Hyderabad: పాలనా యంత్రాంగం ప్రక్షాళన!
ABN, Publish Date - May 30 , 2024 | 04:09 AM
రాష్ట్రంలో పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో శాఖ అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేస్తూ పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నాయి. జూన్ 4వ తేదీలోపు సమాచారం పంపాలని కోరుతున్నాయి. ఈ తేదీ నాటికి అంతా సిద్ధం చేసి, ప్రభుత్వం ఎదుట ఉంచనున్నాయి.
రాష్ట్రంలో జూన్ 5 నుంచి 7 వరకు పెద్దఎత్తున బదిలీలు
సిబ్బంది వివరాలు తెప్పించుకుంటున్న శాఖలు.. సాగు నీటి శాఖలో అంతర్గత ఉత్తర్వులు
హైదరాబాద్, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో శాఖ అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేస్తూ పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నాయి. జూన్ 4వ తేదీలోపు సమాచారం పంపాలని కోరుతున్నాయి. ఈ తేదీ నాటికి అంతా సిద్ధం చేసి, ప్రభుత్వం ఎదుట ఉంచనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే.. అంటే, 5వ తేదీ నుంచి మొదలుపెట్టి 11 వరకు ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. కాగా, పాలనా యంత్రాంగం మొత్తాన్ని మార్చాలన్న ఆలోచనతో సర్కారు ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో కొందరు అధికారులు, ఉద్యోగులు ఒకేచోట పాతుకుపోయారని గుర్తించింది. దీంతో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని భావిస్తోంది. ఇటీవల ఏసీబీ సోదాల్లో చిక్కుతున్న అధికారులే దీనికి నిదర్శనమని చెబుతోంది.
ఈ నేపథ్యంలోనే భారీ మార్పులు తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎ్‌సలను పలుసార్లు బదిలీ చేసినా.. కిందిస్థాయి ఉద్యోగులను పెద్దగా కదిలించలేదు. కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. కొన్ని సంస్థల్లో నాన్ ఐఏఎ్‌సలదీ ఇదే తీరు. ఇలాంటివారితో పాటు కింది స్థాయిలో చాలాకాలంగా ఉన్నవారిని బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సాగు నీటి పారుదల శాఖ బుధవారం అంతర్గత సర్క్యులర్ (మెమో నం.4001/ఎ్‌సఈఆర్.2/ఏ1/2024) జారీ చేసింది. ఐదేళ్ల సర్వీసు కాలాన్ని లెక్కలోకి తీసుకుంటున్నట్లు వీటి ద్వారా తెలుస్తోంది. ఈ నెల 31 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఏఈఈలు/ఏఈలు, డీఈఈలు, ఈఈలు, ఎస్‌ఈలు, సీఈలు, ఈఎన్‌సీల వివరాలను పంపాలని ఆదేశించింది. ఎవరిపైనైనా క్రమశిక్షణాపరమైన కేసులు, ప్రతికూల రిమార్కులు ఉన్నాయా అన్నది కూడా వివరించాలని కోరింది. కీలక స్థానాల (ఫోకల్ పాయింట్ల)లో పనిచేస్తున్నవారిని కీలకం కాని (నాన్ ఫోకల్) చోటకు, నాన్ ఫోకల్‌లో ఉన్నవారిని ఫోకల్‌కు మార్చాలన్న నిబంధనలకు అనుగుణంగా బదిలీలు ఉంటాయని తెలిపింది. ఇలా అన్ని శాఖలు అంతర్గత ఉత్తర్వులను జారీ చేస్తున్నాయి. జూన్ 4ను గడువుగా ప్రస్తావిస్తున్నందున 5 నుంచి 11 వరకు ఎట్టి పరిస్థితుల్లో బదిలీలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంజనీరింగ్‌లో ఐదేళ్లు.. మిగతాచోట్ల రెండు, మూడేళ్లు
ఇంజనీరింగ్ శాఖల్లో సాంకేతిక ఇంజనీర్లు ఉండడం, ఇప్పటికే పనులు మొదలైన ప్రాజెక్టుల్లో పనిచేస్తుండడం వల్ల ఐదేళ్ల సర్వీసు కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగతా శాఖల్లో మాత్రం రెండు నుంచి మూడేళ్ల సర్వీసును ప్రామాణికంగా భావించవచ్చని సమాచారం. గతంలో బదిలీలకు మూడేళ్ల సర్వీసు నిబంధన వర్తించేది. దీన్ని రెండేళ్ల క్రితం రెండేళ్లకు తగ్గించారు. ఇప్పుడు మాత్రం రెండేళ్లా, మూడేళ్లా? అన్నదానిపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది. ఏదిఏమైనా అన్ని శాఖల్లో బదిలీలు తప్పనిసరి అన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
Updated Date - May 30 , 2024 | 04:09 AM