Hyderabad: రూ. 2 లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేయాలి: సీపీఎం
ABN, Publish Date - Jun 11 , 2024 | 04:33 AM
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఈ వానాకాలం నుంచే రైతు భరోసా అమలు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సోమవారం ఎంబీ భవన్‌లో నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఈ వానాకాలం నుంచే రైతు భరోసా అమలు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సోమవారం ఎంబీ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ.విజయరాఘవన్‌లు పాల్గొని కొన్ని తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా కౌలు రైతులున్నారని, రైతుల ఆత్మహత్యల్లో సగం మంది కౌలుదారులే ఉన్నారని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా సౌకర్యం లేదని, ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించేలా పంటల బీమా అమలు చేయాలని కోరారు.
రుణమాఫీని వెంటనే అమలు చేయకపోతే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఉద్యోగుల సప్లమెంటరీ బిల్లులు, షెడ్యూల్డ్ ఎంపాయీస్ పరిశ్రమల్లో పని చేసే కార్మికుల వేతనాల సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలనుపరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jun 11 , 2024 | 04:33 AM