MallaReddy: మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా..? ఎందుకంటే..?
ABN , Publish Date - May 18 , 2024 | 02:23 PM
మాజీమంత్రి మల్లారెడ్డిని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారా..? అందుకే వరసగా భూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారా..? అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు.
హైదరాబాద్: పరిచయం అవసరం లేని పేరు మల్లారెడ్డి. విద్యాసంస్థల అధినేతగా, రాజకీయ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమ విద్యాసంస్థల్లో జరిగే ఈవెంట్స్‌లలో డ్యాన్స్ చేసి హోరెత్తిస్తుంటారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వం మారింది.. మల్లారెడ్డి కాస్త సైలంట్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, రేవంత్ రెడ్డి సీఎం జరగడం చకచకా జరిగిపోయాయి. అంతకుముందు రేవంత్ రెడ్డి లక్ష్యంగా మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లూ అంతా బాగానే ఉంది. ఆ తర్వాత మల్లారెడ్డి టార్గెట్ అయినట్టు అనిపిస్తోందని ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు. గతంలో 47 ఎకరాల భూ వివాదంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరో భూ వివాదం ఈ రోజు తెరపైకి వచ్చింది.
టార్గెట్ ఎందుకంటే..?
సీఎం రేవంత్ రెడ్డి గతంలో మల్లారెడ్డి గురించి తీవ్ర ఆరోపణలు చేశారు. జవహర్ నగర్‌లో తప్పుడు పత్రాలు సృష్టించి ఆస్పత్రి కట్టారని, సురారంలో చెరువు కబ్జా చేసి ఆస్పత్రి కట్టారని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసి, ఆస్పత్రి, కాలేజీ కట్టాడని.. మల్లారెడ్డి వర్సిటీకి అనుమతి వచ్చిన భూమి కూడా దొంగ భూమి అని ఆరోపణలు చేశారు. రేవంత్ ఆరోపణలపై ఆ సమయంలో మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ మాదిరిగా బ్రోకరిజం చేసి పదవి తెచ్చుకోలేదని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లోకి రాకముందే తమ విద్యాసంస్థలకు 600 ఎకరాల భూమి ఉందని వివరించారు. అందులో కబ్జా భూమి లేదని స్పస్టం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసి పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారు హీరో అని తొడగొట్టి మరి మల్లారెడ్డి సవాల్ చేశారు. డైలాగ్ వార్ అలా కొనసాగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.
47 ఎకరాల భూమి
మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు మల్లారెడ్డి, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్) జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
2.20 ఎకరాల భూమి
ఆ కేసు నడుస్తుండగా మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. పెట్ బషీరాబాద్ స్టేషన్ పరిధిలో గల సుచిత్ర పరిధి సర్వే నంబర్ 82లో రెండున్నర ఎకరాల భూ వివాదం తెరపైకి వచ్చింది. ఈ భూమి మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందినది. రెండున్నర ఎకరాలు తమదేనని రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. ఎకరం 11 గుంటలు తమదని 15 మంది చెబుతున్నారు. భూ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఇంతలో శనివారం రోజున ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను అల్లుడితో కలిసి తొలగించే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మల్లారెడ్డి వినిపించుకోలేదు. తన భూమినే కబ్జా చేస్తార్రా అని శివలెత్తారు.
వరసగా భూ వివాదాలు
అధికారం కోల్పోయినప్పటి నుంచి మల్లారెడ్డికి చెందిన భూమి వివాదాలు వస్తున్నాయి. కేశవరంలో 47 ఎకరాల భూమిపై కేసు ఉంది. సుచిత్ర పరిధిలో ఉన్న భూమి వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ గొడవ చేయడంతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు మల్లారెడ్డిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు టీడీపీలో ఉన్నారు. మల్లారెడ్డి టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రాగా.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ మారిన తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవు. అందుకోసమే ఇలా వరసగా టార్గెట్ అవుతున్నారని చెబుతున్నారు.
Read more Telagana News and Telugu News