CM Revanth Reddy: రైతులూ.. వ్యాపారాలు చేయండి!
ABN, Publish Date - Sep 19 , 2024 | 03:33 AM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
కుటుంబమంతా వ్యవసాయంలోనే ఉండొద్దు.. ఉద్యోగాలపైనా దృష్టి పెట్టాలి
నాలుగేళ్లలో రాష్ట్ర బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు!
చైనా ప్లస్1కి తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం
ఎన్నారైల పెట్టుబడులతోనే రియల్ ఎస్టేట్ వృద్ధి
ఎంఎస్‌ఎంఈ పాలసీ విడుదల సభలో సీఎం రేవంత్
గత ప్రభుత్వం గొప్పలు చెప్పి, పైసలివ్వలేదు: భట్టి
కాగితాల్లో కాదు అమలు చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక్కడ అన్ని రకాల వనరులు అందుబాటులో ఉండడంతో కంపెనీలు తరలి వస్తున్నాయన్నారు. ఫలితంగా ఇక్కడి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) వ్యాపారం కూడా బాగా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ 2028కల్లా రూ.7 లక్షల కోట్లకు చేరుతుందని బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తామని, పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. బుధవారం రాష్ట్ర ‘ఎంఎ్‌సఎంఈ విధానాన్ని’ విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలను అమలు చేశారని చెప్పారు. వాటివల్లే నేడు భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు. పీవీ ఎమ్మెల్యేగా గెలిచిన మంథని నుంచే ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు కూడా గెలిచారని.. ఈయన పారిశ్రామిక సంస్కరణలు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాయని మంత్రిని ప్రశంసించారు. నేడు ప్రపంచం చైనా ప్లస్1గా భారతదేశాన్ని అందులో తెలంగాణనూ చూస్తోందని సీఎం చెప్పారు.
కాంగ్రెస్ దూరదృష్టితో హైదరాబాద్ అభివృద్ధి
చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవాన్ని వైఎస్సార్ వేగంగా ముందుకు తీసుకెళ్లారని సీఎం రేవంత్ చెప్పారు. అలాగే ఇందిరాగాంధీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐడీపీఎల్ కారణంగా నేడు పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన బీహెచ్‌ఈఎల్, ఐటీ కంపెనీలతో నగరం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. కొండాపూర్, మాదాపూర్ గ్రామాలు నేడు ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని చెప్పారు. శిల్పారామం, హైటెక్ సిటీ ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వాల ఘనతేనని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థులు పట్టాలు సాధిస్తున్నారు తప్ప.. ఉపాధి అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారని సీఎం అన్నారు. దీనికి పరిష్కారంగానే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయని.. వాటిలో ఇప్పటికీ 45 ఏళ్ల కిందటి సిలబ్‌సనే బోధిస్తున్నారని చెప్పారు. సిలబ్‌సతోపాటు విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకే టాటా సంస్థతో కలిసి రూ.2400 కోట్లతో ఐటీఐలను ఉన్నతీకరిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని తమ ప్రభుత్వం నమ్ముతుందని రేవంత్ చెప్పారు. అందుకే రైతులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఇటీవలే రూ.2 లక్షల రుణమాఫీ పథకం కోసం రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాలో వేశామని.. అయినా రైతుల కష్టాలు తీరడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను నిశితంగా గమనించి రైతులకు ఓ మాట చెబుతున్నా. కుటుంబంలోని సభ్యులంతా వ్యవసాయంపైనే ఆధారపడొద్దు.
ఇద్దరో ముగ్గురో వ్యవసాయంలో ఉండండి. మిగిలిన వారు బయటికి వచ్చి వ్యాపారాలు, ఉద్యోగాల్లో రాణించాలి. అప్పుడే రైతుల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. కృష్ణా, గుంటూరు, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని రైతులు వారి పిల్లలను ఐటీ రంగంలో చదివించకపోయి ఉంటే వారి కుటుంబాల్లో నేడు ఆర్థిక ఎదుగుదల రాకపోయేది. ఇతర దేశాల్లో స్థిరపడిన ఎన్నారైల పెట్టుబడులతోనే రాష్ట్రంలో భూముల విలువలు పెరిగాయి’’ అని సీఎం రేవంత్ చెప్పారు. గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక ఎకరం కొనే ధరలో తెలంగాణలో పది ఎకరాలు కొనేవాళ్లని.. నేడు తెలంగాణలో ఒక ఎకరం ధరలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వంద ఎకరాలు కొనే పరిస్థితి ఉందని అన్నారు.
మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు..
ఔటర్ రింగురోడ్డుకు ప్రత్యామ్నయంగా ఆర్‌ఆర్‌ఆర్‌ను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చెప్పారు. అమెరికాలో హట్సన్, లండన్‌లో థేమ్స్ నదుల్లా హైదరాబాద్‌లో మూసీని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యాటకులు ఇక్కడికి వచ్చి మూసీ నదిని చూసేలా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. 63 లక్షల మహిళా సంఘాలను కోటికి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రేవంత్ చెప్పారు.
నన్ను బలవంతంగా తీసుకొచ్చారు: భట్టి
‘ఇక్కడికి రావడానికి ముందు ముఖ్యమంత్రి నన్ను ఇంటికి పిలిపించారు. అక్కడ ఆయన, మంత్రి శ్రీధర్ బాబు.. నన్ను గంటసేపు కూర్చోబెట్టి.. ఎంఎ్‌సఎంఈల బకాయిలకు సంబంధించి రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశారు. ఆ మేరకు సభలో చెప్పాలంటూ నన్ను బలవంతగా ఇక్కడి తీసుకొచ్చారు’ అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. మనం ప్రకటించిన హామీలకు ఎంతైనా ఇస్తా.. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిలను ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినా సీఎం వినలేదని చెప్పారు. ముఖ్యమంత్రి విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున రూ.2 వేల కోట్ల బకాయిలు విడతలవారీగా చెల్లిస్తామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఎంతో కష్టపడుతున్నారని ప్రశంసించారు.
గత విధానాలన్నీ కాగితాలకే పరిమితం: శ్రీధర్ బాబు
నూతన ఎంఎ్‌సఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయమని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామంటూ గొప్పలు చెప్పారని.. అనేక విధానాలు ప్రకటించినా, అమలుకు నోచుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎ్‌సఎంఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. తమ విధానాలు కాగితాలకే పరిమితం కావని.. క్షేత్రస్థాయిలోనూ అమలవుతాయని స్పష్టం చేశారు.
Updated Date - Sep 19 , 2024 | 03:33 AM