CM Revanth Reddy: తీరని అన్యాయం..
ABN, Publish Date - Jul 25 , 2024 | 02:49 AM
‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసం 18 సార్లు ఢిల్లీ వెళ్లాను. మూడు సార్లు ప్రధానిని కలిశాను. కేంద్ర మంత్రులను కూడా కలిసి.. తెలంగాణకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశాను. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేశాను.
కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీల ఊసేలేదు
తెలంగాణకు మొండి చెయ్యి
నిరసనగా నీతిఆయోగ్ భేటీని బహిష్కరిస్తాం
రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళ్తే..
బడ్జెట్‌లో తిరిగిచ్చేది 43 పైసలే
ఎంపీలతో పార్లమెంట్‌లో నిరసన తెలుపుతాం
బడ్జెట్‌ను సవరించి న్యాయం చేయాలి
నేను ఇక్కడ కూర్చోవడం కొందరికి నచ్చట్లేదు
కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు
ఎవరినో పెద్దన్నా అంటే నాకు పదవి రాలేదు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసం 18 సార్లు ఢిల్లీ వెళ్లాను. మూడు సార్లు ప్రధానిని కలిశాను. కేంద్ర మంత్రులను కూడా కలిసి.. తెలంగాణకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశాను. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేశాను. అయినా.. ప్రయోజనం శూన్యం. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై తీవ్ర వివక్ష చూపింది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. కేంద్రం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించనందుకు నిరసనగా బుధవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన మాట్లాడారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. కేంద్రం తీరని అన్యాయం చేసిందని, అందుకే తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్చ పెట్టాల్సి వచ్చిందన్నారు. కేంద్రం వివక్షకు నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు.
విభజన హామీల్లో విఫలం
ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు రావాల్సిన, దక్కాల్సిన నిధులు, హక్కుల ఊసే ఎత్తడం లేదని రేవంత్ ఆరోపించారు. ‘‘బడ్జెట్‌లో బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, గిరిజన వర్శిటీలో వసతుల కల్పన, 4 వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో ఉన్న పాలకు లు పట్టించుకోలేదు. దీంతో.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. రాష్ట్రంలో గత ఏడాది కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. దాంతో విభజన హామీలపై ఢిల్లీ చుట్టూ తిరిగాను. దాంతోపాటు.. మూసీ రివర్ ప్రాజెక్టు, ఐటీ కారిడార్, ఫార్మా సిటీ సహ పలు కంపెనీలకు అనుమతులను ఇవ్వాలని కోరాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పీఎంకేఎ్‌సవై పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశాం. వీటికి ఈ బడ్జెట్‌లో న్యాయం జరుగుతుందని ఆశించినా.. భంగపాటే ఎదురైంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
బిహార్, యూపీలకేనా?
రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్న మొత్తంలో తిరిగి చాలా తక్కువ వెనక్కి వస్తోందని రేవంత్ దుయ్యబట్టారు. ‘‘ఈ వివక్ష ఎంతలా ఉందంటే.. కేంద్రానికి వెళ్తున్న ప్రతి రూపాయిలో.. కేవలం 43 పైసలనే తిరిగి ఇస్తున్నారు. అదే బిహార్‌కు ప్రతి రూపాయికి రూ.7.26 చెల్లిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రూ.3.41లక్షల కోట్ల జీఎస్టీ కేంద్రానికి వెళ్తే.. కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి రూ.6.91 లక్షల కోట్లను తిరిగి ఇచ్చింది. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలు-- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి కేంద్రానికి రూ.22.26 లక్షల కోట్ల జీఎస్టీ వెళ్లగా.. తిరిగి ఇచ్చింది మాత్రం రూ.6.91 లక్షల కోట్లే..! అంటే.. ఐదు రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తం, ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చిన నిధులతో సమానం. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని అడిగితే.. అమృత్ పథకం కింద రూ.3,500 కోట్లు ఇచ్చామంటున్నారు. అదేమీ గుజరాత్ నుంచో.. ఎవరి సొంత పైసల నుంచో ఇవ్వడం లేదు కదా?’’ అని దుయ్యబట్టారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో గళమెత్తుతామన్నారు.
5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే..
దేశం 5 ట్రిలియన్ ఎకానమీని సాధిస్తుందని ప్రధాని చెబుతుంటారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ లక్ష్యం నెరవేరాలంటే.. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సూచించారు. ‘‘దేశంలో ముంబై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాలు మెట్రోపాలిటన్ సిటీలుగా ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధికి మూసీ రివర్ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)కు నిధులిచ్చి.. మెట్రో విస్తరణకు సహకరించాలి’’ అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాలకు కూడా శాశ్వత పరిష్కారం చూపాలని మోదీని కోరామని, తెలంగాణకు సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని వివరించారు.
నేను సీఎంగా ఉండడం కొందరికి నచ్చట్లే..
తాను సీఎంగా ఉండడం కొందరికి నచ్చట్లేదని, కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు. ‘‘మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలిశాను. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై చర్చించాను. మోదీతో క లిసి సభలో మాట్లాడుతూ.. ఆయనను ‘పెద్దన్న’ అని సంబోధించాను. దాన్ని కూడా కొందరు రాజకీయం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీని కలిశానని.. ఎవరికో లొంగిపోవడానికో.. వంగిపోవడానికో కాదు’’ అని స్పష్టం చేశారు. ఎవరినో పెద్దన్న అని పిలిస్తే తనకు ముఖ్యమంత్రి పదవి రాలేదని, ప్రజాస్వామిక స్ఫూర్తితో తనను ఎన్నుకున్నారని, ప్రజలు తనకు ఈ పదవిని ఇచ్చారని చెప్పారు. కాగా.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, బడ్జెట్‌ను సవరించి, తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం డిమాండ్ చేశారు. ఈ తీర్మానానికి బీఆర్‌ఎస్ మద్దతు పలకగా.. బీజేపీ సభ్యులు వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Updated Date - Jul 25 , 2024 | 02:49 AM