Dindi Lift Irrigation: డిండి ఎత్తిపోతలకు 1800 కోట్లు!
ABN, Publish Date - Dec 28 , 2024 | 03:37 AM
డిండి ఎత్తిపోతల పథకం పనుల్లో కదలిక వచ్చింది. 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా రూ.4822.41 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటిదాకా రూ..2544.37 కోట్ల విలువైన పనులు జరిగాయి.
ఏదుల నుంచి 30 టీఎంసీల తరలింపుపై ప్రతిపాదనలు
త్వరలో మంత్రివర్గంలో చర్చకు అవకాశం
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): డిండి ఎత్తిపోతల పథకం పనుల్లో కదలిక వచ్చింది. 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా రూ.4822.41 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటిదాకా రూ..2544.37 కోట్ల విలువైన పనులు జరిగాయి. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తరలించనున్నారు. అయితే, ఏదుల నుంచి డిండికి 30 టీఎంసీల నీటిని తరలించేందుకుగాను రూ.1800 కోట్లతో చేపట్టే పనులకు సంబంధించిన సవరణ ప్రతిపాదనల ఫైలు మంత్రివర్గం ఆమోదానికి వచ్చింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశముంది. మంత్రివర్గ ఆమోదం లభిస్తే డిండి ఎత్తిపోతల పథకం పనులు తిరిగి ఊపందుకోనున్నాయి. కాగా, ఏదుల నుంచి డిండికి నీటిని తరలించేందుకు.. ఏదుల నుంచి 16కిమీల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. అలాగే, ఉల్పర గ్రామానికి ఎగువన పోతిరెడ్డిపల్లి వద్ద ఒక చెక్‌డ్యామ్ నిర్మాణం జరగనుంది. ఆ తర్వాత ఉల్పరలో ఒక బ్యారేజీ, అక్కడి నుంచి డిండి ఎగువన కెనాల్ ద్వారా సింగరాజుపల్లి వద్ద ఒక రిజర్వాయర్‌కు, గోకవరం, గొట్టిముక్కల, ఇర్విన్, చింతపల్లి, కిష్టంపల్లి, శివన్నగూడెం వద్ద రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. 30 టీఎంసీలతో చేపట్టనున్న ప్రాజెక్టులో 25.641 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్లు కడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 16,389 ఎకరాల భూమి అవసరం ఉండగా ఇప్పటిదాకా 12,317 ఎకరాలను సేకరించారు.
పాలమూరు ప్యాకేజీ-3 సవరణ అంచనాలు కూడా
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ నుంచి ఏదుల దాకా 8కిమీల మేర ఓపెన్ కెనాల్ పనులు జరగాల్సి ఉంది. ఓ మాజీ మంత్రి వియ్యంకుడు గుత్తేదారుగా ఉండగా.. అంచనాలను సవరిస్తే తప్పా పనులు చేయబోనని పట్టుబట్టారు. పనులు పూర్తి చేసి లింకు కలిపితే కానీ పాలమూరు పథకంలోని ఇతర రిజర్వాయర్లకు నీళ్లు తరలించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పాలుమారు పథకం ప్యాకేజీ-3లో ఏడు కిమీల మేర ఓపెన్ కెనాల్, పలు చోట్ల బ్లాస్టింగ్ కోసం వ్యయాన్ని రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్లకు సవరిస్తూ చేసిన అంచనాలను రాష్ట్ర స్థాయి స్థాయీ సంఘం (ఎస్‌ఎల్‌ఎ్‌ససీ) ఇటీవల ఆమోదించింది. దీన్ని మంత్రివర్గం ఆమోదం కోసం పంపించనున్నారు. మంత్రివర్గం ఆమోదం లభించి పరిపాలనపరమైన అనుమతులు వస్తే ఈ పనులు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. కాగా, పాలమూరు-రంగారెడ్డి పధకం డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఇటీవల వెనక్కి పంపించింది. 90 టీఎంసీలను ప్రాజెక్టుకు కేటాయిస్తూ డీపీఆర్ సమర్పించగా సీడబ్ల్యూసీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వనప్పటికీ తాగునీటి అవసరాల కోసం పనులు చేసుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఉంది.
Updated Date - Dec 28 , 2024 | 03:37 AM