Sangareddy: మైనర్ల మధ్య ప్రేమతో పెద్దల తగాదా బాలుడి తండ్రిపై దాడి.. గాయాలతో మృతి
ABN, Publish Date - May 28 , 2024 | 06:01 AM
భిన్న సామాజిక వర్గాలకు చెందిన మైనర్ల మధ్య ప్రేమ.. ఫలితంగా ఆ వర్గాల పెద్దల మధ్య మనస్పర్థలు.. చివరికి బాలుడి తండ్రి మృతికి దారితీశాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మం డలం బడంపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బ్యాగరి నరసింహులు.
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేటలో ఘటన
గ్రామంలో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు
కోహీర్, మే 27: భిన్న సామాజిక వర్గాలకు చెందిన మైనర్ల మధ్య ప్రేమ.. ఫలితంగా ఆ వర్గాల పెద్దల మధ్య మనస్పర్థలు.. చివరికి బాలుడి తండ్రి మృతికి దారితీశాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మం డలం బడంపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బ్యాగరి నరసింహులు. కోహీర్ ఎస్సై కృష్ణయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలానికి చెందిన ఓ వ్యక్తి, తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఐదేళ్ల క్రితం బడంపేటకు వలసొచ్చాడు. అక్కడి ఓ వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్నాడు. ఈ వ్యవసాయ క్షేత్రం పక్కనే అదే గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి పొలం ఉంది.. అక్కడికి వచ్చి వెళ్తున్న క్రమంలో వలసొచ్చిన వ్యక్తి కుమార్తె, నరసింహులు కుమారుడి మధ్య పరిచయం ఏర్పడి.. ప్రేమకు దారితీసింది. ఇద్దకే మైనర్లే.
పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరూ 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈఘటనపై బాలిక తరఫువారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు బాలుడిని, బాలికను పిలిపించారు. ఇద్దరూ మైనర్లు కావడంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపా రు. బాలికను సంగారెడ్డిలోని సఖీ కేంద్రంలో ఉంచగా, అక్కడ ఉండకుండా బడంపేటకు వచ్చేసింది. ఈ నెల 18న వలసొచ్చిన ఆ వ్యక్తి.. గ్రామస్థుల ఎదుట బాలుడి తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా, కులం పేరుతో దూషించాడు. ఇది తెలుసుకొని నరసింహులు అదే రోజు రాత్రి మద్యం మత్తులో వలసొచ్చిన ఆ వ్యక్తికి మద్దతుగా నిలిచిన ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని దూషించాడు.
ఆగ్రహం చెందిన ఆ సామాజికవర్గానికి చెందిన వారు నరసింహులపై దాడి చేసి విచక్షణరహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడు లేవలేని స్థితిలో ఉండగా, మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు తొలుత కోహిర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతున్న నరసింహులు ఆదివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నరసింహులపై దాడిచేసిన సామాజిక వర్గానికి చెందిన పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని సోమవారంరాత్రి గ్రామానికి చేర్చారు. మృతుడి తరఫువారు.. దాడికి పాల్పడిన సామాజికవర్గాలు నివసించే ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు.
Updated Date - May 28 , 2024 | 06:01 AM