థితి మాకు అర్థమైంది. అసెంబ్లీలో చొక్కాలు చించుకోకపోతే ఇంటి దగ్గర కొరడా దెబ్బలు ఉంటాయి. ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాలి. మరీ మామకు అంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. పేదల భూ హక్కులను కాపాడేందుకే భూ భారతి-2024 తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు చాలా సమావేశాలు నిర్వహించి భూ భారతి చట్టాన్ని సభ ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. అనంతరం భూ భారతి బిల్లును సభ ఆమోదించింది.
Updated Date - Dec 21 , 2024 | 03:16 AM