ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మానవత్వం లేదా ?

ABN, Publish Date - Dec 22 , 2024 | 03:10 AM

‘‘ఒక్కపూట జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి సినీ ప్రముఖులంతా క్యూ కట్టారు. ఆయనకు ప్రమాదం జరిగిందా? ఏమైనా జబ్బు పడ్డారా? హీరోను పరామర్శించేందుకు క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో ఒక్కరైనా బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు!?

హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు..

బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదేం!

తొక్కిసలాటలో రేవతి చనిపోయారు. ఆమె కుమారుడికి ఆక్సిజన్‌ అందక బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయింది. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది. హీరోను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. అయినా, వినలేదు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాతే వెళ్తానన్నారు. దీంతో డీసీపీ వెళ్లి ఇక్కడి నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను పంపించారు.

- సీఎం రేవంత్‌

  • హీరో, నిర్మాత.. ఎవరూ పిల్లాడి దగ్గరకు పోలేదు

  • పోలీసులు రావద్దని చెప్పినా థియేటర్‌కు హీరో

  • అభిమానులు తోసుకొచ్చారు.. బాడీ గార్డ్స్‌ నెట్టారు

  • తొక్కిసలాటలో మహిళ మృతి.. కోమాలో బాలుడు

  • అయినా థియేటర్‌ నుంచి వెళ్లేందుకు హీరో ససేమిరా

  • అరెస్టు చేస్తామని హెచ్చరించి డీసీపీ పంపించారు

  • మానవత్వం లేని ఇలాంటి వాళ్లను అరెస్టు చేస్తే..

  • నీచమైన భాషతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే యత్నం

  • పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి

  • సోషల్‌ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టారు

  • ప్రాణాలు పోయినా ఏమీ అనొద్దనడం న్యాయమా?

  • సినిమాలు తీసుకోండి.. వ్యాపారం చేసుకోండి..

  • ప్రాణాలు పోతే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు

  • సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒక్కపూట జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి సినీ ప్రముఖులంతా క్యూ కట్టారు. ఆయనకు ప్రమాదం జరిగిందా? ఏమైనా జబ్బు పడ్డారా? హీరోను పరామర్శించేందుకు క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో ఒక్కరైనా బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు!? సినిమా చూడటానికి వెళ్లిన కుటుంబంలో మహిళ చనిపోతే 11వ రోజు వరకు హీరో, నిర్మాత ఎవరూ వారిని పరామర్శించలేదు. కనీసం ఆస్పత్రిలో ఉన్న ఆ పిల్లాడి దగ్గరకు పోలేదు. ఇది ఏ రకమైన మానవత్వం!?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిలదీశారు. కనీసం వారిని పరామర్శించాలన్న మానవత్వం కూడా సినిమా పరిశ్రమకు లేదా!? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయంటే సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు కల్పించబోమని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని తమ సర్కారు వదిలిపెట్టబోదని తేల్చి చెప్పారు. సంఽధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అసలు ఏం జరిగిందో ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కోరారు. దాంతో, సీఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. ఈ ఘటనపై విపక్షాలు, సినీ ఇండస్ట్రీ వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈనెల 4న పుష్ప-2 సినిమా విడుదలవుతుందని, ఆ రోజు చిత్ర యూనిట్‌ సభ్యులు, హీరో, హీరోయిన్‌ వస్తున్నారని, బందోబస్తు కావాలంటూ ఈనెల 2న సంధ్య థియేటర్‌ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో దరఖాస్తు పెట్టుకుంది. దాంతో, ఆ థియేటర్‌ పరిసరాల్లో పది వరకు సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయని, ఎంట్రీ, ఎగ్జిట్‌ ఒక్కటేనని, సెలబ్రిటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టమని, బందోబస్తు ఇవ్వడం కుదరదని మూడో తేదీనే చిక్కడపల్లి పోలీసులు రాతపూర్వకంగా జవాబిచ్చారు. దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు అందులో చెప్పారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్‌కు వెళ్లారు.


కేవలం సినిమా చూసి వెళ్లిపోతే అభ్యంతరం ఉండేది కాదు. కానీ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచే కారు రూఫ్‌ టాప్‌ ఓపెన్‌ చేసి రోడ్‌ షో చేసుకుంటూ వెళ్లారు. దీంతో, పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి అభిమానులు ఒక్కసారిగా థియేటర్‌ వైపు వచ్చారు. హీరో కారు థియేటర్‌ లోపలికి పంపేందుకు గేట్లు తెరిచారు. దాంతో ఆయన్ను చూసేందుకు అభిమానులంతా ఒక్కసారిగా లోపలికి తోసుకుంటూ వచ్చారు. వారిని నిలువరించేందుకు హీరో ప్రైవేటు సెక్యూరిటీ, బాడీ గార్డ్స్‌ గట్టిగా వెనక్కు నెట్టారు. అది తొక్కిసలాటకు దారి తీసింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయారు. ఆమె కుమారుడికి ఆక్సిజన్‌ అందక బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయింది. కోమాలోకి వెళ్లాడు. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది. హీరో థియేటర్‌ లోపల ఉండడంతో అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని సంధ్య థియేటర్‌ యాజమాన్యానికి చెప్పి, హీరోను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. అయినా, వారు వినలేదు.


