CM Revanth Reddy: పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా?
ABN, Publish Date - Nov 21 , 2024 | 03:38 AM
‘‘రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా? పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వొద్దా? పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
కొడంగల్ నియోజకవర్గంపై కక్ష ఎందుకు కేసీఆర్? నేనేమైనా లక్ష ఎకరాల భూములు సేకరించానా? నాలుగు గ్రామాల్లో వెయ్యి, పన్నెండు వందల ఎకరాలు సేకరిస్తే.. మీకు కడుపుమంట ఎందుకు? మీ దుఃఖం, బాధ ఏమిటని అడుగుతున్నా. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఇట్లాగేనా? భూములు సేకరించకుండా పరిశ్రమలు పెట్టలేరని తెలియదా?
- సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొద్దా?
నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వొద్దా?
మీరు ప్రాజెక్టులు ఎలా కట్టారు?
కొడంగల్‌పై ఇంత కక్ష ఎందుకు?
కలెక్టర్‌పై దాడులు చేయిస్తారా?
కుట్రలు చేస్తే ఊచలు లెక్కబెట్టిస్తాం
కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజం
‘కాళేశ్వరం’ నీళ్లు రాకుండానే 1.53 కోట్ల టన్నుల ధాన్యం పండించారు
రాష్ట్రాన్ని అన్నింటా అభివృద్ధి చేస్తాం
వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి
కరీంనగర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా? పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వొద్దా? పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏటా లక్షా 10 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు చదివి బయటకు వస్తున్నారని, వారికి ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దా? అని అన్నారు. బుధవారం పలువురు మంత్రులతో కలిసి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని సీఎం రేవంత్ దర్శించుకున్నారు.
సుమారు 1000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. ‘‘పదేళ్ల మీ హయాంలో భూసేకరణ చేయలేదా? మల్లన్నసాగర్ కోసం 10 గ్రామాల ప్రజలను నిండా ముంచలేదా? ఎయిర్ పోర్టు పక్కన ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించలేదా? ఇవాళ కొడంగల్‌లో భూమి సేకరిస్తే కడుపుమంట, వివక్ష ఎందుకు? నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించి... భూసేకరణ చేయడానికి వెళ్లిన కలెక్టర్‌పై, ఇతర అధికారులపై బీఆర్‌ఎస్ నేతలు దాడులు చేశారు. ఇలాంటి వారిపై కేసులు పెడితే.. ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు ఇది సమంజసమేనా? అని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని, అందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తే ఊచలు లెక్కించడం ఖాయమని హెచ్చరించారు.
భూసేకరణ జరగాల్సిందే..
పరిశ్రమలు స్థాపించాలంటే, అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందేనని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే భూములు కోల్పోయిన వారి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నారు. భూములు కోల్పోయే వారికి భూమి రేటును మూడు రెట్లు పెంచి పరిహారంగా ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని, రైజింగ్ తెలంగాణగా నిలుపుతామని ప్రకటించారు. ఈ దేశానికి దశ దిశను నేర్పిన పీవీ నర్సింహారావు, చొక్కారావు, ఎంఎ్‌సఆర్‌ను అందించిన గడ్డ కరీంనగర్ అని రేవంత్ కొడియాడారు. పెప్పర్ స్ర్పేలకు భయపడకుండా తెలంగాణ నాడు ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. పొన్నంను ఎంపీని చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. కానీ, బండి సంజయ్‌ను రెండుసార్లు గెలిపిస్తే ఆయన చేసిందేమి లేదని, మంత్రి మాత్రం అయ్యారని విమర్శించారు. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లేవారి కోసం గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేశామని, ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.
