Award: బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం
ABN, Publish Date - Sep 09 , 2024 | 02:58 AM
సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది.
కవులు, రచయితల అభినందనలు
నేడు రవీంద్రభారతిలో అవార్డు ప్రదానం
నా బాధ్యత మరింత పెరిగింది: భాస్కర్
హైదరాబాద్/సిరిసిల్ల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది. సోదర భాషా సాహిత్యాలకు వారధిగా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సాహిత్య రంగం నుంచి విశేష కృషి చేసిన డాక్టర్ నలిమెల భాస్కర్‌కు ఈ పురస్కారం దక్కడం పట్ల తెలంగాణ రచయితల వేదిక, మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల సాహితీ సమితి, రాజన్న సిరిసిల్ల జిల్లా కవులు, రచయితలు అభినందనలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏటా సెప్టెంబరు 9న ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో జన్మించిన నలిమెల భాస్కర్ అధ్యాపకుడిగా, సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేస్తూ కరీంనగర్‌లో స్థిరపడ్డారు. ఆయనకు తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో పట్టుంది. తెలుగు అధ్యాపకుడిగా 2011లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తెలంగాణ పదకోశాన్ని రూపొందించిన భాస్కర్ పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించారు.
మలయాళ నవల ‘స్మారక శశిగల్’ను స్మారక శిలలు పేరిట తెలుగులోకి అనువదించిన ఆయనకు 2013 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. 1998 నుంచి 1999 వరకు 35 వారాల పాటు ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధంలో ‘సాహితీ సుమాల’ పేరుతో వ్యాసాలు రాశారు. కాగా కాళోజీ పురస్కారానికి ఎంపికవడం చాలా సంతోషంగా ఉందనిడాక్టర్ నలిమెల భాస్కర్ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. కాళోజీ విశ్వమానవుడని, ఆయనలో అనేక పార్శ్వాలు కనిపిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ భాషా సరస్వతి రుణం తీర్చుకోవాలని కోరారు.
Updated Date - Sep 09 , 2024 | 02:58 AM