Accident: బాలికను చిదిమేసిన లారీ!
ABN, Publish Date - Aug 18 , 2024 | 03:31 AM
కంటెయినర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పదో తరగతి చదువుతున్న విద్యార్థిని నిండు ప్రాణాలను బలిగొంది. బాలికను బడి వద్ద దిగబెట్టేందుకు వెళుతూ రెడ్ సిగ్నల్ పడటంతో ఆగిన ఆటోను.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్ లారీ ఢీకొట్టింది.
సిగ్నల్ వద్ద ఆగిన ఆటోను ఢీకొట్టిన లారీ
తీవ్రగాయాలతో విద్యార్థిని దుర్మరణం
చావుబతుకుల్లో ఆటో డ్రైవర్
హబ్సిగూడ వద్ద ఘోర ప్రమాదం
తార్నాక, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కంటెయినర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పదో తరగతి చదువుతున్న విద్యార్థిని నిండు ప్రాణాలను బలిగొంది. బాలికను బడి వద్ద దిగబెట్టేందుకు వెళుతూ రెడ్ సిగ్నల్ పడటంతో ఆగిన ఆటోను.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్ లారీ ఢీకొట్టింది. ఆ వేగానికి ఆటో.. ముందు ఆగివున్న బస్సు కిందికి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్న రంగ సాత్విక (16) అనే బాలిక తీవ్రగాయాలతో మృతిచెందింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్య (50) పరిస్థితి విషమంగా ఉంది. కుమార్తె మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు కంటికీమంటికి ధారగా రోదిస్తున్నారు.
విద్యార్థులను ప్రైవేటు వాహనాల్లో బడికి పంపుతున్న తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనల్లోకి నెట్టిన ఈ ఘటన హబ్సిగూడ చౌరస్తాలో జరిగింది. ఓయూ ఏసీపీ జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చంగిచర్లకు చెందిన రంగ గోవింద్ గౌడ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగి., భార్య లత, కూతురు సాత్విక, ఇద్దరు కుమారులతో కలిసి తార్నాకలోని కీన్తీ కాలనీలో ఉంటున్నారు. సాత్విక హబ్సిగూడలోని ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతోంది. రోజూ ఆమెను తార్నాక నుంచి హబ్సిగూడలోని బడి వద్ద దిగబెట్టేందుకు తల్లిదండ్రులు, ఎల్లయ్య (50) అనే ఆటోవాలాను మాట్లాడుకున్నారు.
రోజు మాదిరిగానే శనివారం ఉదయం 7:30కు ఇంటి నుంచి సాత్విక ఆటో ఎక్కి బడికి బయలుదేరింది. కొద్ది నిమిషాల్లో ఆటో బడి వద్దకు చేరుకునేదే! అయితే హబ్సిగూడ చౌరస్తా వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆటోను ఎల్లయ్య ఆపాడు. గ్రీన్ సిగ్నల్ పడటం కోసం ఎదురుచూస్తుండగా ఆటోను వెనుక నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కంటెయిన్ లారీ ఢీకొట్టింది. ఈ తీవ్రతకు ఆటో.. ముందు ఆగివున్న బస్సు కిందికి చొచ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ ఎల్లయ్య, లోపల కూర్చున్న సాత్విక తీవ్రంగా గాయపడ్డారు.
ఓయూ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీశారు. సాత్విక, ఎల్లయ్యను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స మొదలు పెట్టిన కొద్దిసేపటికే సాత్విక మృతిచెందింది. ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి కారణమైన కంటెయినర్ లారీ డ్రైవర్‌ను సూరజ్ సింగ్ (32)గా గుర్తించినట్లు తెలిసింది. అతడిని అరెస్టు చేశారు. లారీని స్టేషన్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
Updated Date - Aug 18 , 2024 | 03:31 AM