Gachibowli: మద్యం మత్తులో డ్రైవింగ్.. ఓఆర్‌ఆర్‌పై ప్రైవేటు బస్సు బోల్తా..
ABN, Publish Date - Jun 24 , 2024 | 04:33 AM
ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం పోయింది. మద్యం మత్తులో బస్సు నడపడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ (మార్నింగ్ స్టార్) బస్సు ఆదివారం రాత్రి గచ్చిబౌలి నుంచి చెన్నైకు బయల్దేరింది.
మహిళ మృతి, 16 మందికి గాయాలు
నార్సింగి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం పోయింది. మద్యం మత్తులో బస్సు నడపడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ (మార్నింగ్ స్టార్) బస్సు ఆదివారం రాత్రి గచ్చిబౌలి నుంచి చెన్నైకు బయల్దేరింది. నానక్‌రామ్‌గూడ టోల్‌గేట్ వద్దకు రాగానే ఇతర వాహనాల లైట్లకు డ్రైవర్ కళ్లు బైర్లుకమ్మాయి. హఠాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు కింద పడిపోయినట్లు తెలిసింది. వారిలో ఒక మహిళ మృతి చెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి.
మృతి చెందిన మహిళ స్వస్థలం ఒంగోలు కాగా.. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉంటున్నట్లు తెలిసింది. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనికి శ్వాసపరీక్ష(ఆల్కహాల్) నిర్వహించగా 187 పాయింట్ల రీడింగ్ వచ్చినట్లు సమాచారం. నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jun 24 , 2024 | 04:33 AM