Power Consumption: గృహజ్యోతికి రూ.2,418 కోట్లు..
ABN, Publish Date - Jul 26 , 2024 | 04:12 AM
ఉచిత/రాయితీతో విద్యుత్ పొందే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్యుత్ సబ్సిడీలన్నింటికీ రూ.16,398 కోట్లు
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఉచిత/రాయితీతో విద్యుత్ పొందే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మార్చి 1 నుంచి 200 యూనిట్ల దాకా వినియోగించే 45,81,676 మందికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్న విషయం విదితమే. దీనికి బడ్జెట్‌లో రూ.2,418 కోట్లను కేటాయించారు. అయితే రాయితీ పథకాలకు రూ.17,102 కోట్లను కేటాయించాలని ప్రతిపాదనలు వెళ్లగా.. రూ.16,398 కోట్లను కేటాయించారు.
దీని కోసం ప్రతి నెల రూ.958.33 కోట్లను విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను.. డిస్కమ్‌లు ప్రతి నెల రూ.1,386 కోట్ల నష్టాలతో నడుస్తున్నాయని శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇక 200 యూనిట్లలోపు వాడే వారికి ఏటా రూ.3,431 కోట్లు అవుతాయని అంచనాలు వేయగా.. ప్రభుత్వం రూ.2,418 కోట్లను కేటాయించింది. వినియోగానికి తగ్గట్లుగా సబ్సిడీ పెరగాల్సి ఉండగా.. వాస్తవిక లెక్కలు లేకపోవడమే సబ్సిడీ కోతకు కారణంగా భావిస్తున్నారు. ఇక, సర్కారు డిస్కంలకు రూ.43,770 కోట్లను చెల్లించాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన కరెంట్ బిల్లులు రూ.28,842 కోట్లు ఉండగా.. 2016-17 నుంచి 2022-23 దాకా ట్రూఅప్ ఛార్జీల కింద రూ.12,550 కోట్లు, ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద రూ.2,378 కోట్లు కలుపుకొని రూ.43,770 కోట్లు డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.
Updated Date - Jul 26 , 2024 | 04:12 AM