ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lift Irrigation: పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ వెనక్కి

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:10 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తూ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు బీఆర్‌ అంబేడ్కర్‌ వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అదనపు టీఎంసీ ప్రాజెక్టు డీపీఆర్‌లనూ వెనక్కి పంపించింది.

  • నీటి కేటాయింపులపైనే ప్రధాన అభ్యంతరం

  • కేంద్ర జలవనరుల సంఘం సంచలన నిర్ణయం

  • బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ‘కృష్ణా’లో వాటాను తేల్చేదాకా

  • ఆ 45 టీఎంసీలపై ఎవరికీ హక్కు లేదని వెల్లడి

  • కాళేశ్వరం అదనపు టీఎంసీ, వార్ధా డీపీఆర్‌లూ వెనక్కి

  • ఈ నిర్ణయంతో తుమ్మిడిహెట్టికి మార్గం సుగమం!

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తూ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు బీఆర్‌ అంబేడ్కర్‌ వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అదనపు టీఎంసీ ప్రాజెక్టు డీపీఆర్‌లనూ వెనక్కి పంపించింది. 90టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2022 సెప్టెంబరు 3న సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించగా, అందులోని ఏ డైరెక్టరేట్‌ కూడా దీన్ని పరిశీలించలేదు. ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి కేటాయింపులపైనే ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కృష్ణా బేసిన్‌ పరిధిలో చిన్న నీటిపారుదల రంగం కింద 2012-13 నుంచి 2021-23 దాకా తాము పొదుపు చేసిన 45.66 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభించాక.. కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల్లో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు వినియోగించుకుంటామని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది.


అయితే, పోలవరం వాటా కింద దక్కిన నీటిపై తెలంగాణకు పూర్తి అధికారం లేదని, తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదా ట్రైబ్యునల్‌ తీర్పు తర్వాతే ఆ నీటిపై అధికారం ఉంటుందని ఏడాదిన్నర కిందటే సీడబ్ల్యూసీ డైరెక్టరేట్‌ తెలంగాణకు లేఖ రాసింది. చిన్ననీటిపారుదల రంగానికి ఉన్న కేటాయింపులను పొదుపు చేస్తున్నారనడానికి ప్రాతిపదిక ఏంటని ప్రశ్నిస్తూ.. నిర్దేశిత ప్రొఫార్మాలో వివరాలు అందించాలని కోరింది. అయితే, నీటి పొదుపుపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంతోపాటు జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌(కృష్ణా ట్రైబ్యునల్‌-2) కృష్ణా జాలాల వాటాను తేల్చేదాకా పోలవరం వాటాలో దక్కిన 45 టీఎంసీలపై ఎవరికీ హక్కు లేదని పేర్కొంటూ సదరు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపింది. పాలమూరు-రంగారెడ్డికి 2019లో తొలి, రెండో దశ అటవీ అనుమతులు రాగా, 2021 సెప్టెంబరు 3న పర్యావరణ అనుమతులు, 2023 మార్చి 17న కేంద్ర విద్యుత్‌ సంస్థ(సీఈఏ), ఇతర అనుమతులు లభించాయి. 2023 ఏప్రిల్‌లోనే డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తామని సీడబ్ల్యూసీ సమాచారం ఇచ్చింది. తాజాగా ఆయా కారణాలను చూపుతూ డీపీఆర్‌ను వెనక్కి పంపించింది. అయితే, కృష్ణా జలాల వాటాకు సంబంధించి బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఆరు నెలల్లో వెలువడే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. నీటి కేటాయింపుల అనంతరం పాలమూరు ఎత్తిపోతల డీపీఆర్‌ను తిరిగి సమర్పించే అవకాశాలు ఉన్నాయి.


కాళేశ్వరం అదనపు టీఎంసీ ఔట్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రోజుకు 2 టీఎంసీలు తరలించే హెడ్‌వర్క్‌లు పూర్తయిన వెంటనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా మరో టీఎంసీని తరలించే పథకాన్ని చేపట్టిన విషయం విదితమే. అయితే, గోదావరి, కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలంటూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్‌లో కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టును అనుమతి లేని జాబితాలో ఉంచిది. దీనిపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయితే, రెండు కాంపొనెంట్లు వేర్వేరు కావనే విషయాన్ని తెలుపుతూ కాళేశ్వరం సవరణ డీపీఆర్‌ను సమర్పిస్తే.. అన్ని పరిశీలనలు పూర్తయ్యాకే గెజిట్‌ నుంచి తొలగిస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. దాంతో కాళేశ్వరం సవరణ డీపీఆర్‌ను మూడేళ్ల కిందటే సీడబ్ల్యూసీతో పాటు గోదావరి బోర్డుకు సమర్పించారు. అదనపు టీఎంసీపై కోర్టులో కేసులు ఉన్నందున ఆ డీపీఆర్‌ను పరిశీలించబోమని ఓ దశలో గోదావరి బోర్డు తేల్చిచెప్పగా ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ కూడా డీపీఆర్‌పై యథాతథ స్థితిని పాటించాలని ఆదేశాలు ఇచ్చింది.


దీనిపై తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆదేశాలతో డీపీఆర్‌ పరిశీలన జరిగింది. డీపీఆర్‌పై సందేహాలు లేవనెత్తుతూ సీడబ్ల్యూసీ రెండు డజన్లకుపైగా లేఖలు రాయగా వాటికి జవాబులు చెప్పలేక గత ప్రభుత్వం తిప్పలు పడింది. అదనపు టీఎంసీ ప్రాజెక్టు వ్యయం రూ.34,810కోట్లు కాగా.. రూ.13,900 కోట్ల దాకా వెచ్చించారు. ఇందులో రూ.12,392 కోట్ల పనులను నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. 2022 జూలైలో వచ్చిన వరదలతో కన్నెపలిలోని పంప్‌హౌస్‌ రక్షణ గోడ కుప్పకూలి మోటార్లు మునిగిపోగా, ఆ తర్వాత అదనపు టీఎంసీ కోసం తెప్పించిన పరికరాలతో మోటార్లకు మరమ్మతులు చేశారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ కాంపొనెంట్‌ను అనుమతి లేని జాబితా నుంచి తొలగించాలని అప్పటి సీఎం కేసీఆర్‌ నాటి కేంద్ర మంత్రి షెకావత్‌ను కలిసి కోరినా.. ఫలితం లేకపోయింది. తాజాగా డీపీఆర్‌ను వెనక్కి పంపుతూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది.


వార్ధా కూడా...

ప్రాణహిత-చేవెళ్ల స్థానంలో ప్రతిపాదించిన ‘వార్ధా’ ప్రాజెక్టు డీపీఆర్‌ కూడా వెనక్కి వ చ్చేసింది. రూ.4,874.87 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తామంటూ అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2023 మే 11వ తేదీన సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ సమర్పించిది. ఆసిఫాబాద్‌ జిల్లా గుండాయిపేట వద్ద వార్ధా బ్యారేజీ కట్టాలని ప్రతిపాదించింది. ఉమ్మడి ఏపీ పాలనలో ఆదిలాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై రూ.1,919 కోట్లతో బ్యారేజీ నిర్మించి తెలంగాణలోని 16.40లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. అయితే, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాజెక్టుల రీ-డిజైన్‌లో భాగంగా దీన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కనపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించింది. ఇందులో మేడిగడ్డ కుంగిపోగా, అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వ చేయరాదని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ సూచించింది. తాజాగా వార్ధా డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపించడంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలన్న కాంగ్రెస్‌ సర్కారు అడుగులకు మార్గం సుగమమైంది.

Updated Date - Dec 21 , 2024 | 04:10 AM