Bhadradri: పెద వాగు ఖాళీ..
ABN, Publish Date - Jul 20 , 2024 | 03:23 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ఖాళీ అయింది. గురువారం రాత్రి కట్ట పక్కనే పడిన గండి అర్ధరాత్రి తర్వాత క్రమంగా పెద్దదైంది. సుమారు 35 అడుగుల లోతులో ఉన్న నీరంతా దిగువకు పోయింది.
ప్రాజెక్టుకు గండి.. 20 కోట్ల నష్టం
గుబ్బలమంగమ్మ అటవీ ప్రాంతంలో
31 సెం.మీ. వర్షం.. భారీ వరద
200పైగా పశువుల మృత్యువాత
నిరాశ్రయులైన 2 గ్రామాల ప్రజలు
వేలాది ఎకరాల్లో పంట నష్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ఖాళీ అయింది. గురువారం రాత్రి కట్ట పక్కనే పడిన గండి అర్ధరాత్రి తర్వాత క్రమంగా పెద్దదైంది. సుమారు 35 అడుగుల లోతులో ఉన్న నీరంతా దిగువకు పోయింది. ఎగువన ఉన్న గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో ఆరు గంటల్లోనే 31.1 సెం.మీ. వర్షం కురవడంతో పెదవాగులోకి 80 క్యూసెక్కుల నీరు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 21 అడుగులు కాగా ఔట్‌ఫ్లో కన్నా ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో మూడు గేట్లు తెరిచినా ప్రయోజనం లేకపోయింది. కట్టపై నుంచి వరద పొంగి ప్రవహించింది. అనేకచోట్ల కట్ట కోతకు గురైంది. గేట్ల పక్కనే పడిన గండి.. 150 మీటర్ల పొడవు, 15 మీటర్ల లోతుకు పెరిగింది. తెల్లారేసరికి పెదవాగు ఖాళీ అయింది.
పెదవాగు ప్రాజెక్టు తెలంగాణలో, ఆయకట్టు ఏపీ పరిధిలో ఉంది. తెలంగాణ పరిధిలోకి వచ్చే గుమ్మడపల్లి, కొత్తూరులో 70 ఇళ్లల్లోకి నీరు ప్రవేశించింది. ప్రాణనష్టం వాటిల్లలేదు. కాగా, కొత్తూరులో ఇళ్లలోకి 6 అడుగుల నీరు చేరడంతో ప్రజలు ఓ డాబాపైన, రేకుల కింద, మెట్లపైన నిలబడి ప్రాణాలు కాపాడుకున్నారు. రాత్రంతా జాగారం చేశారు. గుమ్మడపల్లిలో 15 ఇళ్లు కూలిపోయాయి. వీటితో పాటు బచ్చువారిగూడెం, నారాయణపురంలో 700 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 70 విద్యుత్ స్తంభాలు విరిగాయి. పెదవాగుకు గండి పడడంలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఈని ఆదేశించామని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు.
గండితో రూ.20 కోట్లపైగా నష్టం జరిగిందని నీటి పారుదల శాఖ అధికారులు నిర్ధారించారు. దీన్ని కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో కేంద్ర జలసంఘం, తెలంగాణ, ఆంధ్రా అధికారులు.. గండిని పరిశీలించనున్నారు. సత్వర మరమ్మతులకు సాధ్యమవుతుందా లేదా తాత్కాలిక మరమ్మతుల చేస్తారన్నది నిపుణుల బృందం తేల్చాల్సి ఉంది. పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.100 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తాత్కాలిక మరమ్మతులకు రూ.కోటి అవుతుందని సమాచారం. మంత్రి తుమ్మల నష్టం వివరాలను తెలుసుకున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో సమీక్షించారు.
ఏపీలోని 10 గ్రామాల ముంపు
పెదవాగు నీరు ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 10 గ్రామాలను ముంచెత్తింది. 200కు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. భద్రాద్రి జిల్లాలో ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు పెదవాగు కట్టకు గండితో విద్యుత్తు శాఖకు రూ.80 లక్షల నష్టం వాటిల్లింది. కాగా, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టుకు గండి పడిందని ప్రజలు మండిపడుతున్నారు.
Updated Date - Jul 20 , 2024 | 03:23 AM