Congress: డీసీసీ కార్యాలయాలకు స్థలాలు!
ABN, Publish Date - Sep 24 , 2024 | 03:35 AM
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయం నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో 2 వేల గజాల విస్తీర్ణం గలిగిన స్థలంలో కార్యాలయాలు నిర్మించాలని టీపీసీసీ నిర్ణయించింది. ప్రధాన పార్టీలకు జిల్లా కార్యాలయాలు కట్టుకునేందుకు స్థలాల కేటాయింపునకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ జీవో మేరకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ బీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపూ జరిగింది. అయితే ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు అంశం ప్రస్తావనకు వచ్చింది.
డీసీసీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని కోరుతూ కలెక్టర్లకు అధికారికంగా దరఖాస్తులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలోనే డీసీసీ కార్యాలయాల నిర్మాణం కోసం 2 వేల చదరపు గజాల స్థలం కేటాయించాలంటూ కలెక్టర్లకు దరఖాస్తులు సిద్ధం చేయాలని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశించారు. జిల్లా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు.. ప్రజలకు అందుబాటులో ఉండే స్థలాలను గుర్తించాలని సూచించారు. స్థలం కోసం కలెక్టర్లకు దరఖాస్తు ఇవ్వడంతో పాటుగా గుర్తించిన స్థలాల వివరాలనూ కలెక్టర్లకు ఇవ్వాలన్నారు. వీలైనంత త్వరగా ఆ స్థలాన్ని కలెక్టర్లు పరిశీలించేందుకు వీలుంటుందని వెల్లడించారు.
Updated Date - Sep 24 , 2024 | 03:35 AM