Krishna Basin: కృష్ణాలో ప్రాజెక్టుల అనుమతుల కోసం డీపీఆర్‌లు
ABN, Publish Date - Oct 01 , 2024 | 04:56 AM
కృష్ణా బేసిన్ పరిధిలోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌లు) కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో అనుమతుల కోసం దాఖలు చేసి, ట్రైబ్యునల్‌లో ఆయా ప్రాజెక్టుల నీటి కేటాయింపుల కోసం పట్టుబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కేంద్ర జలవనరుల సంఘంలో సమర్పించే యోచన.. డీపీఆర్‌లకు తుది రూపు ఇచ్చే పనిలో సర్కారు
హైదరాబాద్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్ పరిధిలోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌లు) కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో అనుమతుల కోసం దాఖలు చేసి, ట్రైబ్యునల్‌లో ఆయా ప్రాజెక్టుల నీటి కేటాయింపుల కోసం పట్టుబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ కోసం జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ విచారణ జరుగుతుండటంతో రాష్ట్రంలో బేసిన్ పరిధిలో ఉన్న వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు తుదిరూపు ఇచ్చి, సమర్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ సీడబ్ల్యూసీ పరిశీలనలో ఉంది.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్, డిండి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లకు తుది రూపు ఇచ్చి, అనుమతుల కోసం సీడబ్ల్యూసీలో దాఖలు చేసే యోచనతో ఉంది. కృష్ణాలో ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదించిన ప్రాజెక్టులకు నీటి పంపిణీ చేయాలని నిర్దేశిస్తూ జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌కు విచారణ విధి విధానాలు కేంద్రం జారీ చేసింది. నవంబరు నుంచి విచారణ ప్రక్రియలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కానుంది. మరోవైపు 2021 జూలై 15వ తేదీన కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో అనుమతి ప్రాజెక్టుల జాబితాను కేంద్రం విడుదల చేసింది.
అయితే వీటికి గెజిట్ జారీ చేసిన ఆరు నెలల లోపు అనుమతులు తెచ్చుకోవాలని, లేనిపక్షంలో ఆయా ప్రాజెక్టులను పక్కన పెట్టాలని కేంద్రం నిర్దేశించింది. దీని ప్రకారం గోదావరిలో నీటి పంపకాలపై వివాదాలు లేకపోవడంతో దాదాపు అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది. గోదావరి బేసిన్‌లో దాఖలు చేసిన డీపీఆర్‌లలో సీతారామ ఎత్తిపోతల పథకం-సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు, సమ్మక్కసాగర్ ప్రాజెక్టు, డాక్టర్ అంబేద్కర్ వార్ధా ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లు మాత్రమే సీడబ్ల్యూసీలో పెండింగ్‌లో ఉన్నాయి. కృష్ణాలో 90టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ ఒక్కటే దాఖలు చేశారు.
గోదావరిలో 4561.. కృష్ణాలో 3048 టీఎంసీలు
గోదావరి, కృష్ణా నదుల్లో ఏటా సగటు నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. గోదావరిలో ఏటా 4561 టీఎంసీలు, కృష్ణాలో 3048 టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క తేల్చింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ ఇటీవల నివేదికను విడుదల చేసింది. గోదావరిలో 1985-86 నుంచి 2022-23 వరకు ఏటా సగటున 4561.60 టీఎంసీల నీటి లభ్యత ఉందని వెల్లడించింది. అలాగే, కృష్ణా బేసిన్‌లో 1985-86 నుంచి 2022-23 దాకా వరద ఆధారంగా ఏటా సగటున 3,048.37 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు సీడబ్ల్యూసీ గుర్తించింది.
కృష్ణాలో 75 శాతం (ప్రతి నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్ల పాటు వచ్చే వరద)ఆధారంగా బచావత్ ట్రైబ్యునల్ (కృష్ణా-1) 2130 టీఎంసీల లభ్యత ఉందని తేల్చితే.. బ్రిజే్‌ష ట్రైబ్యునల్ (కృష్ణా-2) 2173 టీఎంసీల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. ఈ రెండు ట్రైబ్యునళ్లు తేల్చినదానికంటే ఏటా 875 టీఎంసీల లభ్యత అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ లెక్కలు చెబతున్నాయి. అయితే 50ఏళ్లు లేదా వందేళ్ల ప్రవాహాల ఆధారంగా లెక్కలు తీస్తేనే కచ్చితమైన వివరాలు వస్తాయని అధికారులు పేర్కొటున్నారు.
Updated Date - Oct 01 , 2024 | 04:56 AM