CM Revanth Reddy: రెండేళ్లలో హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు..
ABN , Publish Date - Dec 06 , 2024 | 04:13 AM
వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 3వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను నగరం నుంచి బయటకు, ఓఆర్‌ఆర్ ఆవలకు తరలిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
డీజిల్ బస్సులు, ఆటోలు ఓఆర్‌ఆర్ అవతలకు తరలింపు
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలు
ఆర్టీసీకి వెలుగులు నింపుతున్న మహాలక్ష్మి పథకం: సీఎం
ఉచిత ప్రయాణం.. 3902 కోట్ల చెక్కు ఆర్టీసీకి అందజేత
హైదరాబాద్, డిసెంబర్5 (ఆంధ్రజ్యోతి): వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 3వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను నగరం నుంచి బయటకు, ఓఆర్‌ఆర్ ఆవలకు తరలిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. డీజిల్ బస్సులను తొలగించగానే వెంటనే 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. డీజిల్ బస్సులు సహా డీజిల్ ఆటోలను కూడా ఓఆర్‌ఆర్ బయటకు పంపిస్తామన్నారు. ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాయితీలు అమలు చేస్తామని, ఎలక్ట్రిక్ ఆటోలు కొన్నవారికి రాయితీలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కాలం చెల్లిన వాహనాల (15 ఏళ్లు)ను స్ర్కాపింగ్‌కు తరలిస్తామన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా వచ్చే రెండేళ్లలో ఈ విధానాన్ని అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ, టీజీఎస్ ఆర్టీసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఢిల్లీలో కాలుష్య సమస్య కారణంగా కేంద్ర మంత్రి గడ్కరీ తాను ఢిల్లీకి వస్తే అనారోగ్యానికి గురికావాల్సి వస్తోందని ప్రకటించిన విషయాన్ని రేవంత్ ప్రస్తావిస్తూ దేశంలో ఇతర నగరాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలు హైదరాబాద్‌లో ఏర్పడకుండా రక్షించుకోవలిసిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ నూతన రూపొందించిన లోగోను సీఎం ఆవిష్కరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీలో వెలుగులు నింపుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు చార్జీల మొత్తం 3,902.31 కోట్ల చెక్కును అందజేశారు. మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ పత్రాలను అందజేశారు. అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రవాణా శాఖలో యూజర్ చార్జీలను వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరారు.