High Court: చెన్నమనేని జర్మనీ పౌరుడే
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:09 AM
వేములవాడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడం సబబేనని స్పష్టం చేసింది.
రమేశ్ భారత పౌరసత్వం రద్దు సబబే
కేంద్ర హోంశాఖ నిర్ణయం సరైందే: హైకోర్టు
జర్మనీ పౌరసత్వాన్ని దాచినందుకు 30 లక్షల ఫైన్
అందులో 25 లక్షలు ఆది శ్రీనివా్‌సకు చెల్లించాలి
15 ఏళ్లుగా కోర్టు సమయం వృథా చేశారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం
హైదరాబాద్/వేములవాడ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వేములవాడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడం సబబేనని స్పష్టం చేసింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2019లో కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. జర్మనీ పౌరుడన్న విషయాన్ని దాచిపెట్టినందుకు రూ.30 లక్షలు జరిమానా విధిస్తూ సోమవారం సింగిల్ జడ్జి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. రమేశ్ పౌరసత్వంపై మొదటి నుంచి పోరాడుతూ ఆర్థికంగా నష్టపోయినందుకు గాను ప్రస్తుత వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా్‌సకు రూ.25 లక్షలు చెల్లించాలని.. మిగతా రూ.5 లక్షలు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల సంస్థకు నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. రమేశ్ జర్మనీ పౌరసత్వాన్ని దాచిపెట్టడం ద్వారా గత 15 ఏళ్లుగా కోర్టు, అధికారుల సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పౌరసత్వం విషయం బయటపెట్టకుండా 15 ఏళ్లు ఎమ్మెల్యే పదవి అనుభవించారని కోర్టు పేర్కొంది. ‘తాను జర్మనీ పౌరుడిని కాద’ని నిరూపించేలా రమేశ్ ఇప్పటి వరకు జర్మనీ ఎంబసీ నుంచి ఒక్క ఆధారం కూడా సమర్పించలేదని స్పష్టంచేసింది. తప్పుడు పత్రాలు సమర్పించడం ద్వారా పిటిషనర్ కోర్టు సమయాన్ని వృథా చేశారంది. జర్మనీ పాస్‌పోర్ట్‌తోనే రమేశ్ ఆ దేశానికి వెళ్లి వస్తున్నారని తెలిపింది. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఆది నుంచీ పోరాడుతున్న ఆది శ్రీనివాస్..
చెన్నమనేని రమేశ్‌కు భారత పౌరసత్వం ఇవ్వడం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొంటూ గతంలో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 2009 నుంచీ పోరాడుతున్నారు. 2009 ఫిబ్రవరిలో రమేశ్‌కు భారత పౌరసత్వం రాగా 2009 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2009 జూన్‌లో రమేశ్ పౌరసత్వం రద్దు చేయాలంటూ ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖ వద్ద రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత రమేశ్ 2010 ఉప ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆ ఎన్నిక చెల్లదంటూ శ్రీనివాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు.. రమేశ్ భారత పౌరుడు కాదని, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది.
ఈ తీర్పుపై రమేశ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ తర్వాత 2014లో రమేశ్ మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక కూడా చెల్లదని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొదటి కేసులో రమేశ్ అప్పీల్‌పై 2016లో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. ఇకపై వచ్చే ఎన్నికల పిటిషన్ల మీద రమేశ్ పౌరసత్వంపై కేంద్ర నిర్ణయం తర్వాతే తీర్పు ఇవ్వాలని పేర్కొంది. కేంద్ర హోంశాఖ 2017లో నియమించిన త్రిసభ్య కమిటీ.. రమేశ్ భారత ప్రభుత్వాన్ని మోసగించి పౌరసత్వం పొందినట్లు నివేదిక ఇచ్చింది. దీంతో కేంద్ర హోంశాఖ రమేశ్ పౌరసత్వాన్ని రద్దుచేసింది. దీన్ని సమీక్షించాలంటూ రమేశ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌నూ కొట్టేసింది. దీనిపై రమేశ్ 2019లో హైకోర్టును ఆశ్రయించగా కేంద్ర నిర్ణయంపై స్టే విధించింది. ప్రస్తుతం రమేశ్ జర్మనీ పౌరసత్వం కొనసాగిస్తున్నారని.. మోసం చేయడం ద్వారా ఎమ్మెల్యేగా కొనసాగారని నిర్ధారిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. మరోవైపు రమేశ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లలో తీర్పు రావాల్సి ఉంది.
న్యాయం గెలిచింది: ఆది శ్రీనివాస్
సుదీర్ఘకాలంగా తాను చేస్తున్న పోరాటం ఫలించిందని, న్యాయం గెలిచిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. హైకోర్టు తీర్పుపై సోమవారం ఆయన హర్షం వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా తాను చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ఇన్నేళ్ల తన పోరాటానికి సహకరించిన వారికి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అభ్యర్థిత్వంపై మోసం చేసినందుకు చెన్నమనేని రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరతానని చెప్పారు.
తీర్పు నిరాశ కలిగించింది: రమేశ్
హైకోర్టు తీర్పు తనకు తీవ్ర నిరాశ కలిగించిందని చెన్నమనేని రమేశ్ అన్నారు. సోమవారం ఆయన తన సహాయకుల ద్వారా తీర్పుపై అభిప్రాయాన్ని తెలియజేశారు. హైకోర్టులో తన పౌరసత్వంపై వెలువడిన తీర్పు హేతుబద్ధంగా లేదన్నారు. రాజకీయ జీవితంలో ఒడిదొడుకులు సహజమని, వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనపై కుట్ర చేసి పౌరసత్వ వివాదం సృష్టించారని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని రమేశ్ తెలిపారు.