ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Admissions: మెడికల్‌ పీజీ ప్రవేశాలు ఆలస్యం

ABN, Publish Date - Dec 23 , 2024 | 04:18 AM

ఈఏడాది వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే అఖిల భారత కోటా రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ నడుస్తోంది. ఈ కోటాతో సమానంగా అన్ని రాష్ట్రాలు తమ కోటా కౌన్సెలింగ్‌ను జరుపుతున్నాయి.

  • హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర సర్కారు

  • స్టే కోసం యత్నం.. జనవరి 7న విచారణ

  • ఫిబ్రవరి 5లోగా ప్రవేశాల పూర్తి తప్పనిసరి

  • ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ పూర్తి

  • జనవరిలో తరగతులు షురూ.. ఆందోళనలో విద్యార్థులు

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఈఏడాది వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే అఖిల భారత కోటా రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ నడుస్తోంది. ఈ కోటాతో సమానంగా అన్ని రాష్ట్రాలు తమ కోటా కౌన్సెలింగ్‌ను జరుపుతున్నాయి. పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికతపై హైకోర్టులో కేసులు పడ్డాయి. తెలంగాణలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు తాజాగా తీర్చు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సర్వోన్నత నాయ్యస్థానాన్ని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నట్లుగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేదు. ఈ అంశంపై జనవరి 7న వాదనలు వింటామని వెల్లడించింది. సుప్రీంకోర్టుకు శనివారం నుంచి క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 2 వరకు సెలవులున్నాయి.


ఫలితంగా జనవరి 7 వరకు ఆగాల్సివచ్చింది. కాగా పీజీ ప్రవేశాలకు సంబంధించి అన్ని రకాల ప్రవేశాలను ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయాలన్న నిబంధన ఉంది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఆలోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలి. జనవరి 7న సుప్రీంకోర్టు తీర్పు వస్తే... అప్పటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించినా ఫిబ్రవరి ఐదులోగా పూర్తి చేయడం సాధ్యంకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవేశాలకు సంబంధించి మొత్తం నాలుగు రౌండ్స్‌ ఉంటాయి. కన్వీనర్‌కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ (సీ కేటగిరి) కోటాతో పాటు స్ట్రే వెకెన్సీ ఉంటుంది. ఒక్కో విడతకు కనీసం వారంరోజుల సమయమివ్వాలి. ఎందుకంటే విద్యార్థికి సీటు కేటాయించిన తర్వాత వారు జాయిన్‌ అయ్యేవరకు ఆగాలి. అనంతరం మరోవిడత కౌన్సిలింగ్‌ను చేపట్టాలి. ఇలా తక్కువ సమయంలోనే అన్ని రకాల కౌన్సిలింగ్‌ను ఎలా చేపడతారని మెడికోలు ప్రశ్నిస్తున్నారు.


ఇలా చేస్తేనే సాధ్యం..

హైకోర్టు తీర్పు ప్రకారం కౌన్సెలింగ్‌ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని వైద్య విద్య నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యార్థులకు కేటాయించిన సీట్లు సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు ఆధారంగా ఉంటాయని ముందే స్పష్టం చేయాలి. ఒకవేళ సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తే... ఇతర రాష్ట్రాలకు చెంది ఇక్కడ ఎంబీబీఎస్‌ చేసిన వారికి పీజీలో సీటు వస్తే అవి రద్దవుతాయి. ప్రస్తుతం తక్కువ సమయం ఉండటం వల్ల కోర్పు తీర్పు వచ్చేవరకు ఆగకుండా ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాలని మెడికోలు కోరుతున్నారు. మరోవైపు రెండు విడుతల ప్రవేశాల అనంతరం పీజీ వైద్యవిద్య తరగతులు ప్రారంభించాలని జాతీయ వైద్య కమిషన్‌ మార్గదర్శకాలు చెబుతున్నాయి.


ఆ ప్రకారం చూస్తే జనవరి మొదటి వారం నుంచి పీజీ తరగతులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మొదలవుతాయి. కానీ ఆసమయానికి మనదగ్గర కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా మొదలుకాబోదని మెడికోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మన రాష్ట్ర విద్యార్థులు అఖిల భారత కోటా దరఖాస్తులో భాగంగా ఫీజు కింద రూ.25 వేల వరకు చెల్లిస్తారని, అవి కోల్పోయే ప్రమాదం ఉందని మెడికోలు చెబుతున్నారు. మనరాష్ట్రంలో 1300 వరకు పీజీ సీట్లున్నాయి. వాటిలో 50 శాతం ఆలిండియా కోటాకు వెళ్తాయి. ఆ కోటాలోని 650 సీట్లకు ఇప్పటికే మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) కౌన్సిలింగ్‌ ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. కాగా, మెడికల్‌ పీజీ ప్రవేశాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని లోకల్‌ పీజీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ జాప్యం వల్ల మెడికోలకు అన్యాయం జరుగుతోందని పేర్కొంది.

Updated Date - Dec 23 , 2024 | 04:18 AM