Bhubharati Act 2024: ‘భూభారతి’తో భూ సమస్యలకు పరిష్కారం
ABN, Publish Date - Dec 24 , 2024 | 04:10 AM
భూభారతి చట్టం- 2024తో రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఈ చట్టం రూపకర్తలు సునీల్, లచ్చిరెడ్డి తెలిపారు.
నల్లగొండ జిల్లా రైతులతో ముఖాముఖిలో చట్టం రూపకర్తలు సునీల్, లచ్చిరెడ్డి
చందంపేట, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టం- 2024తో రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఈ చట్టం రూపకర్తలు సునీల్, లచ్చిరెడ్డి తెలిపారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి గ్రామంలో రైతుసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘భూభారతి’ చట్టంపై రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సునీల్ మాట్లాడుతూ ‘ధరణి’ వెబ్‌సైట్‌తో రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల భూములకు సంబంధించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు.
ఈ సందర్భంగా కంబాలపల్లి, పొగిళ్ల పరిసర గ్రామాల రైతులు.. 50 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటున్నా అటవీ అధికారులు భూ హక్కులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్.. భూభారతి చట్టం ద్వారా దేవరకొండ నియోజకవర్గంలోని గిరిజన తండాలు, గ్రామాల్లో నెలకొన్న అటవీ, రెవెన్యూ భూసమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.
Updated Date - Dec 24 , 2024 | 04:10 AM