ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాగు భూముల రిజిస్ట్రేషన్ల అధికారం డీటీల చేతికి!

ABN, Publish Date - Nov 08 , 2024 | 02:59 AM

రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ అధికారం నాయిబ్‌(డిప్యూటీ) తహసీల్దార్లకు దఖలు పడనుందా? ప్రభుత్వంలోని విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి.

  • డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించే యోచనలో రాష్ట్ర సర్కారు

  • అప్పిలేట్‌ అధికారం కలెక్టర్‌కు కొత్త ఆర్వోఆర్‌ చట్టంలో ప్రతిపాదన

  • అమలుపై ఈ నెల 11న సీఎం సమీక్ష

  • అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిల్లు!

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ అధికారం నాయిబ్‌(డిప్యూటీ) తహసీల్దార్లకు దఖలు పడనుందా? ప్రభుత్వంలోని విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం 2020’ ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ అధికారం తహసీల్దార్లకు మాత్రమే ఉంది. దాని స్థానంలో ప్రభుత్వం తీసుకురానున్న ‘ఆర్వోఆర్‌-2024’ చట్టంలో నాయిబ్‌ తహసీల్దార్లకు ఆ అధికారాన్ని ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై అభిప్రాయాలను క్రోడీకరించిన అధికారులు ముసాయిదా ప్రతిని సీఎం రేవంత్‌ రెడ్డికి అందజేశారు. తహసీల్దార్లు మండలమంతా పర్యటించాల్సి ఉండటం, వారికి ఇప్పటికే పలు రకాల బాధ్యతలు ఉండటం, వారిపై పని ఒత్తిడి.. వంటివాటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాయిబ్‌ తహసీల్దార్లు కార్యాలయ వ్యవహారాలకే పరిమితమై ఉంటున్నందున, వారి చేతిలో రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను పెడితే.. రైతులకు అందుబాటులో ఉంటారనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.

వారు తీసుకున్న నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌ చేసుకునే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అప్పిలేట్‌ అధికారాలను కలెక్టర్‌ లేదా జేసీ పరిధిలో పెడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు పాత రెవెన్యూ విధానంలో ఉన్నట్లు జాయింట్‌ కలెక్టర్ల వ్యవస్థను పునరుద్ధరించే యోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఇటీవల సుమారు 40 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు సెలక్షన్‌ గ్రేడ్‌ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పీల్‌ 1 ఆర్డీవో పరిధిలో, అప్పీల్‌ 2 జేసీ లేదా కలెక్టర్‌ పరిధిలో ఉండాలని తహసీల్దార్లు కోరుతున్నప్పటికీ.. కొత్త చట్టంలో అప్పీల్‌ అధికారాన్ని కలెక్టర్‌/ జేసీ పరిధిలో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా, కొత్త చట్టం ప్రకారం.. వీలునామాలు, వారసత్వ పంపకాల విషయంలో తహసీల్దారు పరిధిలో విచారణ తప్పనిసరి.


విచారణ లేకుండా మ్యుటేషన్‌కు అవకాశం లేదు. ప్రస్తుత చట్టం ప్రకారం మ్యుటేషన్‌కు ముందు విచారణకు అవకాశం లేదు. అలాగే.. రైతులు ఎదుర్కొంటున్న పాస్‌ పుస్తకాల సమస్య, సర్వే, సవరణల కోసం చేసుకునే దరఖాస్తులో పొరపాట్లు ఉంటే తిరస్కరించడం వంటి 45 రకాల సమస్యలకు కొత్త చట్టం ద్వారా పరిష్కారాలు చూపనున్నారు. రాష్ట్రంలో 10,894 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామంలో దాదాపు 200 మంది రైతులకు భూసమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడంతోపాటు ఇంటి స్థలాలకు హక్కు పత్రాలు, భూదార్‌ జారీ అనే రెండు కొత్త అంశాలను కొత్త చట్టం ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తొలి దశలో ధరణిలో ఉన్న లోపాలను సవరించి.. అనంతరం శాస్త్రీయ పద్ధతిలో తాత్కాలిక భూఆధార్‌ కార్డులు మంజూరు చేస్తారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా జియోఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి భూదార్‌ కార్డులు ఇస్తే దేశంలో ఆ ఘనత సాధించిన తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుంది. దీనివల్ల గ్రామాల స్థాయిలో హక్కుల రికార్డు తయారు అవుతుంది. 1948లో అమల్లో ఉన్న ఖస్రాపహాణీ మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు గురించి కూడా కొత్తచట్టంలో పొందుపరిచారు. గ్రామస్థాయి రెవెన్యూ ఉద్యోగుల నియామకం, అందుకు సంబంధించిన విధివిఽధానాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

  • కారణాలు చెప్పాలి

మ్యుటేషన్‌ను నిలిపివేసే అధికారాన్ని తహసీల్దార్ల చేతిలో పెడితే ఉద్దేశపూర్వకంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారనే అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో.. మ్యుటేషన్‌ ఆపివేస్తూ నిర్ణయం తీసుకుంటేఅందుకు గల కారణాలను రాత పూర్వకంగా సంబంధిత అధికారులు తెలపాల్సి ఉంటుందని కొత్త చట్టంలో పేర్కొన్నారు. కాగా.. ఈ కొత్త చట్టంపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్వోఆర్‌ చట్టాన్ని ఆమోదించి, అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Nov 08 , 2024 | 03:00 AM