సరికదా బాడీ గార్డ్‌లు పోలీసులను నిలువరించారు. పరిస్థితి చేజారే ప్రమాదం ఉందని గుర్తించి ఏసీపీ రంగంలోకి దిగారు. శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని, ఇప్పటికే ఒకరు చనిపోయారని, మరొకరు ఆస్పత్రి పాలయ్యారని హీరోకు ఏసీపీ వివరించారు. తక్షణమే థియేటర్‌ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయినా.. సినిమా మొత్తం అయిపోయిన తర్వాతే వెళ్తానని అంటూ బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్‌ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్లి ఇక్కడి నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు. థియేటర్‌ నుంచి వెళ్లేటప్పుడు కూడా కార్‌ రూఫ్‌ టాప్‌ ఓపెన్‌ చేసి రోడ్‌ షో చేస్తూ వెళ్లారు’’ అని వివరించారు. ఈ నేపథ్యంలోనే హీరోపై, యాజమాన్యంపై పోలీసులు కేసు పెట్టారని, తర్వాత హీరో ఇంటికి వెళ్లినప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించాడని, బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చాడని, అందుకే పోలీసులు వారి విధి నిర్వహించారని వివరించారు.


కేటీఆర్‌ది పైశాచికత్వం

ఒకరి మృతికి కారణమైన వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళితే.. కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రేవతి భర్త చిరుద్యోగి. నెలకు రూ.30 వేలే జీతం. అయినా.. తన కొడుకు ఆ హీరో అభిమాని అని తనయుడి కోసం ఒక్కో టికెట్‌ రూ.3 వేల చొప్పున రూ.12 వేలు పెట్టి కొన్నారు. హీరోపై అభిమానంతో అంత డబ్బు వెచ్చించారు. థియేటర్‌లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాడిని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్లను పోలీస్‌ ేస్టషన్‌కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తప్పు పట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారు. సోషల్‌ మీడియాలోనూ, యూట్యూబ్‌ చానెల్స్‌లోనూ ఎంతో నీచమైన భాష వాడారు’’ అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలు చేశామని చెప్పుకొనే వాళ్లు, పదేళ్లు మంత్రిగా పనిజేసిన వ్యక్తులు సోషల్‌ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టారని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో సినిమా షూటింగులు ఆపి.. వీళ్లంతా దాడులు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు ఆ హీరో వాళ్లకు భగవత్‌స్వరూపుడు అయ్యాడని ఎద్దేవా చేశారు.


హీరోను ఒక్కరోజు అరెస్టు చేయగానే హైకోర్టులో స్పెషల్‌ పిటిషన్‌, లంచ్‌ మోషన్‌ వేశారని, బెయిల్‌పై వచ్చేలా చేశారని వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి తమ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందని, ప్రాణాలు బలి తీసుకున్నా వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయమని సీఎం ప్రశ్నించారు. ఫిల్మ్‌ స్టార్స్‌, సూపర్‌ స్టార్స్‌, పొలిటికల్‌ స్టార్స్‌ హత్యలు చేసినా వాళ్లను విచారించవద్దని మీరు చట్టం చేస్తే తాము అమలు చేస్తామని ఎద్దేవా చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిపై బరాబర్‌ కేసులు పెట్టి విచారించాల్సిందేనని స్పష్టం చేశారు. తన తమ్ముడికే కేసుల నుంచి మినహాయింపు ఉండబోదన్నారు. ‘‘సినీ ప్రముఖులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. అమానవీయ ఘటనలను ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. సినిమాలు తీసుకోండి. వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి. షూటింగులకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నేను కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలను ఉపేక్షించను. ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడడమే నా బాధ్యత. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ఈ ప్రభుత్వం వదిలి పెట్టదు’’ అని సీఎం రేవంత్‌ తేల్చి చెప్పారు. ఆ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.


రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన సర్కారు

సంధ్య థియేటర్‌ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షలు అందించనున్నట్లు సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక నుంచి సినిమా విడుదలకు ముందు రోజు ఎటువంటి బెనిఫిట్‌ షోలు ఉండబోవని తేల్చి చెప్పారు. టికెట్ల రేట్లు పెంచేందుకు కూడా అనుమతి ఇవ్వబోమన్నారు. బాలుడి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న హామీని కూడా అల్లు అర్జున్‌ నిలబెట్టుకోలేదన్నారు. శ్రీతేజ్‌ వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 03:10 AM