Share News

Warangal: అయ్యో పాపం.. పసికందు

ABN , Publish Date - Aug 10 , 2024 | 03:01 AM

ఏ తల్లి కన్న బిడ్డోగానీ.. రెండు రోజుల నవజాతి శిశును ఓ కుక్క నోటకరుచుకుని వచ్చిన ఘటన వరంగల్‌ ఎంజీఎం ఆసుత్రిలో కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం.. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ ఔట్‌పోస్టు వద్ద శిశువును నోటకరుచుకుని వస్తున్న శునకాన్ని గుర్తించిన ఔట్‌పోస్టు సిబ్బంది గట్టిగా కేకలు వేసి అదిలించారు.

Warangal: అయ్యో పాపం.. పసికందు

  • 2 రోజుల వయసున్న మృతశిశువును తీసుకొచ్చిన కుక్క..

  • వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో తీవ్ర కలకలం

  • ఆ బిడ్డ తమ ఆసుపత్రికి చెందినది కాదన్న సూపరింటెండెంట్‌

  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • అయ్యో పాపం.. పసికందు

  • 2 రోజుల మృతశిశువును తీసుకొచ్చిన కుక్క

వరంగల్‌ మెడికల్‌, ఆగస్టు 9: ఏ తల్లి కన్న బిడ్డోగానీ.. రెండు రోజుల నవజాతి శిశును ఓ కుక్క నోటకరుచుకుని వచ్చిన ఘటన వరంగల్‌ ఎంజీఎం ఆసుత్రిలో కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం.. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ ఔట్‌పోస్టు వద్ద శిశువును నోటకరుచుకుని వస్తున్న శునకాన్ని గుర్తించిన ఔట్‌పోస్టు సిబ్బంది గట్టిగా కేకలు వేసి అదిలించారు. దీంతో ఆ కుక్క శిశువును అక్కడే వదిలేసి పారిపోయింది. అక్కడున్న సిబ్బంది పరిశీలించి.. అప్పటికే చనిపోయిన ఆ శిశువుకు ఒక కాలు లేదని గుర్తించారు. జననాంగ ప్రాంతమంతా ఛిద్రమై ఉండడంతో చలించిపోయారు.


ఈ విషయం తెలుసుకున్న మట్టెవాడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ శిశువు ఎక్కడిది? ఎంజీఎం ఆసుపత్రిలో జన్మించిన శిశువా? లేక..ఆ కుక్క వేరొకచోట నుంచి తీసుకొచ్చిందా? బతికుండగానే దాడి చేసి, చంపి నోట కరుచుకుని వచ్చిందా?లేక.. ఎవరైనా వదిలేసిన బిడ్డను కుక్క నోటకరుచుకుని వచ్చే కమంలో ఆ పసికందు ప్రాణం పోయిందా? లేక ఎవరైనా ప్రాణం పోయిన శిశువును వదిలేస్తే ఆ మృతదేహాన్ని కుక్క పట్టుకొచ్చిందా? అనే కోణాల్లో విచారణ ప్రారంభించారు. ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజల్లో చాలామంది వైద్య సేవల కోసం ఎంజీఎం ఆసుపత్రికి వస్తుంటారు.


అలా వచ్చిన వారిలో ఎవరైనా శిశువు మరణించి ఉంటే అక్కడ వేసి వెళ్లారా? అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తుచేస్తున్నారు. అసలు ఆ శిశువు ఆడా, మగా అనేది కూడా తేలాల్సి ఉంది. శిశువుకు బొడ్డుతాడు కూడా ఉండటంతో రెండు మూడు రోజుల వయసు ఉండొచ్చని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శిశువు మృతదేహాన్ని ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ పరీక్షల కోసం మార్చురీకి తరలించినట్టు వారు వెల్లడించారు. కాగా, ఎంజీఎం నవజాత శిశు విభాగంలోగానీ, పిల్లల వార్డులోగానీ శిశువులు తప్పిపోయిన సంఘటన ఏదీ నమోదు కాలేదని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళి స్పష్టం చేశారు. శుక్రవారం శిశు మరణాలు కూడా జరగలేదని, కానీ ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో గురువారం నాలుగు మరణాలు సంభవించగా.. ఆ శిశువుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులు తీసుకెళ్లినట్టు చెప్పారు.

Updated Date - Aug 10 , 2024 | 03:01 AM