ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: మరో ఐదేళ్లుంటే.. హైటెక్‌ సిటీనీ అమ్మేసేవారు

ABN, Publish Date - Jul 28 , 2024 | 03:34 AM

గత పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకుందని, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును, ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆరోపించారు. మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే హైటెక్‌ సిటీని కూడా అమ్మేసేదని అన్నారు.

  • ఎన్నికల్లో ఓడతారని తెలిసే.. ఓఆర్‌ఆర్‌ ప్రైవేటుకు

  • అసెంబ్లీ సమావేశాల తరువాత ఇందిరమ్మ ఇళ్ల జాబితా

  • త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ

  • వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకుందని, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును, ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆరోపించారు. మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే హైటెక్‌ సిటీని కూడా అమ్మేసేదని అన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు తర్వాత కూడా ఆ పార్టీకి బుద్ది రాలేదన్నారు. శనివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ఆవిర్భావం తరువాత మాత్రమే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గత ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు, ఓఆర్‌ఆర్‌, హైటెక్‌ సిటీతో పాటు అనేక కీలక ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించినవే. మా పాలనలో రాష్ట్రంలో భారీగా ఆస్తులు కూడబెడితే.. గత ప్రభుత్వం అమ్ముకుంది. ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని ఊహించే.. ఖజానాకు కీలకమైన ఓఆర్‌ఆర్‌ను ప్రైవేటు సంస్థలకు 30 ఏళ్ల లీజుకు కట్టబెట్టింది’’ అని భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. దీనిపై విచారణ జరిపిస్తామని, అవసరమైతే లీజు రద్దు చేసేందుకూ వెనుకాడబోమని అన్నారు. 2014కి ముందు హైదరాబాద్‌ పరిసరాల్లో ఉన్న చెరువులన్నీ గత పదేళ్లలో కబ్జాకు గురయ్యాయన్నారు. ఆక్రమణలపై వివరాలు సేకరిస్తున్నామని, అన్నిటిపైనా విచారణ జరిపిస్తామని, బాధ్యులను వదలబోమని స్పష్టం చేశారు.


  • పదేళ్లలో వాగ్దానాల అమలు ఎక్కడ.?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ భ్రమలు లేవని భట్టివిక్రమార్క అన్నారు. ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చేందుకు వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని, తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయకుండా గాలికి వదిలేసిందన్నారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి, దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ విద్యాసంస్థలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి ఉంటే ఆ వర్గాల ప్రజల జీవితాలు ఎప్పుడో మారిపోయేవన్నారు. ఇందిరా క్రాంతి పథకాన్ని పట్టించుకోలేదని, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని అన్నారు. తమ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇప్పించాలని ముందుకెళుతోందని చెప్పారు. నాలుగు నెలల్లోనే 32,410 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, మరో 35 వేల ఉద్యోగాలకు పోటీ పరీక్షలు నిర్వహించడానికి ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాటప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని, భూమిలేని నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చేందుకు బడ్జెట్లో ప్రతిపాదించామని పేర్కొన్నారు.


  • మరో 20 ఏళ్లు అధికారం మాదే..

తాము ఐదేళ్లు ఆషామాషీగా అధికారంలో ఉండడానికి రాలేదని, ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ మరో 20 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని డిప్యూటీ సీఎం అన్నారు. ఐటీఐలను టాటా సంస్థతో ఒప్పందం చేసుకొని అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్స్‌గా మారుస్తున్నామని, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవబోతోందని చెప్పారు. ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ విద్యా వ్యవస్థను తయారు చేస్తున్నామన్నారు. ఒకటి నుంచి మూడు తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాలలో, నాలుగు నుంచి ఆ పైస్థాయి తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం బోధనలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలా కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సచివాలయంలోనే ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు పనిచేస్తున్నారని, ప్రతీ శాఖపై సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను తయారుచేసి ఇన్‌చార్జి మంత్రులకు అప్పగిస్తారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, ఇకపై అలా జరగకూడదనే రైతు భరోసా అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లామని చెప్పారు.


  • గత బడ్జెట్లన్నీ అంకెల గారడీలే..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నీ వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నవేనని భట్టివిక్రమార్క అన్నారు. తాము బీఆర్‌ఎస్‌ పెట్టిన బడ్జెట్‌ కన్నా రూ.600 కోట్లు మాత్రమే అదనంగా పేర్కొన్నామని తెలిపారు. గతంలో కేంద్ర ప్రాయోజిన పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి సరైన నిధులు రాష్ర్టానికి రాలేదని చెప్పారు. తాము రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా నిధులు ఇస్తామని, కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు సాధిస్తామని స్పష్టం చేశారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి రూ.600 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెడితే తాము చెల్లించామన్నారు. ఆసరా పింఛన్ల నిధులను ప్రతినెలా విడుదల చేస్తున్నామని తెలిపారు. టాక్స్‌ రెవెన్యూ విషయంలో 35 వేల కోట్లు రాబడులు ఎట్లా తెస్తారన్న ఆందోళన అవసరం లేదని, రాబడులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసునని వ్యాఖ్యానించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం పౌరసరఫరాల శాఖలో రూ.500 కోట్ల బకాయీలను వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు ఎఫ్‌సీఐలో పెండింగ్‌లో ఉన్న రూ.3561 కోట్లను రాబట్టుకున్నామని చెప్పారు. 25 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, దరఖాస్తుదారుల నుంచి అప్లికేషన్‌ ఫీజు తీసుకుని వాడుకుని.. ఏ నిర్ణయమూ తీసుకోకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు.


  • త్వరలో రేషన్‌కార్డుల పంపిణీ..

మార్గదర్శకాలు తయారు కాగానే త్వరలోనే రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టును తప్పకుండా పూర్తిచేస్తామని, మూసీ నదిని అభివృద్ధి చేసి హైదరాబాద్‌ నగరం అంటే ఏంటో ప్రపంచానికి చూపిస్తామని చెప్పారు. మైనారిటీలకు రూ.3 వేల కోట్లు కేటాయించి హిందువులను విస్మరించారంటూ కొందరు నేతలు విధంగా మతవైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం తగదన్నారు. వారిని ఈ ప్రభుత్వం క్షమించదన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.100 కోట్లు, బోనాలకు రూ.25 కోట్ల రూపాయలు ఇచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని స్పష్టం చేశారు. ఈ సమయంలో.. భట్టివిక్రమార్క ప్రసగంగానికి బీఆర్‌ఎస్‌ సభ్యులు అడ్డుపడటంతో సీఎం రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘‘కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై చర్చకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ సభకు ఎందుకు రావడం లేదని తాము ప్రశ్నిస్తే.. ఆయన సభకు రారు. మేమే వస్తామని హరీశ్‌రావు, కేటీఆర్‌ బదులిచ్చారు. దీంతో వాళ్లిద్దరు కలిసి తన పదవికి ఎసరు తెస్తారేమోననని కేసీఆర్‌ ఆందోళన చెందినట్లున్నారు. అందుకే మరుసటి రోజు అందరికంటే ముందే వచ్చి సభలో కూర్చున్నారు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. దీనిపై సభలో దుమారం రేగింది.

Updated Date - Jul 28 , 2024 | 03:34 AM

Advertising
Advertising
<