ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Demolition: హైడ్రా.. ఆచితూచి!

ABN, Publish Date - Sep 30 , 2024 | 02:59 AM

ఓ వైపు మూసీ ఆక్రమణల మార్కింగ్‌.. మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కూల్చివేత..

  • హైదరాబాద్‌లో కూల్చివేతలకు 2-3 వారాల తాత్కాలిక విరామం?

  • నిరసనలు, హైకోర్టు జోక్యంతో ఉన్నత ఆదేశాలు

  • ఈ సమయంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన

  • ఇక ముందు నివాసాల కూల్చివేతపై జాగ్రత్తలు

  • న్యాయ సలహా తీసుకున్నాకే ముందుకు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు మూసీ ఆక్రమణల మార్కింగ్‌.. మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కూల్చివేత.. వాటిని వ్యతిరేకిస్తూ బాధితుల నుంచి నిరసనలు పెరిగిపోవటం, బాధితుల ఆక్రందనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటం.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు పునరాలోచనలో పడ్డాయి. క్షేత్రస్థాయి సర్వే, మార్కింగ్‌లను రెవెన్యూ విభాగం ఇప్పటికే నిలిపివేయగా.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోన్న ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌’ (హైడ్రా) తాత్కాలికంగా కూల్చివేతలకు విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విరామం సమయంలో ఫిర్యాదులపై సమగ్ర పరిశీలన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.


ఈ మేరకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ నోటిఫై అయిన చెరువులకు సంబంధించిన ఫిర్యాదులపై దృష్టి సారించనున్నారు. నిర్ధారిత ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అదే సమయంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, స్థానిక మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల అనుమతులున్న నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. కాగా, హైకోర్టు కూడా పలుమార్లు హైడ్రా దూకుడును ప్రశ్నించింది. కోర్టు విచారణలో ఉన్న ఓ భవనాన్ని కూల్చివేయడంపై తీవ్రంగా స్పందించింది. స్వయంగా లేదా వర్చువల్‌గా హైడ్రా కమిషనర్‌, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇది కూడా హైడ్రా పునరాలోచనకు ఓ కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి, జూలై 19వ తేదీన ఏర్పాటైన హైడ్రా తొలి నుంచి దూకుడుగానే ఉంది. చెరువులు, పార్కుల్లోని నివాసేతర నిర్మాణాల కూల్చివేత చేపట్టగా మొదట్లో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది.


అయితే పేదలు నివాసం ఉంటున్న షెడ్లు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కూల్చివేయడం మొదలు కావటంతో ప్రతికూల వాతావరణం నెలకొంది. నిజాంపేటలోని మల్లంపేట కత్వ చెరువు, అమీన్‌పూర్‌లోని ప్రభుత్వ స్థలంలో విల్లాల కూల్చివేతపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కత్వ చెరువులో నిబంధనలకు విరుద్ధంగా స్థానిక సంస్థ అనుమతులివ్వగా.. కొన్ని విల్లాల విక్రయం అనంతరం పర్మిషన్లు రద్దు చేశారు. తెలిసీ తెలియక విల్లాలు కొన్న వారిలో ఎక్కువ మంది మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి చెందిన వారే. అమీన్‌పూర్‌లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 25 విల్లాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఇక్కడ కూడా సర్కారు భూమిలో మునిసిపాలిటీ అనుమతులు ఇవ్వగా.. రెవెన్యూ విభాగం సూచనతో అనంతరం రద్దు చేశారు. అందుకే నిర్మాణాలను కూల్చివేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, నిర్మాణాలు చేపట్టి విక్రయించిన వాళ్లు, అనుమతులు ఇచ్చిన అధికారులు ఆర్థిక ప్రయోజనం పొందగా.. కొనుగోలు చేసిన వారు బాధితులుగా మిగిలిపోయారు.


సున్నం చెరువు వద్ద ఆక్రమణల తొలగింపు క్రమంలోనూ హైడ్రా తీరు చర్చనీయాంశంగా మారింది. మంచినీటి వ్యాపారం చేసే ఓ వ్యక్తి కూలీల కోసం నిర్మించిన షెడ్లు తొలగించామని హైడ్రా చెబుతున్నా.. కూల్చివేతల అనంతరం, పిల్లాపాపలున్న ఆ కుటుంబాలు ఎక్కడ తలదాచుకుంటాయన్న విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. కూకట్‌పల్లిలోని చెరువు వద్ద నిర్మించిన షెడ్లను వాటిలో ప్రింటింగ్‌, క్యాటరింగ్‌ యంత్రాలుండగానే కూల్చడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. బాధిత కుటుంబాలు రోదిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు, మూసీ తీర ప్రాంతంలో ఇళ్లకు మార్కింగ్‌ చేసిన రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులు.. హైడ్రా కూల్చివేతలు చేపట్టనుందని, త్వరగా ఖాళీ చేయాలని ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి సూచించారు. దీంతో, హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు వస్తాయో అన్న ఆందోళన బాధిత కుటుంబాల్లో కనిపిస్తోంది. కంటిమీద కునుకు లేకుం డా గడుపుతున్నామని పలువురు వాపోతున్నారు.


  • ఉన్నత స్థాయి ఆదేశాల నేపథ్యంలో..

తాజా పరిణామాల నేపథ్యంలో స్పీడ్‌ తగ్గించాలని హైడ్రాకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఫలితంగా.. రెండు, మూడు వారాలపాటు హైడ్రా కూల్చివేతలు ఉండకపోవచ్చని సమాచారం. ఆ తర్వాత కూడా నివాసేతర ఆక్రమణల తొలగింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత వరకూ నివాస భవనాల జోలికి వెళ్లకుండా ఉండాలనుకున్నట్టు తెలిసింది. తప్పదనుకుంటే న్యాయ సలహాలు తీసుకున్న తరువాతే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.


  • హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు : రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): హైడ్రాపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరించారు. సంబంధం లేని విషయాలను సంస్థకు ఆపాదిస్తూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డిలోని మల్కాపూర్‌ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని స్పష్టం చేశారు. అక్కడ జరిగిన ప్రమాదంలో హోంగార్డుకు గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, దానికి హైడ్రా బలి తీసుకుందని ప్రచారం చేస్తుండడం దురదృష్టకరమన్నారు. కూకట్‌పల్లిలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని, బుచ్చమ్మ ఆత్మహత్యను హైడ్రాకు ముడిపెట్టవద్దన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రాకు ఆపాదిస్తున్నారని, ఆదిలాబాద్‌ జిల్లాలో కూల్చివేతలు చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మాత్రమే హైడ్రా పరిధిలోకి వస్తుందని గుర్తుచేశారు.

Updated Date - Sep 30 , 2024 | 02:59 AM