Sirisilla: 24 గంటల్లో17 ఆపరేషన్లు!
ABN, Publish Date - Aug 25 , 2024 | 03:00 AM
ఆ ప్రభుత్వాస్పత్రి వైద్యుల చొరవ, అంకితభావం గురించి తెలిశాక బహుశా ఎవరూ సర్కారు దవాఖానాలో మంచి చికిత్స లభిస్తుందని నమ్మలేం అనే సాహసం చేయరు కావొచ్చు!
6 సిజేరియన్లు, 5 ఆర్థో, 2 కంటి శస్త్రచికిత్సలు
ఓ మహిళకు గర్భసంచిలో గడ్డల తొలగింపు
మిగతావి హెర్నియా, హైడ్రోసిల్ ఆపరేషన్లు
వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి ఘనత
ఆధునిక వసతులతో కార్పొరేట్ స్థాయి వైద్యం
సిరిసిల్ల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆ ప్రభుత్వాస్పత్రి వైద్యుల చొరవ, అంకితభావం గురించి తెలిశాక బహుశా ఎవరూ సర్కారు దవాఖానాలో మంచి చికిత్స లభిస్తుందని నమ్మలేం అనే సాహసం చేయరు కావొచ్చు! ఎందుకంటే.. మంచి చికిత్స లభిస్తుందని ఆశతో వచ్చిన రోగుల నమ్మకాన్ని ఆ సర్కారు దవాఖానాలోని వైద్యులు వమ్ము చేయలేదు! ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వం కల్పించిన ఆధునాతన వైద్య సదుపాయాలతో రోగులకు వెంటవెంటనే శస్త్రచికిత్సలు పూర్తిచేశారు! కేవలం 24 గంటల్లో విరామం అన్నదే లేకుండా ఏకంగా 17 శస్త్రచికిత్సలు పూర్తిచేశారు.
ఈ ఘనత.. సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిది.. అక్కడి వైద్యులు, ఇతర సిబ్బందిదీనూ! ఈ ఆస్పత్రిలో ఐసీయూ, బ్లడ్ బ్యాంక్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి అవసరమైన శస్త్ర చికిత్సలను అందిస్తున్నారు. తాజాగా సూపరింటెండెంట్, సర్జన్ డాక్టర్ పెంచలయ్య ఆధ్వర్యంలోని వైద్యులు సంధ్య, రత్నమాల, అనిల్, రాజశ్రీ, తిరుపతిలతో కూడిన వైద్య బృందం శుక్ర, శనివారాల్లో (24 గంటల్లోనే) ఆరు సిజేరియన్లు, ఐదు ఆర్థో ఆపరేషన్లు, రెండు కంటి ఆపరేషన్లు, హైడ్రోసిల్, హెర్నియాకు సంబంధించి మూడు శస్త్రచికిత్సలు, గర్భసంచిలో గడ్డల తొలగింపునకు సంబంధించి శస్త్రచికిత్స చేశారు.
ఈ ఆస్పత్రిని 2021లో ఏరియా ఆస్పత్రిగా మార్చి వంద పడకలకు విస్తరించారు. ఫలితంగా ఇక్కడ పలు రకాల వైద్య సేవలు అందుబాటులోకొచ్చాయి. ఇప్పటికే ఇక్కడ కీళ్ల మార్పిడి ఆపరేషన్ కూడా చేశారు. జిల్లాలో ఓ ప్రభుత్వాస్పత్రిలో కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయడం ఈ ఆస్పత్రిలోనే తొలిసారి. గర్భిణులకు సహాయకారిగా ఉండేందుకు ‘మాతృసేవ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణులకు నెలవారీగా ఆరోగ్య పరీక్షల నుంచి.. వారు పురుటి నొప్పులతో ఆస్పత్రిలో చేరి.. ప్రసవం జరిగి.. బిడ్డతో కలిసి ఇంటికి చేరేదాకా ప్రత్యేక సేవలు అందిస్తున్నారు.
అన్ని రకాల వైద్యసేవలు అందిస్తాం వేములవాడ ఆస్పత్రిలో
నిరుపేద రోగులకు సేవలు అందించే దిశగా, చికిత్సపై వారిలో నమ్మకాన్ని పెంచే విధంగా కృషి చేస్తున్నాం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీ్‌పకుమార్ ఝా సహకారంతో ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తెస్తాం. వీటిని రోగులు వినియోగించుకోవాలి.
- డాక్టర్ పెంచలయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్
Updated Date - Aug 25 , 2024 | 03:00 AM