High Court: 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి
ABN, Publish Date - Sep 10 , 2024 | 02:49 AM
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు సంబంధించి నాలుగు వారాల్లో షెడ్యూలు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి
వాదనలు, ఆధారాలు, విచారణ వంటివి షెడ్యూల్లో ఉండాలి
దానిని ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్‌కు పంపండి
లేకపోతే, సుమోటోగా మళ్లీ కేసుల విచారణ మొదలుపెడతాం
ఐదేళ్లూ కోర్టులు చేతులు కట్టేసుకుని ఉండాలనడం సరికాదు
స్పీకర్ సాచివేత రాజ్యాంగ, నైతిక సూత్రాలకు విరుద్ధం
న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదంటే ఎంత కాలం ఆగాలి!?
ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరఫున
ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు!?
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు
అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు
రాజ్యాంగబద్ధ స్పీకర్ గౌరవం తగ్గించకుండానేనని వ్యాఖ్య
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు సంబంధించి నాలుగు వారాల్లో షెడ్యూలు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనలు, ఆధారాల సమర్పణ, వ్యక్తిగత విచారణ తదితరాలకు సంబంధించిన వివరాలు సదరు షెడ్యూల్లో ఉండాలని నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది.
షెడ్యూలును ఖరారు చేసి సదరు వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు తెలియజేయాలని, వీటికి సంబంధించి నాలుగు వారాల్లో ఎటువంటి చర్యలూ తీసుకోకపోతే సుమోటోగా ఈ కేసుల విచారణ తిరిగి మొదలు పెడతామని, తగిన ఆదేశాలూ జారీ చేస్తామని స్పష్టం చేసింది. స్పీకర్ (రెండో ప్రతివాది) పదవికి ఉన్న గౌరవం, రాజ్యాంగబద్ధమైన హోదాను తగ్గించకుండా మూడో ప్రతివాది అయిన తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం సముచితమని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. శాసనసభ పదవీ కాలం పూర్తయ్యే వరకూ అంటే ఐదేళ్లపాటు స్పీకర్ వేచి ఉండవచ్చని, అప్పటి వరకూ న్యాయస్థానం తన చేతులను కట్టేసుకుని ఉండాలని చెప్పడం సరికాదని, అటువంటి వైఖరి ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగానికి వ్యతిరేకమని తేల్చి చెప్పింది.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండాలని, ఆ పదవిలో ఉన్నవాళ్లు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని అంటే.. ఎంత కాలం ఆగాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వ్యాఖ్యానించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరు తేదీల్లో హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టి ఆగస్టు 10న తీర్పు రిజర్వు చేసి సోమవారం తుది తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం, సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, జె.రామచంద్రరావు తదితరులు తమ వాదనలు వినిపించారు.
స్పీకర్ తన ఎదుట ఉన్న అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని, ఈ మేరకు ‘రాజేంద్రసింగ్ రాణా, కైశం మేఘా చంద్ర సింగ్, జయంత్ పాటిల్, సుభాశ్ దేశాయి’ వంటి కేసుల్లో ఇటీవల సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చిందని ప్రస్తావించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పార్టీ మారిన ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు పి.శ్రీరఘురాం, మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క అనర్హత పిటిషన్‌ను కూడా విచారించలేదు. స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోవడానికి ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది’’ అంటూ ‘కిహోటో హోలోహన్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సంపత్‌కుమార్’ కేసులను వారు ప్రస్తావించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం.. అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయవాదులు చాలా తీర్పులను ప్రస్తావిస్తున్నారని, కానీ, ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడమనేది ఎక్కడా చూసి ఉండరని వ్యాఖ్యానించింది.
నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వజాలదన్న వారి వాదనను అంగీకరిస్తే.. స్పీకర్ నిర్ణయ రాహిత్యాన్ని ఎంత కాలం చూస్తూ ఉండాలని నిలదీసింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చంటూ ‘కైశం మేఘా చంద్రసింగ్’ కేసులో సుప్రీం కోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. ‘‘నిర్ణీత సమయంలో అనర్హత పిటిషన్లను పరిష్కరించండి అని స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం ఈ కోర్టుకు ఉంది. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ కోర్టు కట్టుబడి ఉండాల్సిందే. ఇటీవలి ‘కైశం మేఘా చంద్రసింగ్’ కేసులో తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కోర్టు ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు’ కేసులో స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిందంటూ ప్రభుత్వం, ఇతర ప్రతివాదులు చేస్తున్న వాదన నిలబడదు.
ప్రస్తుతం మా ఎదుట ఉన్న మూడు పిటిషన్లలో రెండు ఏప్రిల్‌లో దాఖలు కాగా ఒకటి జూలైలో దాఖలైంది. వాటిపై ఆగస్టు 10 వరకు సుదీర్ఘంగా వాదనలు విన్నాం. అయితే, స్పీకర్ ఎదుట పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్ల స్థితి ఏమిటి? అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు (బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు) ప్రత్యేక పరిస్థితులను కోర్టు దృష్టికి తేవడంలో సఫలమయ్యారు. దరిమిలా.. ఉపశమనం పొందడానికి వారు అర్హులు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్ కార్యాలయానికి ఉన్న రాజ్యాంగబద్ధమైన హోదా, గౌరవం తగ్గకుండా అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం మర్యాదగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. తద్వారా, బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ముగించింది.
తీర్పును స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ తెలిపారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా సాగుతోందని విమర్శించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హోల్‌సేల్, రిటైల్ ఫిరాయింపులకు తెలంగాణ ప్రయోగశాలగా మారిందన్నారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం కంటే దిగజారుడుతనం ఏముంటుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు, హామీల విషయంలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హైడ్రా పేరుతో రోజుకో చర్చ పెడుతున్నారని ఆరోపించారు. హైడ్రా అధికారాలు, విధులకు సంబంధించి చట్టబద్ధత కల్పించకుండా.. కేవలం జీవో-99కు అనుగుణంగా మాత్రమే ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా, గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట భస్మాసుర హస్తంలా మారిందని ఆరోపించారు. గడచిన తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో 1900 మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాయని తెలిపారు.
Updated Date - Sep 10 , 2024 | 02:49 AM