ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: పక్క రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంతోనే మా పోటీ

ABN, Publish Date - Aug 15 , 2024 | 02:15 AM

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరంగా పొరుగు రాష్ట్రాలతోనో, మరే ఇతర రాష్ట్రాలతోనో పోటీ పడటం కాదని, ప్రపంచంతోనే పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

  • హైదరాబాద్‌ లాంటి నగరం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం మరెవరికీ లేవు

  • ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి ఆగలేదు

  • కాంగ్రెస్‌ హయాంలోనే ఐటీ రంగానికి పునాది

  • బాబు, వైఎస్‌ సైబరాబాద్‌ను అభివృద్ధి చేశారు

  • నాలుగో నగరాన్ని మేం నిర్మించనున్నాం

  • ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా ఫోర్త్‌ సిటీ

  • ట్రిలియన్‌ డాలర్ల తెలంగాణే మా సంకల్పం: రేవంత్‌

  • కాగ్నిజెంట్‌ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారగానే.. తెలంగాణకు ఆ రాష్ట్రంతో పోటీ ఉంటుందని, హైదరాబాద్‌ పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయని ఓ చర్చ జరిగింది. ఈ విషయంపై నేను స్పష్టంగా చెప్పదలచుకున్నా. నా పోటీ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలతో కాదు. నా పోటీ ప్రపంచంతో..

- సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరంగా పొరుగు రాష్ట్రాలతోనో, మరే ఇతర రాష్ట్రాలతోనో పోటీ పడటం కాదని, ప్రపంచంతోనే పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడ ఉన్న వాతావరణం, పని సంస్కృతి అంత గొప్పగా ఉంటాయని అన్నారు. దేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్న కాగ్నిజెంట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి విమానసేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.


పక్క రాష్ట్రాలకు హైదరాబాద్‌ లాంటి నగరం, శంషాబాద్‌ లాంటి అంతర్జాతీయ విమానాశ్రయం, ఇక్కడ ఉన్న స్థాయిలో శాంతిభద్రతలు లేవని చెప్పారు. బుధవారం.. ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌.. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఏర్పాటు చేసిన నూతన క్యాంప్‌సను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 16 అంతస్తుల్లో 10 లక్షల చదరపుల అడుగుల్లో 9వేల మంది ఉద్యోగుల సామర్థ్యంతో క్యాంప్‌సను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌ వంటి పారిశ్రామిక అనుకూల నగరం మరెక్కడా లేదు. పరిశ్రమలు, సంస్థలకు ఇక్కడ తగినంత భద్రత, సంస్థలకు అవసరమైన యువశక్తి తెలంగాణలో ఉన్నాయి.


తెలంగాణ రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండాలని, పెట్టుబడిదారులను ప్రోత్సహించే విధానం ఉండాలని మా ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందుకే ప్రభుత్వం మారినా విధానాల్లో మార్పు లేదు. ఇంకా వేగంగా, పారదర్శకంగా, పట్టుదలతో మా ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటోంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, అనుమతులు తాము కల్పిస్తామని చెప్పారు.


  • కాంగ్రెస్‌ హయాంలోనే ఐటీకి పునాదిరాయి..

‘‘హైదరాబాద్‌ నగరానికి 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కులీకుతుబ్‌ షా నుంచి నిజాం వరకు హైదరాబాద్‌ను నిర్మిస్తే.. నిజాం, బ్రిటీషువారు కలిసి రెండో నగరం సికింద్రాబాద్‌పే నిర్మించారు. చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ కలిసి మూడో నగరం సైబరాబాద్‌ను నిర్మించారు. ప్రపంచ అవసరాలు తీర్చేందుకు నాలుగో నగరాన్ని మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. సాంకేతిక నైపుణ్యమే నిరుద్యోగ సమస్యకు పరిష్కారమని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి 1992లో ఐటీ సెక్టార్‌ కోసం పునాదిరాయి వేశారు. తర్వాత చంద్రబాబునాయుడు హైటెక్‌ సిటీ నిర్మించారు.


అన్ని రంగాల్లో నగరం రాణించడం వల్ల సైబరాబాద్‌ గణనీయంగా వృద్ధి సాధించింది’’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఎవరు పాలించినా, ఎన్ని వ్యవస్థలు మారినా ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడ్డారని తెలిపారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నా.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. చైనాతోపాటు పెట్టుబడులు పెట్టేందుకు మరో దేశం కోసం (‘చైనా ప్లస్‌-1) అమెరికా, దక్షిణ కొరియా, ఇతర దేశాల నిరీక్షణకు తాము అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్‌ సిటీ సమాధానంగా మారుతుందన్నారు. తమ చిత్తశుద్థి ఏమిటో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధే నిరూపిస్తుందని ఉద్ఘాటించారు. ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపాలనేది తమ సంకల్పమని ప్రకటించారు. కాగ్నిజెంట్‌ సంస్థ లక్ష ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, ఫ్యూచర్‌ సిటీలోనూ పెట్టుబడులు పెట్టాలని అన్నారు.


  • త్వరలోనే మరిన్ని ఒప్పందాలు..

అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పొరేట్‌ లీడర్స్‌.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ పర్యటనల ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని వెల్లడించారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనుట్లు చెప్పారు. పెట్టుబడులపై సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అమెరికా, దక్షిణ కొరియాలో ప్రతి పారిశ్రామికవేత్త హైదరాబాద్‌ గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. ఏఐ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, ఉద్యోగులు తమ నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పెంపొందించుకునేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.


  • కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌లో 57 వేల మంది ఉద్యోగులు..

తమ నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌ కీలకమైన హబ్‌ అని కాగ్నిజెంట్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, అమెరికా విభాగం అధ్యక్షుడు సూర్య గుమ్మడి తెలిపారు. 2002 నుంచి కాగ్నిజెంట్‌ అభివృద్థిలో కీలకమైన హైదరాబాద్‌లో నూతన స్ట్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.46 లక్షల మంది ఉద్యోగులు ఉంటే.. అందులో భారతదేశంలోనే 2.40 లక్షల మంది ఉన్నారని, వారిలో 57 వేల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని వివరించారు.


ఇందులో 39 శాతం మంది మహిళలేనని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌తో తమది వ్యూహాత్మకమైన పెట్టుబడి అని, స్థానికంగా ప్రతిభావంతులైన యువతకు ఉపాధి కల్పిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఏఐ, ఎంఎల్‌, డేటా ఇంజనీరింగ్‌, ఐవోటీలో కట్టింగ్‌ ఎడ్జ్‌ సమస్యలకు తమ హైదరాబాద్‌ కేంద్రం పరిష్కారం చూపిస్తుందని సూర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 02:15 AM

Advertising
Advertising
<