Wanaparthy: ట్రాన్స్‌ఫార్మర్, స్తంభం ఏర్పాటుకు లంచం
ABN, Publish Date - Jun 01 , 2024 | 03:31 AM
ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు ఎల్టీ లైన్ స్తంభం ఏర్పాటు చేసేందుకు రూ.19వేల లంచం తీసుకున్న విద్యుత్ అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా ఎస్‌ఈతోపాటు డీఈ, ఏఈ దొరికిపోవడం విద్యుత్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఏసీబీ వలలో విద్యుత్తు ఎస్‌ఈ, డీఈ, ఏఈ ఏసీబీ వలలో
విద్యుత్ ఎస్‌ఈ, డీఈ, ఏఈ
ట్రాన్స్‌ఫార్మర్, ఎల్టీ లైన్ స్తంభం ఏర్పాటు చేసేందుకు
రూ.19 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
వనపర్తి టౌన్, మే 31 : ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు ఎల్టీ లైన్ స్తంభం ఏర్పాటు చేసేందుకు రూ.19వేల లంచం తీసుకున్న విద్యుత్ అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా ఎస్‌ఈతోపాటు డీఈ, ఏఈ దొరికిపోవడం విద్యుత్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వెన్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ నాలుగేళ్లుగా విద్యుత్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన బంధువు పెద్ది లక్ష్మీనారాయణ పాలెం గ్రామం దగ్గర సర్వే నంబర్ 94/21లో సీఎంఆర్ హోటల్ నడుపుతున్నారు. హోటల్ నిర్వహణ కోసం 3 ఫేజ్ 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్, ఎల్టీ లైన్ స్తంభం అవసరం ఉండగా ఏప్రిల్ 2వ తేదీన కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
వాటి ఏర్పాటుకు రూ. 2,05,432 అంచనా వేసి దాని కాంట్రాక్టును ప్రవీణ్‌కుమార్‌కు అప్పగించారు. ఆ అంచనాల ఫైల్‌ను డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్) నరేంద్రకుమార్ వద్దకు పంపించగా... ఎస్‌ఈకి రూ.19 వేలు లంచం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో వచ్చిన అధికారులు శుక్రవారం అసిస్టెంట్ ఇంజనీర్ (టెక్నికల్) మధుకర్‌కు కాంట్రాక్టర్ ప్రవీణ్‌కుమార్ రూ.19వేలను ఇచ్చిన తర్వాత దాడులు చేసి, వారిని పట్టుకున్నారు. ఈ కేసులో ఏ1 గా సూపరింటెండింగ్ ఇంజనీర్ నాగేంద్రకుమార్, ఏ2గా డివిజనల్ ఇంజనీర్ నరేంద్రకుమార్, ఏ3గా అసిస్టెంట్ ఇంజనీర్ (టెక్నికల్) మధుకర్ పేర్లను చేర్చారు.
Updated Date - Jun 01 , 2024 | 03:31 AM