BRS: కేటీఆర్ బావమరిది పార్టీలో డ్రగ్స్!
ABN, Publish Date - Oct 28 , 2024 | 03:33 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలడం కలకలం సృష్టించింది! రాజ్ పాకాల సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన విజయ్ మద్దూరి కొకైన్
రాజ్ పాకాల సన్నిహితుడు విజయ్‌కి కొకైన్ పాజిటివ్
రాజ్ ఇస్తేనే తీసుకున్నా: విజయ్
జన్వాడ ఫాంహౌస్‌లో అనుమతి లేకుండానే పార్టీ
స్థానికుల ఫిర్యాదుతో ఎస్‌వోటీ పోలీసుల దాడి
పార్టీలో 22 మంది పురుషులు.. 16 మంది మహిళలు
భారీగా విదేశీ మద్యం స్వాధీనం
పోలీసుల అదుపులో విజయ్.. పరారీలో రాజ్ పాకాల
కొకైన్ ఎలా వచ్చిందో ఆరా
శంకర్‌పల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలడం కలకలం సృష్టించింది! రాజ్ పాకాల సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నారు! తొలుత బుకాయించిన విజయ్.. మూత్ర పరీక్షలో కొకైన్ తీసుకున్నట్లు తేలడంతో రాజ్ (రాజేంద్ర ప్రసాద్) పాకాల ఇస్తేనే తాను డ్రగ్ తీసుకున్నట్లు చెప్పడం గమనార్హం! విజయ్ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. పార్టీలో కొకైన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన జన్వాడ ‘ఫాంహౌస్ పార్టీ’కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమ ప్రాంతంలో పెద్దపెద్ద శ బ్దాలతో కొందరు పార్టీ చేసుకుంటూ ఇబ్బంది కలిగిస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడకు చెందిన వ్యక్తులు కొందరు శనివారం రాత్రి 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
దీంతో మోకిల, శంకర్‌పల్లి, నార్సింగి, ఎస్‌వోటీ పోలీసులు నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో జన్వాడలోని రాజ్ పాకాల ఫాంహౌ్‌సపై దాడులు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో విదేశీ మద్యంతో పాటు క్యాసినో ఆట వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. పార్టీలో అనుమతి లేకుండా వినియోగిస్తున్న విదేశీ మద్యం 7.6 లీటర్లు, ఐఎంఎ్‌ఫఎల్ మద్యం 8.1 లీటర్లు, బీర్లు 6 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో 22 మంది పురుషులు, 16 మంది మహిళలు పాల్గొన్నారు. వీరందరికీ అక్కడే డ్రగ్ టెస్టులు చేసేందుకు ప్రయత్నించగా మహిళలు నిరాకరించారు. అయితే పురుషులందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించగా విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చింది. విజయ్ తొలుత మూత్ర పరీక్షకు సహకరించలేదు. పోలీసులను ముప్పతిప్పలు పెట్టారు.
తర్వాత పోలీసులు మూత్రంతో పాటు రక్తపరీక్షలు కూడా నిర్వహించారు. చివరకు పాజిటివ్ రావడంతో తాను ఇటీవలే విదేశాల నుంచి వచ్చానని, అక్కడ కొకైన్ తీసుకుని ఇండియాకు వచ్చానని విజయ్ పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. మూత్ర పరీక్షలో పాజిటివ్ రావడంతో అతని గుట్టురట్టయింది. డ్రగ్స్ తీసుకుంటే 24 గంటల్లోపు అయితేనే మూత్ర పరీక్షలో తేలుతుంది. అంతకు మించితే రక్తపరీక్షలు చేస్తారు. గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు 3 నుంచి 6 నెలల దాకా ఉంటాయని నిపుణులు తెలిపారు.మూత్ర పరీక్షలోనే పాజిటివ్‌గా రావడంతో విజయ్‌ను అదుపులోకి తీసుకున్న మోకిల పోలీసులు... ఎన్‌డీపీఎ్‌స సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మిగిలిన వారి వివరాలు తీసుకొని వదిలేశారు.
