Damodara: మాపై కేసులు ఎత్తేయండి..
ABN, Publish Date - Sep 26 , 2024 | 03:28 AM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రతిగా ఆ ప్రభుత్వం మాపై కేసులు పెట్టింది.
గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు కేసులు
ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం
మంత్రి దామోదరకు కార్యకర్తల వినతి
గాంధీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’
285 దరఖాస్తులు తీసుకున్న మంత్రి
30విజ్ఞప్తులకు అప్పటికప్పుడే పరిష్కారం
నిరంతరం కొనసాగిస్తాం: మహేశ్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రతిగా ఆ ప్రభుత్వం మాపై కేసులు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది నెలలు గడిచినా.. ఇంకా పోలీ్‌సస్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. బీఆర్‌ఎస్ హయాంలో మాపై పెట్టిన కేసులను ఎత్తివేయండి’’ అంటూ పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాల నేతలు మంత్రి దామోదర రాజనర్సింహకు విన్నవించుకున్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితుల కోసం ధర్నాలు, పోరాటాలు చేసిన తాము ఇప్పటికీ ఆ కేసులను ఎదుర్కొంటున్నామని గజ్వేల్‌కు చెందినవారు మంత్రి దృష్టికి తెచ్చారు. గాంధీభవన్‌లో బుధవారం ప్రారంభమైన ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి ఈ మేరకు మొర పెట్టుకున్నారు.
కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం వారానికి రెండు రోజుల చొప్పున మంత్రులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తొలిరోజు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు వచ్చారు. వారి నుంచి ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మంత్రి విజ్ఞాపనలు స్వీకరించారు. ప్రజలు మంత్రిని కలిసేందుకు ఇందిరాభవన్‌లో తగిన ఏర్పాట్లు చేశారు. మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి విజ్ఞాపనలు స్వీకరించారు. తొలి రోజున 285కు పైగా విజ్ఞాపనలు వచ్చాయి. వీటిలో 30 మంది సమస్యలపైమంత్రి దామోదర అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించారు. ఇక దరఖాస్తులన్నింటినీ గాంధీభవన్ సిబ్బంది శాఖలవారీగా నమోదు చేశారు. వాటికి టీపీసీసీ అఽధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖలనూ జత చేసి సదరు శాఖల మంత్రులకు పంపించనున్నారు. దరఖాస్తుల్లో ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, బీఆర్‌ఎస్ హయాంలో పెట్టిన కేసులు, ఉద్యోగాలు, వైద్య సేవలు వంటివి ఉన్నాయి. జీవో 317 బాధితులు కూడా వచ్చి మంత్రి వద్ద తమ గోడు వినిపించారు.
ప్రక్రియ కొనసాగుతుంది..
కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తనూ గౌరవిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇందులో భాగంగానే గాంధీభవన్‌లో వారానికి రెండు రోజులు మంత్రితో ముఖాముఖి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రశాంతంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలు విన్నవారే లేరని, ఇప్పుడు తాము ప్రజలకు సమయం ఇచ్చి వారి సమస్యలను తెలుసుకుంటున్నామని అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అద్భుతమైన ఆలోచన అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు అనే తేడా లేకుండా అందరి అర్జీలు తీసుకొని పరిష్కరిస్తామన్నారు.
వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి మంచి జరుగుతుందన్నారు. ఓవర్ నైట్ లో సమస్యలు పరిష్కారం అవుతాయని తాము అనుకోవట్లేదని, ఒక్కొకటిగా చేస్తూ అన్నీ పరిష్కరిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి పేరుతో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు కానుంది. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిని ప్రారంభిస్తారని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్‌కుమార్ తెలిపారు.
Updated Date - Sep 26 , 2024 | 03:28 AM