GHMC: ఉన్నది కాలదన్ని.. లేనిదానికి పాకులాట
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:06 AM
పురపాలక శాఖ అధికారుల నిర్లక్ష్యం, లోపాయికారి తనం.. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కు అవడం వల్ల రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ప్రైవేటు పరం అయింది.
రెవెన్యూ, పురపాలక శాఖల నిర్లక్ష్యం
రూ.200 కోట్ల స్థలం ప్రైవేటు పరం
సొంత జాగా వదులుకుని తాజాగా భూ సేకరణ
అప్పట్లో భూమి ఇచ్చేసిన అధికారులపై నేటికీ చర్యల్లేవు
హైదరాబాద్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): పురపాలక శాఖ అధికారుల నిర్లక్ష్యం, లోపాయికారి తనం.. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కు అవడం వల్ల రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ప్రైవేటు పరం అయింది. ఇందులో రెవెన్యూ శాఖ పాత్ర కూడా అంతే ఉంది. హైదరాబాద్ గౌలిపురాలో నిజాం కాలం నుంచి కబేళా నిర్వహణ ఉంది. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ ఆధీనంలో 4.2 ఎకరాల స్థలం ఉన్నది. 2003లో హైకోర్టు ఆదేశాలతో గౌలిపురా కబేళా మూతపడింది. దీంతో కొందరు వ్యక్తుల కన్ను ఈ స్థలంపై పడింది. రెవెన్యూ, పురపాలక అధికారులు సహకరించడంతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చేతులు మారింది. ఈ భూమిని 2010లో హైదరాబాద్ అప్పటి కలెక్టర్ ప్రైవేటు వ్యక్తులకు మ్యుటేషన్ చేశారు. దీంతో పురపాలక శాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ ద్వారా ఆ భూమి తమదని కోర్టును ఆశ్రయించారు. తర్వాత హైదరాబాద్ కలెక్టర్‌గా వచ్చిన గుల్జార్.. గౌలిపురా భూమి మ్యుటేషన్‌ను రద్దు చేసి ప్రభుత్వానికి చెందినదిగా ప్రకటించారు. మరోవైపు ప్రైవేట్ వ్యక్తులు కూడా కోర్టుకెళ్లారు. ఇదిలా ఉండగానే మళ్లీ కబేళా ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇదే స్థలంలో 2 వేల గజాల్లో రాంకీ సంస్థ ద్వారా రూ.7కోట్లతో అత్యాధునికంగా నిర్మాణం చేపట్టారు. అయితే, కోర్టు వివాదం ఉండడంతో ఈ కబేళా ప్రారంభానికి నోచుకోలేదు. ఈలోగా ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కైన జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు ఆ భూమితో తమకు సంబంధం లేదని అఫిడవిట్ ఇచ్చారు. దీంతో 2022లో కోర్టు సదరు భూమిని ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించింది.
ఇప్పుడు సేకరణకు ప్రతిపాదనలు
సొంత భూమిని కాలదన్నుకున్న పురపాలక శాఖ అధికారులు.. కబేళాను నిర్వహణలోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఇంకా భూమి కావాల్సి రావడంతో అదనపు అడ్వకేట్ జనరల్ రజినీకాంత్‌రెడ్డిని ఆశ్రయించగా పశు సంవర్థక శాఖ సూచనల మేరకు స్థలం సేకరించాలని ప్రతిపాదించారు. ఓవైపు కబేళా ప్రారంభించాలని వృత్తిదారుల నుంచి ఒత్తిడి రావడం, కబేళా నిర్వహణ, వాహన రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితులు ఉండటంతో మరో 2వేల గజాలు సేకరించేందుకు సన్నద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి రూ.15కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కబేళాకు సంబంధించిన 4 ఎకరాల్లో ఇప్పటికీ 2.50 ఎకరాలు ఖాళీగానే ఉంది. ఇందులో పశువుల సంత జరుగుతోంది. మళ్లీ ప్రభుత్వ నిధులతో సేకరణకు ప్రతిపాదనలు చేయడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ కమిషనర్ త్వరలోనే భూసేకరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే.. అదే ప్రాంతంలో 1961లోనే జీహెచ్‌ఎంసీ అధికారులు 3 ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి ఎక్కడ ఉంది, ఎవరి చేతిలో ఉందో అంతుపట్టడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూమి దస్ర్తాలను సీపీఎం నాయకుడు శ్రీనివాస్ సేకరించారు. జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నిస్తే మాత్రం ఏమీ చెప్పడం లేదని ఆయన అంటున్నారు. భూసేకరణకు వెళ్లే ముందు ఈ 3 ఎకరాలు ఏమైందో జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టిసారించాల్సి ఉంది. కొసమెరుపు ఏమంటే.. ఇంత విలువైన స్థలాన్ని అప్పనంగా ప్రైౖవేటు వ్యక్తులకు కట్టబెట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులపై ఇప్పటికీ చర్యలు లేవు.
Updated Date - Dec 26 , 2024 | 05:06 AM