కాళ్లలో కట్టెలు పెడుతున్నారు
తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ చేయలేని పనులన్నింటినీ చేస్తున్నామని రేవంత్ చెప్పారు. కేసీఆర్ ఫామ్‌హౌ్‌సలో పడుకుంటే.. కొడుకు, అల్లుడు తమ కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. 25 రోజుల్లో 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఇందుకు ఒక పెద్దమనిషిగా తమను అభినందించాల్సింది పోయి.. చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘ఈ పదేళ్లలో నువ్వేమి చేశావో ఒక రోజంతా చర్చ చేద్దాం.. లెక్కలేందో తేలుద్దాం.. అసెంబ్లీకి రా సామీ. నువ్వు దిగిపో.. దిగిపో అని నీ కొడుకు, అల్లుడు అంటున్నారు. మీ నొప్పికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మందు పెట్టేందుకు మావాళ్లు సిద్ధంగా ఉన్నారు’’ అని రేవంత్ అన్నారు. తాము వచ్చాక 50 వేల ఉద్యోగాలు కల్పించామని, వాళ్లందరినీఎల్‌బీ స్టేడియంకు పిలిపిస్తానని, వచ్చి లెక్కపెట్టుకోవాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెబుతానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకున్నా.. రైతులు ఈ సీజన్‌లో 66 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసి 1.53 కోట్ల టన్నుల దిగుబడులు సాధించారని తెలిపారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, కానీ.. ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.
ఫామ్‌హౌ్‌సల కోసమే రిజర్వాయర్లు..
రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లను వాళ్ల ఫామ్ హౌస్‌ల కోసమే నిర్మించారని రేవంత్ ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిని బదలాయించుకుని హరీశ్‌రావు రంగనాయక సాగర్‌లో ఫామ్‌హౌస్ నిర్మించారని తెలిపారు. ‘‘హరీశ్‌రావ్.. ఏం చింతచేయకు.. నీ లెక్క కూడా తీస్తా. కేటీఆర్.. నువ్వు ఎక్కడ తిరిగినా, కుట్రలు చేసినందుకు ఊచలు లెక్క పెడతావు గుర్తుంచుకో’’ అని రేవంత్ హెచ్చరించారు. కొండపోచమ్మసాగర్ నుంచి కేసీఆర్ తన ఫామ్‌హౌ్‌సకు నేరుగా కాలువ నిర్మించుకుని వందల ఎకరాలు సాగు చేస్తున్నారని తెలిపారు. దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేసుకుని కొండపోచమ్మ వద్దకు రావాలని సవాల్ చేశారు. కేటీఆర్‌ను మునిసిపల్ శాఖ మంత్రిని చేస్తే జీవో 111 ఉండగా జన్వాడలో ఫామ్ నిర్మించారని, ఆయన బావమరిది మరొకటి నిర్మించుకున్నారని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం 75 ఏళ్లలో అభివృద్ధికి నోచుకోలేదని, తొండలు గుడ్లు పెట్టని వెయ్యి, 1200 ఎకరాల భూమిని సేకరించి పారిశ్రామిక వాడ పెట్టి పరిశ్రమలు పెట్టి అక్కడి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని తాను భావించానని అన్నారు. వంద మంది రౌడీ మూకలకు డబ్బులిచ్చి కలెక్టర్‌ను, ఆర్‌డీవోను, అధికారులను ఇష్టం వచ్చినట్లు కొట్టి చంపడానికి ప్రయత్నిస్తే కేసులు ఎందుకు పెడతారని బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.
రాజన్నకు.. కోడె మొక్కు! సీఎం హోదాలో ఆలయానికి రేవంత్
వేములవాడ కల్చరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఉదయం 10.57 గంటలకు రాజన్న ఆలయ గుడిచెరువు వద్ద హెలికాప్టర్ దిగిన ముఖ్యమంత్రి.. నేరుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఫూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానం ఆవరణలో ధర్మగుండం వద్ద రూ.76 కోట్లతో చేపట్టే ఆలయాభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద కోడెను కట్టి మొక్కు చెల్లించుకున్నారు.
Updated Date - Nov 21 , 2024 | 03:38 AM