Hyderabad: జీవో 317పై నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ABN, Publish Date - Jul 19 , 2024 | 03:40 AM
జీవో 317కు సంబంధించి ఉద్యోగుల వినతులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది.
జీఏడీకి శాఖల వారీ నివేదికలు
2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలపై విధివిధానాలు ఖరారు చేసే చాన్స్
హైదరాబాద్, జూలై 18(ఆంధ్రజ్యోతి): జీవో 317కు సంబంధించి ఉద్యోగుల వినతులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని ఉపసంఘం.. ఇప్పటికే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై సానుకూల నిర్ణయం తీసుకుంది. మిగిలిన అభ్యంతరాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై శాఖల వారీగా నివేదికలు సిద్ధమయ్యాయి.
ఈనెల 16 నాటికి అన్ని నివేదికలు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు చేరాయి. వీటిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. అలాగే 2008డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలిచ్చే అంశంలో విధివిధానాలపైనా చర్చించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నష్టపోయిన వారి వివరాలను విద్యాశాఖ సేకరించింది. ఆరు వారాల్లో ఉద్యోగాలిస్తామని జూన్ 27న ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలపై విధివిధానాలను ఉపసంఘం ఖరారు చేసే అవకాశముంది.
Updated Date - Jul 19 , 2024 | 03:40 AM