Etela Rajender: అధైర్యపడొద్దు... అండగా ఉంటా
ABN, Publish Date - Oct 05 , 2024 | 03:52 AM
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనతో ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని... వారికి న్యాయం జరిగేంత వరకు తాను అండగా ఉంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు.
గరీబోళ్ల మెడ మీద కత్తి పెడుతున్న సీఎంతో
ఎంత దూరమైనా వెళ్లి పోరాడతా: ఎంపీ ఈటల
దిల్‌సుఖ్‌నగర్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనతో ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని... వారికి న్యాయం జరిగేంత వరకు తాను అండగా ఉంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. చైతన్యపురి డివిజన్ పరిధిలోని వినాయకనగర్, మారుతినగర్ నార్త్ కాలనీ మూసీ పరివాహక ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తాతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మనోవేదనతో అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వినాయకనగర్ కాలనీకి చెందిన 60 ఏళ్ల లక్ష్మమ్మను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు.
అదేవిధంగా ఇళ్లు కూల్చేస్తారన్న దిగులుతో ఫిట్స్‌కు గురైన న్యూ మారుతినగర్ నార్త్‌కు చెందిన ఓ గర్భిణి కుటుంబసభ్యులను పరామర్శించారు. మూసీ నిర్వాసితుల ఇళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వంతో ఎంతవరకైనా కొట్లాడుతాననన్నారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకొనేందుకు అవసరమైన న్యాయ సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పేదోళ్ల మెడ మీద కత్తి పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డితో ఎంత దూరమైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సామాన్యులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
Updated Date - Oct 05 , 2024 | 03:52 AM