రాజ్ పాకాల ఇస్తేనే కొకైన్ తీసుకున్నా..
రాజ్ పాకాల కోరిక మేరకే తాను కొకైన్ తీసుకున్నట్లు విజయ్ చెప్పినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన ఫాంహౌ్‌సలో దీపావళి పార్టీకి రమ్మని రాజ్ పాకాల తనను ఆహ్వానించాడని విజయ్ తెలిపారు. ఆయనే కొకైన్ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే తరచూ తాము వీకెండ్ పార్టీల్లో డ్రగ్స్ తీసుకుంటామని కూడా వెల్లడించారు. అలాగే పోకర్ కాయిన్స్‌తో ఆడుకుంటామని తెలిపారు. దీంతో విజయ్ ఇచ్చిన వాంగ్మూలం కేసులో కీలకంగా మారనుంది. వీరికి కొకైన్ ఎలా వచ్చింది? ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆ పార్టీలో ఇంకా ఎవరైనా పాల్గొని, దాడులకు ముందే అక్కడి నుంచి పరారయ్యారా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.
క్యాసినో ఆట వస్తువుల స్వాధీనం..
ఫాంహౌ్‌సలో నిర్వహించిన పార్టీలో క్యాసినో ఆట ఆడేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. క్యాసినో ఆటకు ముంబై, గోవా నగరాలతో పాటుగా నేపాల్, థాయిలాండ్ దేశాలు ప్రముఖమైనవి. తెలంగాణలో ఇలాంటి ఆటలపై నిషేధం ఉంది. ఫాంహౌస్ పార్టీలో క్యాసినో ఆట వస్తువులను స్వాధీనం చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. ప్లేయింగ్ కార్డులు, క్యాసినో ఆట వస్తువులు ఉండడంతో ఫాంహౌస్ యజమాని రాజ్ పాకాలతో పాటు విజయ్ మద్దూరిపై గే మింగ్ యాక్టు కింద కేసు నమోదైంది.
రాజ్ పాకాల ఎక్కడ?
కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆదివారం ఆయన్ని మోకిల పోలీస్ స్టేషన్‌కు రావాలని ఫోన్‌లో విచారణకు పిలిచారు. అలాగే ఎక్సైజ్ పోలీసులు కూడా విచారణకు రావాలని ఆదేశించారు. కానీ, ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొని.. విచారణకు రాలేదు. దీంతో పోలీసులు వారెంట్ జారీ చేయాలని నిర్ణయించారు.
ఎవరీ విజయ్?
విజయ్ మద్దూరి.. రాజ్ పాకాలకు అత్యంత సన్నిహితుడు. ఫ్యూజన్ ఏఐఎక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ చైర్మన్‌గా ఉన్నారు. రాజ్ పాకాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ (ఈటీజీ గ్లోబల్ సర్వీసు)కి సీఈవోగా ఉన్నారు. పలు కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా బిజెనెస్, మార్కెటింగ్‌లు చేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన ఇక్కడ కొన్ని కంపెనీలకు సలహాదారుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ పుట్‌బాల్ ఐఎ్‌సఎల్ టీమ్‌కు సహ యజమానిగా కొనసాగుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. రాజ్ పాకాల నిర్వహించే వీకెండ్ పార్టీల్లో తరుచూ విజయ్ పాల్గొంటాడని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాజ్ పాకాల గడిచిన 12 ఏళ్లలో మొత్తం 20 కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందులో మూడు మినహా మిగతావన్నీ 2014 తర్వాత ఏర్పాటైనవే కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన 8 కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఈ కంపెనీల నిర్వాహణ, వ్యాపార కార్యకలాపాల్లో విజయ్ కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - Oct 28 , 2024 | 03:33 AM