ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy : తెలంగాణకు నిల్‌..

ABN, Publish Date - Jul 24 , 2024 | 03:13 AM

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర సర్కారు కోరిన ఏ ఒక్కదానికీ ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేయలేదు.

  • ఒక్కదానికీ ప్రత్యేక గ్రాంటు ఇవ్వని వైనం!

  • ‘పాలమూరు-రంగారెడ్డి’కి పైసా ఇవ్వలేదు

  • ఇతర పథకాల కింద 60% నిధుల ఊసేది?

  • 2 పారిశ్రామిక కారిడార్ల ప్రస్తావనా కరువు

  • వెనుకబడిన జిల్లాలకు 2,250 కోట్ల నిధులెక్కడ?

  • రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, స్టీల్‌ ప్లాంట్‌లదీ పాత కథే

  • గిరిజన వర్సిటీకి నిధుల్లేవు, ఐఐఎం మాటెత్తలేదు

హైదరాబాద్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర సర్కారు కోరిన ఏ ఒక్కదానికీ ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేయలేదు. పలుసార్లు చేసిన డిమాండ్లను పెడచెవిన పెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు.. ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసింది. గ్రాంట్లు కాదుగదా..

విభజన చట్టం మేరకు ఇచ్చి హామీలను సైతం ప్రస్తావించలేదు. అసలు బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, బీజేపీ మినహా ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించిన కేంద్రం.. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ప్రస్తావించలేదని విమర్శిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు..

కేంద్రంతో సరైన సఖ్యత లేదని, తాము అధికారంలోకి వచ్చాక సత్సంబంధాలను నెరపుతున్నామని, దీనిని దృష్టిలో పెట్టుకునైనా గ్రాంట్లను మంజూరు చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు ధ్వజమెత్తుతున్నారు.

ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులను విడుదల చేస్తామన్న కేంద్రం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను విస్మరించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసేది. తర్వాతి క్రమంలో ఆ ప్రాజెక్టు పూర్తి కావడం, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పదేపదే కేంద్రాన్ని కోరుతూ వచ్చారు.


మూసీ సుందరీకరణకు పైసా ఇవ్వలే..

సబర్మతి రివర్‌ ఫ్రంట్‌, నమామీ గంగ తరహాలోనే మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు నిధులిస్తే.. హైదరాబాద్‌లో నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్రానికి రాష్ట్రం వివరించింది. ఈ ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లతో చేపడతామని సీఎం రేవంత్‌ తెలిపారు. అతి భారీ మొత్తం కావడంతో తప్పకుండా కేంద్ర సాయం అందుతుందని రాష్ట్రం ఆశించింది.

కానీ, ఎలాంటి గ్రాంటునూ ప్రకటించలేదు. విభజన చట్టం హామీల మేరకు ‘వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్‌)’ కింద కేంద్రం కేటాయించే నిధులనైనా ఇవ్వాలని కోరింది. 9 పాత ఉమ్మడి జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.450 కోట్లు రావాలని పేర్కొంది. 2019 నుంచి రూ.2,250 కోట్లు రావాల్సి ఉందని తెలిపింది. బడ్జెట్‌లో ఈ నిధులను ప్రత్యేకించాలని కోరింది.

కానీ, ఆ ఊసే లేదు. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు నిధులిస్తామని ప్రకటించినా తెలంగాణలోని వాటి గురించి మాటెత్తలేదు. బడ్జెట్‌లో తెలంగాణ బీఆర్‌జీఎఫ్‌ పదమే లేకపోవడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్‌-నాగపూర్‌ పారిశ్రామిక కాడిడార్‌ను స్పృశించలేదు. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ గురించి పేర్కొన్నా.. దానితో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు.


కోచ్‌ ఫ్యాక్టరీ తూచ్‌.. బయ్యారం విస్మరణ

పదేళ్ల కిందట రాష్ట్ర విభజన సమయంలో కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చింది. కానీ, కోచ్‌ ఫ్యాక్టరీకి బదులు ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు నిరుడు జూలైలో రైల్వే శాఖ ప్రకటించింది. ఇతర ప్రాంతాలకు కోచ్‌ ఫ్యాక్టరీలు ఇస్తూ దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన కాజీపేటలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ బడ్జెట్‌లోనైనా దీనిని ఇస్తారని ఆశించినా అదేమీ జరగలేదు. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం మాటెత్తలేదు.

ఐటీ రంగంలో కొత్త సంస్థలు, డెవలపర్లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌కు ప్రతిపాదించిన ‘సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్‌)’ ఊసు కూడా బడ్జెట్‌లో లేదు. తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ను ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరినా విస్మరించారు. కనీసం ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 24 , 2024 | 03:13 AM

Advertising
Advertising
<