Congress Government : మూడో విడత రుణమాఫీ.. రెండు దఫాల్లో!
ABN, Publish Date - Jul 31 , 2024 | 05:36 AM
రూ.2 లక్షలు, ఆపైన రుణాలున్న రైతులను రెండు విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష, లక్షన్నర రుణాలను రెండు విడతల్లో మాఫీ చేసిన సర్కారు..
రూ.2 లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ
అంతకుమించి అప్పున్న వారికి మరో దఫాలో..
రూ.15 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రూ.2 లక్షలు, ఆపైన రుణాలున్న రైతులను రెండు విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష, లక్షన్నర రుణాలను రెండు విడతల్లో మాఫీ చేసిన సర్కారు.. రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువగా అప్పులున్న రైతులకు రెండు దఫాలుగా రుణమాఫీ చేయనుంది.
రూ.2 లక్షల వరకు అప్పున్న రైతులను ఒక విభాగంలో, రూ.2 లక్షల కంటే ఎక్కువగా బకాయిలున్న రైతులను మరో విభాగంలో తీసుకోనుంది. అంటే.. మూడో విడత రుణమాఫీని రెండు దఫాలుగా అమలు చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు రైతుల రుణ సమాచారాన్ని సేకరిస్తున్నారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం.. రూ.2 లక్షల కంటే ఎక్కువ బాకీ ఉన్న రైతులకు కూడా రూ.2 లక్షలు మాఫీ చేస్తారు. అంటే ఒక రైతుకు 3 లక్షల పంట రుణం ఉంటే.. అందులో రూ.2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆగస్టులో మూడో విడత మాఫీ పూర్తయిన తర్వాత.. ఇలాంటి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం పట్టనుంది.
ముందు రైతులు.. ఆ తర్వాత ప్రభుత్వం
రూ.2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని రైతులు ముందుగా బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలు మాఫీ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతుకు రూ. 2.50 లక్షల పంట రుణం ఉంటే.. తొలుత ఆ రైతు రూ.50 వేలు బ్యాంకులో చెల్లించాలి.
ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలను మాఫీ చేసి, రైతు రుణ ఖాతాను జీరో చేస్తుంది. అయితే రెండు లక్షలకు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలున్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభం కావడం, పెట్టుబడి ఖర్చులు ఉండడంతో 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడం రైతులకు ఇబ్బందికరంగా మారనుంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసుకోవడానికి, అదేక్రమంలో రైతులకు బకాయిలు ఉండకుండా ఏకకాలంలో పంట రుణ ఖాతాను జీరో చేయడానికే ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలను గుర్తించడానికి మూడో విడత తర్వాత సర్వే చేయనున్నారు.
రెండు విభాగాలకు రూ.15 వేల కోట్లు
మూడో విడతలో 2 లక్షల రుణమాఫీకి రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. మొదటి, రెండో విడత రుణమాఫీకి కూడా రూ.6 వేల కోట్ల చొప్పున నిధులు వెచ్చించారు. రూ.2 లక్షలకు మించి అప్పున్న రైతులకు మాఫీ చేయడానికి రూ.9 వేల కోట్ల మేర అవసరమవుతున్నట్లు అంచనాలున్నాయి.
అంటే 2 లక్షలు, ఆపై రుణం ఉన్న రైతులకు మాఫీ చేయడానికి 15 వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. అయితే సీఎం రేవంత్ మంగళవారం కూడా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతుల నుంచి వచ్చే అర్జీలు, తప్పొప్పులు, సవరణలు.. వాటి పరిష్కారంతో మరో రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 3 విడతల మాఫీకి 31 వేల కోట్లు వెచ్చించనున్నారు.
Updated Date - Jul 31 , 2024 | 05:38 AM