Hyderabad: పాలస్తీనాది తిరుగులేని సంకల్పం
ABN, Publish Date - Oct 07 , 2024 | 03:50 AM
ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా జనాభాలో 8 శాతం మంది మరణించగా, మరో 8 శాతం మందికి పైగా పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు, రచయిత, ప్రొఫెసర్ అచిన్ వనాయిక్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం వెరవని ధీరత్వం
ప్రపంచంలో ఆధిపత్య ధోరణే ఎక్కువగా ఉంది
ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు అచిన్ వనాయక్
ట్రాన్స్ వ్యక్తుల పట్ల వివక్ష తగదు: తాషీ చోడు్‌ప
ఎన్ కౌంటర్లను ఖండించిన మానవ హక్కుల వేదిక
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా జనాభాలో 8 శాతం మంది మరణించగా, మరో 8 శాతం మందికి పైగా పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు, రచయిత, ప్రొఫెసర్ అచిన్ వనాయిక్ పేర్కొన్నారు. అయినప్పటికీ, తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలన్న దృఢ సంకల్పం నుంచి పాలస్తీనా దేశస్తులు అడుగు కూడా వెనక్కి వేయలేదని కొనియాడారు. పాలస్తీనాపై మారణహోమాన్ని ఇజ్రాయెల్ పౌర సమాజం సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఎంతో మంది ఆ దేశ పౌరులు పాలస్తీనాకు సంఘీభావంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
పాలస్తీనా సమాజం సైతం హమాస్ ధోరణిని ఎండగడుతోందని, అయితే, అవేవీ బహిర్గతం కావడం లేదని చెప్పారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో మానవ హక్కుల నేత బాలగోపాల్ 15వ స్మారక సదస్సు ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. పాలస్తీనాలో ఇజ్రాయెల్ సృష్టిస్తోన్న మారణహోమం అంశంపై అచిన్ వనాయిక్ కీలకోపన్యాసం చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దమనకాండను ఐక్య రాజ్య సమతిలో సైతం ఖండించకుండా భారత్ వ్యూహాత్మక మౌనం ప్రదర్శించిందని.. దీనికి మోదీ ప్రభుత్వ మత వాద రాజకీయ వైఖరే ప్రధాన కారణమని విమర్శించారు. ఒకవైపు మారణ హోమాన్ని సృష్టిస్తూనే, తమ దేశానికే ప్రమాదం పొంచి ఉన్నదంటూ మిగతా దేశాల నుంచి సానుభూతి పొందటానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం వింత వైఖరి అవలంభిస్తోందని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్య ధోరణే ఎక్కువగా ఉందని అన్నారు. సామాజిక ఉద్యమాల్లో ట్రాన్స్ జెండర్లతో పాటు వివిధ లైంగిక అస్తిత్వాలు కలిగిన వ్యక్తుల హక్కులను భాగం చేయడం అంశం మీద ఎల్జీబీటీక్యూ హక్కుల ఉద్యమ కారిణి తాషీ చోడుప్ మాట్లాడారు. ట్రాన్స్ వ్యక్తులను థర్డ్ జెండర్‌గా సంబోధించడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మనుషులంతా ఒక్కటే అనే ప్రజాస్వామిక దృక్పథానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ జెండర్ల విభజన పూర్తి విరుద్ధమని అన్నారు. పలు సందర్భాల్లో న్యాయస్థానాల్లో జడ్జిలు సైతం ట్రాన్స్ వ్యక్తుల పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఉదాహరణలతో వివరించారు. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ వలంటీర్లుగా నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆమె విమర్శించారు. వారిపై ఉన్న వివక్షను పోగొట్టడానికి చర్యలు చేపట్టకుండా.. విద్య, ఉపాధి అవకాశాలు కల్పించకుండా వలంటీర్ల పోస్టులతో ఒరిగేదేమీ లేదని చెప్పారు.
పోలీసులపై హత్యా నేరం మోపాలి..
ఛత్తీ్‌సగఢ్‌లో ఎన్‌కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మానవ హక్కుల వేదిక ప్రకటించింది. 31 మంది ప్రాణాలు బలిగొన్న పోలీసు అధికారులపై హత్యానేరం మోపాలని డిమాండ్ చేసింది. దీన్ని ఎదురుకాల్పులుగా నమ్మబలకడాన్ని తప్పుబట్టింది. ఇదే కార్యక్రమంలో ఆవిష్కృతమైన బాలగోపాల్ వ్యాస సంపుటాలు.. ‘‘రిజర్వేషన్ల వర్గీకరణ ప్రజాస్వామిక దృక్పథం’’ పుస్తకాన్ని వనపాకల దిలీప్ పరిచయం చేశారు. బీల కోసం బతుకు కోసం- సోంపేట హరిత ఉద్యమ చరిత్రను వై. కృష్ణమూర్తి, బస్తర్ డివిజన్‌లో సెక్యూరిటీ అండ్ ఇన్ సెక్యూరిటీ- నిజ నిర్ధారణ నివేదిక పుస్తకాన్ని చంద్రశేఖర్ పరిచయం చేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె.రామచంద్రమూర్తి, వేమన వసంతలక్ష్మి, మానవ హక్కుల వేదిక నేతలు జీవన్ కుమార్, రోహిత్, తిరుపతయ్య, హరికృష్ణ, గుత్తా రోహిత్, ప్రొఫెసర్ హరగోపాల్, వసంత కన్నబిరాన్ పాల్గొన్నారు.
Updated Date - Oct 07 , 2024 | 03:50 AM