Health Department: కళ్లు మూసుకొని కౌన్సెలింగ్!
ABN, Publish Date - Jul 21 , 2024 | 03:42 AM
వైద్య ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ జాబితాలో లోపాలపై స్టాఫ్‌నర్స్‌లు ఆందోళనకు దిగడంతో వారి కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం కూడా నిర్వహించలేదు. తాజాగా డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), ఫార్మసీ, ల్యాబ్, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ (మేల్, ఫీమెల్)వంటి విభాగాల్లోనూ బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
బదిలీలపై వైద్య ఉద్యోగుల ఆగ్రహం
సీనియారిటీ జాబితాపై స్టాఫ్ నర్సుల ఆందోళన..
కౌన్సెలింగ్‌లో అక్రమాలు జరిగాయంటున్న ఉద్యోగులు
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ జాబితాలో లోపాలపై స్టాఫ్‌నర్స్‌లు ఆందోళనకు దిగడంతో వారి కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం కూడా నిర్వహించలేదు. తాజాగా డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), ఫార్మసీ, ల్యాబ్, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ (మేల్, ఫీమెల్)వంటి విభాగాల్లోనూ బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ జాబితాలో పేర్లు లేకపోవడం, సర్వీస్ వివరాల్లో తప్పులు దొర్లడం, స్పౌజ్‌లలో తప్పిదాలు, ఆ అర్హత లేనివారికి బదిలీల్లో ప్రాధాన్యం కల్పించారని ఉద్యోగులు ఆరోపించారు. గుడ్డిగా, కళ్లు మూసుకొని కౌన్సెలింగ్ చేపట్టారని వైద్య ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య శాఖలోని కొన్ని యూనియన్లు, అధికారులు కుమ్మక్కవడంతోనే ఈ దుస్థితి వచ్చిందంటున్నారు.
ఓ అనుబంధ సంఘం సహకారంతో ఆరోగ్యశాఖలోని ఓ హెచ్ వోడీకి భారీ స్థాయిలో ముడుపులందాయని, అందుకే సీనియారిటీ జాబితా తారుమారైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బాధిత ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) క్యాడర్‌కు శుక్రవారం సాధారణ బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది అధికారులుండగా.. రాజధాని పరిధిలో 11 మంది, వరంగల్, కరీంనగర్‌లో ఒక్కొక్కరి చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. జీవో నంబరు 80 ప్రకారం 40శాతం చొప్పున ఐదుగురు లాంగ్ స్టాండింగ్ అధికారులను సెలెక్ట్ చేయగా.. వీరిలో ఒకరు హైదరాబాద్ పరిధిలో 12 ఏళ్లు, ముగ్గురు ఏడేళ్లు, ఒకరు ఐదేళ్ల చొప్పున పనిచేస్తున్నారు. ఇందులో ఇద్దరికే స్పౌజ్ కేసు వర్తించగా... మిగిలిన నలుగురికి ఆ అర్హత లేదు. అయితే వారికీ స్పౌజ్ వర్తింపజేశారు.
ఇక సర్కారు జీవోకు పూర్తి విరుద్ధంగా బదిలీలు జరిగాయి. ఉదాహరణకు కోఠిలోని జాతీయ ఆరోగ్య మిషన్‌లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుస్మితను అదే క్యాంప్‌సలోని ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పనిచేసే నరేందర్‌కు డీహెచ్‌లోనే మరో డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా కోఠి హెడ్ ఆఫీ్‌సలోనే పోస్టింగ్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరికొన్ని విభాగాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే బదిలీల గడువును ప్రభుత్వం మరో పది రోజులు పొడిగించడంతో కౌన్సెలింగ్ ఆపేసి మిగిలిన విభాగాలకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్ చేపడతామని అధికారులు శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చెప్పారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jul 21 , 2024 | 03:42 AM