ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్టెంట్ల పరిశ్రమను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

ABN, Publish Date - Oct 30 , 2024 | 03:11 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజ్‌ పార్కులోని ఎస్‌ఎంటీ గుండె స్టెంట్ల పరిశ్రమను, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌లోని డ్రోన్‌ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు.

  • బీబీనగర్‌ ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలు కూడా..

  • ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు

  • వైద్య పరికరాల ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రగామి చేద్దాం

  • ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

  • వైద్య పరికరాల ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుదాం: దామోదర

పటాన్‌చెరు, బీబీనగర్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజ్‌ పార్కులోని ఎస్‌ఎంటీ గుండె స్టెంట్ల పరిశ్రమను, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌లోని డ్రోన్‌ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం జన్‌ ఆరోగ్య యోజనలో భాగంగా ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం న్యూఢిల్లీలో ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఈ మేరకు వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ డ్రోన్ల సేవలు వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు నిదర్శనంగా పేర్కొన్నారు.

స్టెంట్ల పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ.. ఆయుర్వేదం, హోమియోపతి వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుదామని, దిగుమతులను తగ్గిస్తే వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయని చెప్పారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి శ్రీదర్‌ బాబు మాట్లాడుతూ.. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటైన ఎస్‌ఎంటీ స్టెంట్ల తయారీ కేంద్రంతో రాష్ట్ర వాసులకు గుండెలో అమర్చే స్టంట్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయన్నారు.


ఇక్కడ తయారైన స్టెంట్లు ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని, త్వరలో విదేశాలకూ సరఫరా అవుతాయని మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. కాగా భువనగిరి నుంచి 60కిలోమీటర్ల దూరం వరకు డ్రోన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మారుమూల గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిమ్స్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సంస్థతో కలిసి డ్రోన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని బీబీనగర్‌ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా తెలిపారు. స్థానిక పీహెచ్‌సీలలో నమూనాలను సేకరించి అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రిలోని పరీక్షా కేంద్రానికి తరలించి పరీక్ష చేయించేందుకు డ్రోన్లను వినియోగించనున్నట్లు తెలిపారు.

పైలెట్‌ ప్రాజెక్టు కింద బీబీనగర్‌ మండలం కొండమడుగు, భువనగిరి మండలం బొల్లేపల్లితో పాటు బొమ్మలరామారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా అప్పటికప్పుడు ఇక్కడి పీహెచ్‌సీలో సేకరించిన నమూనాలను డ్రోన్ల ద్వారా అరగంటలో జిల్లా ఆసుపత్రిలోని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించారు. ప్రస్తుతం రెండు డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని, ఒకటి ఎనిమిది కిలోల బరువు, ఐదు కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. 60కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగలవన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి 60కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు డ్రోన్‌ సేవలు కొనసాగిస్తామన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 03:12 AM